John Kora………. సాధారణ ఎన్నికల్లో మరో దశ మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు జరిగిన 6 దశల పోలింగ్ సరళిని గమనిస్తే.. దేశవ్యాప్తంగా పోలింగ్ శాతం తగ్గింది. 2014, 2019 జనరల్ ఎలక్షన్స్ కంటే 2024లో ప్రజలు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలిసింది. అయితే ఈ పోలింగ్ సరళి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో పలు రకాలుగా నమోదైంది.
దక్షిణ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా.. పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో తక్కువగా పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరగ్గా.. మిగిలిన రాష్ట్రాల్లో తగ్గుదల నమోదు కావడం గమనార్హం. తొలి ఆరు దశల్లో 485 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించగా.. 132 నియోజవకర్గాల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది.
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన దగ్గర నుంచి ఈ సారే అతి తక్కువగా ఓటింగ్ శాతం నమోదైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తక్కువ పోలింగ్ నమోదు కావడానికి గల కారణాలను నిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.
Ads
బలమైన పోటీ లేని రాష్ట్రాల్లో ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. గుజరాత్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నది. అక్కడ 2019లో కంటే 4.4 శాతం తక్కువ పోలింగ్ నమోదైంది. కేరళలోని పార్టీలన్నీ ‘ఇండియా’ కూటమిలో ఉన్నాయి. దీంతో ఓటర్లు ఎవరు గెలిచినా పెద్దగా నష్టమేంలేదనే అంచనాలు వేసుకున్నారు. ఇక్కడ కూడా 6.6 శాతం తక్కువ పోలింగ్ నమోదైంది.
మరోవైపు వలసల ఎక్కువగా ఉండే బీహార్‌లో పోలింగ్ సమయానికి చాలా మంది సొంత ఊర్లకు తరలి వస్తారు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి కనపడలేదు. పైగా ఇక్కడ పురుష, మహిళా ఓటర్ల మధ్య భారీ వ్యత్యాసం కనపడుతోంది. బీహార్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేసినట్లు తెలిసింది.
అయితే ఓటింగ్ సరళిని బట్టి చూస్తే దక్షిణాదితో పాటు తూర్పు రాష్ట్రాలైన ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల ఓటర్లు కేంద్రంలో ప్రభుత్వ మార్పిడిని కోరుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక బీహార్, యూపీలో వలసల కారణంగానే తక్కువ పోలింగ్ నమోదయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మరో వైపు తీవ్రమైన ఎండలు కూడా ఓటింగ్ తక్కువగా నమోదు కావడానికి కారణమై ఉండొచ్చనే వాదన కూడా ఉంది. ఏదేమైనా.. గత 15 ఏళ్లలో దేశంలో అతి తక్కువ పోలింగ్ జరిగింది మాత్రం ఈ సారే అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి ఇది దేనికి సంకేతమో వేచి చూడాలి. (ది హిందూ పత్రిక ఇన్‌పుట్స్) #భాయ్‌జాన్
Share this Article