శేఖర్ కమ్ముల సినిమా అంటే..? అశ్లీలత ఉండదు, వెకిలి కామెడీ ట్రాకులుండవ్, అసభ్య సీన్లు, ఐటం సాంగ్స్ ఉండవ్, హీరోల స్వకుచమర్దనాలు ఉండవ్, ఇమేజీ బిల్డప్పులు, ఫార్ములా హీరోయిజాలు, వంశకీర్తనలుండవ్ వంటి ఏ చెత్తా ఉండదు… మంచి హైజినిక్ సినిమాలు, ఆర్గానిక్ సినిమాలు… కథలు కూడా లైటర్ వీన్‌లో సున్నితంగా నడుస్తూ సాగుతయ్… నేలవిడిచి సాము చేయడు, డబ్బు కోసం ‘వెకిలితనాన్ని’ తన సినిమాల్లోకి రానివ్వడు……… ఎస్, అదే తన బలం, ఓ కుటుంబం తమ పిల్లలతోపాటు ఏ ముందస్తు ఆందోళనలు లేకుండా హాయిగా థియేటర్‌కు వెళ్లొచ్చు… ఇండస్ట్రీలో ఉండాల్సిన కేరక్టర్ తను… అయితే అది ఒకరకంగా రిస్క్ కూడా… తన మార్క్ టేకింగ్ నుంచి ఏమాత్రం పక్కకు జరిగినా ప్రేక్షకుడికి రుచించదు… ఎందుకంటే..? శేఖర్ సినిమా అనగానే ప్రేక్షకుడికి ఓ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది… దానికి భిన్నంగా ఉంటే అది సినిమాకు బాగా మైనస్ అవుతుంది… బహుశా ఈ కారణం లవ్ స్టోరీ సినిమాకు మైనస్ కాబోతున్నదేమో…
సినిమా ప్రారంభమయ్యాక కొంతసేపటికే ఓ పెద్దింటమ్మాయి, ఏ పేదింటబ్బాయి తరహా కథ ముందుకొస్తుంది… వారి ప్రేమ కథ స్టార్టవుతుంది… అబ్బా, ఇంకా ఎన్నేళ్లు తీస్తార్రా ఈ కుల సినిమాలు, కనీసం కొత్తగా కూడా ఏమీ చెప్పడం లేదు అనుకునేలోపు… అసలు శేఖర్ కమ్ములకు ఈ తరహా కథలు సూటవుతాయా అని ఆశ్చర్యపడేలోపు లైంగిక వేధింపుల అంశం… జెండర్ వివక్ష, కులం వివక్ష, పిల్లలపై లైంగిక హింస, బతుకు తెరువు పోరాటం… కథ మరీ బరువైపోయింది… వెండితెర వంగిపోయింది… మిగతా దర్శకులకు వోకే, కానీ శేఖర్ కమ్ములకు దీన్ని ఎలా డీల్ చేయాలో ఓ దశలో అర్థం కాలేదు… కథ నిడివి పెరిగింది, ల్యాగ్ వచ్చేసింది… సీరియస్‌నెస్ పెరిగింది, మూవీ ఎలా కుదించాలో తెలియలేదు… ఏదో ఓ సింగిల్ లైన్ స్టోరీ తీసుకుని, నాలుగు మంచి పాటలు, అయిదారు మంచి సీన్లు రాసుకుని… ఈ తొక్కలో హీరోయిజాల్ని ప్రొజెక్ట్ చేయకుండా, వీలయితే హీరోయిన్ బలమైన కేరక్టరైజేషన్ మీద దృష్టి పెట్టి, పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ చేస్తుంటాడు… కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి..? విపరీతమైన హైప్ ఏర్పడింది… కరోనా కష్టాల తరువాత ఇక థియేటర్లు మళ్లీ కళకళలాడే ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, దీంతో పాత వైభవం రావల్సిందే, ట్రయిలర్లు, ప్రిరిలీజ్ బిజినెస్ కూడా క్లిక్కయ్యాయి అనుకున్నారు అందరూ… కానీ..?
