ఎవడో తీటగాడు… సోషల్ మీడియాలో హైటెక్ సిటీ కనిపించే ఓ పాత ఫోటో పెట్టి ఏదో కూశాడు… ఖాళీగా రోడ్లు కనిపిస్తున్నాయి… మేం వెళ్లిపోతే ఇలా ఉంటుంది హైదరాబాద్ అని… అంటే, హైదరాబాద్ ప్యూర్ సెటిలర్ అని అర్థమవుతూనే ఉంది…
సందర్భం ఏమిటి..? ఏమీ లేదు… తీట… వేలాదిగా, లక్షలాదిగా వోటర్లు ఆంధ్రాలో వోట్లు వేయటానికి తరలిపోయారు కదా, దాన్నిలా చెప్పాడన్నమాట… దానికి కొందరు తెలంగాణవాదులు ఆవేశం తెచ్చుకుని కౌంటర్లు పడేశారు… ‘ఈ గడ్డ మీద బతుకుతూ, ఈ తిండి తింటూ, ఈ గాలి పీలుస్తూ… మా రాష్ట్రం మాకు వచ్చాక కూడా మీకు తగ్గలేదురోయ్… ఇక్కడే కాదు, మీరు ఏ దేశం వెళ్లినా, ఏ ప్రాంతం వెళ్లినా అక్కడ సంస్కృతిలో, అక్కడ జనజీవనంలో మమేకం కాలేరు’’ ఇలా చాలా కౌంటర్లు…
సరే, సోషల్ మీడియా అన్నాక ఈ కూతలు, ఈ వాతలు గట్రా కామనే గానీ… మొత్తం నగరం ఖాళీ, రోడ్లు ఖాళీ, మాల్స్ ఖాళీ, థియేటర్లు ఖాళీ, పోలింగ్ స్టేషన్లు ఖాళీ… నగరం బోసిపోయింది… అందరూ ఆంధ్రా బాట పట్టారు, అందుకే పోలింగ్ ఢమాల్ అని బోలెడు సైట్లు, టీవీలు కూడా పెడాపెడా రాసిపారేశాయి… నిజమేనా..? వోటింగు తగ్గిందా..? నో… సింపుల్‌గా చెప్పాలంటే నో… ఫ్రీ బస్సులు పెట్టినా, రానుపోను ఖర్చలు భరించినా సరే, అంత నెగెటివ్ ప్రభావం పెద్దగా ఏమీ లేదు…
Ads
నిజానికి హైదరాబాద్ నియోజకవర్గంలో బోగస్ వోట్లు ఎక్కువ… ఆంధ్రా, తెలంగాణల్లో కూడా డబుల్ వోట్లు సరేసరి… ఈసారి ఏదో భారీ సంఖ్యలో బోగస్ వోట్లను తొలగించినట్టు కూడా వార్తలొచ్చాయి… గతంలో హైదరాబాద్‌లో పోటీ ఏకపక్షం… కాంగ్రెస్, టీఆర్ఎస్ ముందే వదిలేస్తే బీజేపీ ఉనికి కోసం పోరాడేది… పలు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఏజెంట్లు కూడా దొరికేవారు కాదు… కానీ ఈసారి ఒవైసీకి మాధవీలత మంచి ఫైట్ ఇచ్చింది… గెలుపో ఓటమో జానేదేవ్…
సేమ్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కూడా మంచి టఫ్ ఫైట్ జరిగింది… చేవెళ్ల నియోజకవర్గంలో కొంత రూరల్ వోట్లున్నాయి కానీ సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాలు గతంకన్నా ఏమైనా తగ్గాయా..? ఓసారి చూద్దాం…
హైదరాబాద్‌లో గతం 44.94, ఈసారి 48.48… మరిక పోలింగ్ ఎక్కడ తగ్గినట్టు..? సికింద్రాబాద్‌లో గతం 46.50, ఈసారి 49.04 శాతం… ఇక్కడా పెరిగిందిగా… మల్కాజిగిరిలో గతం 49.63, ఇప్పుడు 50.78 శాతం… ఒక శాతం పెరిగింది కూడా… సరే, చేవెళ్లకు వద్దాం… గతంలో ఇది 53.25 శాతం, ఈసారి 56.50 శాతం… సో, ఎక్కడా తగ్గలేదు, సరికదా పెరుగుదలలో మెరుగు…
నిజానికి హైదరాబాద్ మాత్రమే కాదు, ఏ మెట్రో సిటీని చూసినా పోలింగ్ శాతాలు తక్కువే ఉంటాయి… హైదరాబాద్ సిటీలో కూడా ఎప్పుడూ తక్కువే ఉంటుంది… ఉద్యోగులు, మేధావులు, చదువుకున్నవాళ్లు కూడా ఇళ్లు కదలరు… నిర్లిప్తత… కొందరు సెలవు దొరికింది కదాని టూరిస్ట్ ప్లేసులకు జంప్… సో, వాస్తవంగా ఈసారే బెటర్… నో ప్రాబ్లం… సగటున యాభై శాతం వోటింగ్ అంటే తక్కువేమీ కాదు, సిగ్గుపడేదీ కాదు..!!
Share this Article