ఈమధ్య ఏదో సినిమాలో ఓ దర్శకుడు ప్రేమకూ, శృంగారానికీ నడుమ తేడాను చెప్పడానికి తెగప్రయాస పడ్డాడు..! ప్రేమ లేని సంభోగం రేప్‌తో సమానం అనీ, ప్రేమ అంటే సంభోగం మాత్రమే కాదనీ రకరకాల బాష్యాలు గట్రా చాలారోజులుగా వింటున్నవే, చదువుతున్నవే, చూస్తున్నవే… చాలామందికి ఆ తేడా తెలియదు… కేరళ హైకోర్టు ముందుకు రీసెంటుగా ఓ కేసు వచ్చింది… అదేమంటే..? 26 ఏళ్ల శ్యామ్ శివన్ పిటిషన్… ‘‘అయ్యా, ఆమె నా ప్రియురాలు, ఆమె నా మీద కేసు పెట్టింది… తన అనుమతి లేకుండా నేను ఆమెతో సంభోగించానని కేసు… ఇద్దరం ప్రేమలో ఉన్నాం అని చెప్పినా సరే దిగువ కోర్టు అంగీకరించలేదు, పోక్సో చట్టం కింద నాకు శిక్ష విధించింది… ఇద్దరు ప్రేమికుల నడుమ సంభోగం రేప్ ఎలా అవుతుంది..? దయచేసి, నా శిక్షను రద్దు చేసి, నాకు న్యాయం చేయండి’…’ ఇదీ తన అప్పీల్…
ఓ చిక్కు ప్రశ్న… ఆమె తనతో గడిపింది, ఇద్దరూ సంభోగ సుఖాన్ని అనుభవించారు, తీరా ఇద్దరి నడుమ ఎక్కడో తేడా వచ్చి, కొన్నాళ్ల తరువాత తనపై రేప్ కేసు పెట్టిందని అందరికీ పైపైన కలిగే సందేహం… ట్రయల్ కోర్టు ఆమె వాదనే పరిగణనలోకి తీసుకుంది, శిక్ష విధించింది, అతను హైకోర్టుకు వచ్చాడు… హైకోర్టు జడ్జి జస్టిస్ నారాయణ పిశారది ఈ కేసును డిఫరెంటు కోణంలో చూశాడు… కోర్టు ఏమన్నదంటే… ప్రేమ అనేది సంభోగానికి గ్రీన్ సిగ్నల్ కాదు… ప్రేమించినంత మాత్రాన సంభోగానికి అనుమతి ఇచ్చినట్టు కాదు… అసహాయత, తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవడం, సంభోగించడం అంటే దాన్ని అనుమతితో కూడిన కలయిక అని భావించనక్కర్లేదు… అలాంటి స్థితిలో అది అత్యాచారమే అవుతుంది… సమ్మతితో కూడిన సమర్పణ వేరు, నిస్సహాయతలో సమర్పణ వేరు… ‘‘సమ్మతి అంటే పూర్వాపరాలు ఆలోచించి తీసుకునే నిర్ణయం, కానీ లొంగిపోవడం అంటే సమ్మతించినట్టు కానేకాదు..’’
Ads
2013 నుంచీ ఈ నిందితుడికీ ఆ అమ్మాయితో రిలేషన్ షిప్ ఉంది… ఇద్దరూ మైసూరు వెళ్లారు ఓసారి, అక్కడ ఆమె అంగీకారం లేకుండానే సంభోగించాడు… ఆమె బంగారు ఆభరణాలను కూడా ఆమెకు ఇష్టం లేకుండా అమ్మేశాడు, తరువాత గోవా తీసుకుపోయాడు, అక్కడా ఇదే పని… ఇదీ పోలీసులు పెట్టిన కేసు సారాంశం… ‘‘నాతో రాకపోతే, చెప్పినట్టు వినకపోతే మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు, విధిలేక భయంతో ఆమె అతను చెప్పినట్టు చేసింది తప్ప ఇందులో ఆమె ఇష్టం ఏమున్నట్టు..? ఆ సంభోగానికి ఎలా సమ్మతించినట్టు..?’’ ఇదీ కోర్టు అబ్జర్వేషన్… ఇంట్రస్టింగు… అమ్మాయి వయస్సు సరిగ్గా ఇంకా నిర్ధారణ కాలేదు గనుక ట్రయల్ కోర్టు పోక్సో కింద విధించిన తీర్పును తాత్కాలికంగా నిలిపేసింది… కానీ ఆ నిందితుడి చర్య రేప్ కింద పరిగణించవచ్చునని పేర్కొంది… ఇక్కడ మదిని తొలిచే ప్రశ్న… సపోజ్, ఇద్దరు ప్రేమికులు, పెళ్లి చేసుకుంటానన్నాడు, కొన్నాళ్లు కలిసి ఉన్నారు లేదా సంభోగసుఖాన్ని అనుభవించారు… తరువాత ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రలోభపెట్టి, లొంగదీసుకున్నాడు, నా ఇష్టపూర్తిగా నన్ను సమర్పించుకోలేదు అని కేసు పెడితే, అది కూడా రేప్ కిందకు వస్తుందా..? జస్ట్, అకడమిక్ ప్రశ్న…!!
Share this Article