Ads
ఇది మరీ థియేటర్లకు శ్రమకోర్చి, ఖర్చుకోర్చి, టైం వృథాకోర్చి… ‘జుంబా’రే అ జుంబరే’ అంటూ గంతులేసుకుంటూ పరుగులు తీయాల్సినంత సీన్ ఏమీ అనిపించదు… దానికి కారణం విపరీతమైన హైప్… దాంతో అంచనాలు పెరిగాయి… అదీ ఒకరకంగా దెబ్బే, అంచనాలు పెరిగినప్పుడు, ఏం తగ్గినా సినిమా బోల్తాకొడుతుంది… ఈమాత్రం సినిమాను ఓటీటీలో, టీవీలో చూస్తే సరిపోతుంది అనే భావన ఏర్పడింది… సినిమా బాగుంది, బాగా లేదని కాదు… ప్రేక్షకుడి టేస్టును బట్టి ఉంటుంది… కానీ శేఖర్ కమ్ముల సినిమా, సాయిపల్లవి హీరోయిన్ అనగానే తప్పకుండా ఫిదా వంటి ఇతర సినిమాలతో ప్రేక్షకుడు పోల్చుకుంటాడు… అక్కడ వస్తుంది తిరకాసు… మైనస్… పాటలు ఒకటీరెండు బాగానే ఉన్నయ్… కానీ అద్భుతమైన జనాదరణ పొందిన సారంగదరియా పాట సినిమాలో పెద్దగా ఇంపాక్ట్ కలిగించేలా లేదు, మిస్ ఫిట్… బయట చూస్తేనే బాగుంది… సారీ, చైతూ, ప్రస్తుతం నీ గ్రహచారం బాగాలేదు, సమంతతో సంసారం చిక్కుల గురించి మాత్రమే కాదు, కెరీర్ గురించి కూడా… బాగానే కష్టపడ్డావు, కానీ ఇంకా నువ్వు అప్‌టు మార్క్‌కు చాలాదూరంలో ఉన్నట్టే అనిపిస్తుంది… తెలంగాణ స్లాంగ్‌ను మరీ కృతకంగా పలికించడానికి బదులు శేఖర్ దాన్ని వదిలేస్తే పోయేది… కొన్ని పదాల ఉచ్చరణ అయితే మరీ ఇనుప గుగ్గిళ్లే…
సాయిపల్లవి బాగానే చేసింది, డాన్సులు చేసింది… అవసరమైన సీన్లలో ఉద్వేగాల్ని కూడా బలంగా ఎగ్జిబిట్ చేసింది… ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది..? ఈశ్వరీ వోకే… రాజీవ్ కనకాల ఉన్నాడు, ఉత్తేజ్ కూడా ఉన్నాడు… నిజానికి సినిమాలో చైతూ, పల్లవి… వాళ్లే అంతా… స్టార్ హీరోల ఫక్తు కమర్షియల్ సినిమాలకు ఫ్యాన్స్ రిలీజ్‌కు ముందు తీసుకొచ్చే హైప్ కొంత ఉపయోగకరం… అవి మంచి ఓపెనింగ్స్‌కు అవకాశమిస్తయ్… కానీ శేఖర్ కమ్ముల వంటి క్లీన్ అండ్ ఆర్గానిక్ కథకులకు ఇలాంటి భారీ హైప్ ఉపయోగపడదు… టీవీల్లో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు, పత్రికల్లో రోజుకొకరి హాఫ్ పేజీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ప్రచారంతో సినిమాను రిలీజుకు ముందే ‘అతి’ బాట పట్టించారు… పైగా తమ సమస్యలకు ఆ ప్రేమజంట ఆలోచించే సొల్యూషన్స్ నవ్వును, దర్శకుడి పట్ల ఒకింత జాలిని కలిగిస్తయ్… తీరా సినిమా చూశాక అనిపించేది ఏమిటయ్యా అంటే… ఇందులో అంత ఘనం ఏముందని ఇన్నాళ్లు రిలీజు ఆపుతూ వచ్చారు..? థియేటర్లలో మాత్రమే చూడాల్సిన సినిమా అని ఎందుకు భ్రమల్లో మునిగిపోయారు..? ఎప్పుడో ఏ ఓటీటీకే అమ్మేస్తే సరిపోయేది…!!
Share this Article