Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఏసీ కూపేలోకి అడుగుపెట్టేసరికి ఘాటుగా నాటుసారా వాసన..!

February 10, 2025 by M S R

.

Veerendranath Yandamoori …….. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే విశ్రమించటానికి విశాలంగా ఉన్న ఆ మొదటి తరగతి కూపేలోకి అడుగుపెట్టే సరికి కడుపులో తిప్పినట్టయింది. లోపలంతా నాటు సారాయి వాసన. కిటికీ దగ్గర కూర్చుని ఒక వ్యక్తి కాగితం పొట్లంలో ఇడ్లీ తింటున్నాడు.

తైలసంస్కారం లేని జుట్టు, మాసిన గెడ్డం. చిరిగి పోవటానికి సిద్ధంగా ఉన్న బట్టలు. అతన్ని చూడగానే నాకు కలిగిన మొట్టమొదటి అభిప్రాయం- ‘ఇతను ‘ఇక్కడ’ ఎలావున్నాడు?’

Ads

రైలు కదలటానికి సిద్ధంగా వున్నది. అతడు పెట్టెలోనే తాగుతూ ఉండి ఉండాలి. లేకపోతే ఇంత వాసన రాదు. అతని పక్కన కూర్చోవటం ఇష్టంలేక, పై బెర్తు మీదకు చేరుకున్నాను. అక్కడ లైటు వేసుకుని, మరుసటి రోజు ఇవ్వవలసిన ఉపన్యాసాన్ని చూసుకుంటూ క్రమంగా నిద్రలోకి జారుకున్నాను.

అర్ధరాత్రి ఎవరో టకటకా కొడుతూండటంతో మెలకువ వచ్చింది. తలుపు తీస్తే బయట అటెండరు! అతడు చెప్పిన విషయం విని విసుగు మరింత ఎక్కువైంది. కాలింగ్‌ బెల్‌కీ… దీపం స్విచ్‌కీ తేడా తెలియని నా తోటి ప్రయాణికుడు చేసిన నిర్వాకం వలన బయట బెల్లు మోగి అటెండరు వచ్చాడు. క్షమాపణ చెప్పి అతడిని పంపించి వేశాను.

నీటి కోసం లైటు వేయబోయి మరో స్విచ్ నొక్కానని అతడు అనుకోవటంలేదు. అసలు అలాంటి కాలింగ్‌ బెల్‌ స్విచ్ అనేది ఒకటుంటుందని కూడా బహుశ అతడికి తెలిసి వుండదు. అందుకే ఏ మాత్రం అపరాధ భావన లేకుండా, తిరిగి నేను నా బెర్తు ఎక్కేలోపులోనే మంచినీళ్ళు తాగి, కనీసం ‘సారీ’ కూడా చెప్పకుండా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.

మరో రెండు గంటలు గడిచాయి. ఎవరో తడుతున్నట్టయి గాఢ నిద్రలోంచి మెలకువ వచ్చింది. తలుపు ఎలా తెరవాలో తెలియక నన్ను తట్టి లేపుతున్నాడు. నేను కళ్ళు విప్పగానే ‘టాయిలెట్‌కి వెళ్ళాల’న్నట్టు అభ్యర్ధించాడు. తలుపు హుక్కు ఎలా తీయాలో, పక్కమీద నుంచి లేవకుండానే చెప్పాను. నా కంఠంలో విసుగు నాకే స్పష్టంగా వినపడింది.

అమితమైన తాగుడు వలన చేతులు పైకెత్తటానికి భుజాలు సహకరించక అతడు కష్టపడసాగాడు. రైలు వేగంగా కదుల్తూ వుండటంతో కనీసం స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. నాకిక తప్పలేదు. కిందికి దిగి తలుపు తీసి, అతడు టాయిలెట్‌కి వెళ్ళి వచ్చేవరకూ వుండి పక్క చేరాను.

అంతలో అతడి ఫోను మ్రోగింది. నా సహనానికి పరీక్ష పెడుతున్నట్టు అతడి కంఠం రాజకీయ ఉపన్యాసకుడి స్వరం కన్నా హెచ్చు స్థాయిలో ఉన్నది. ఇంతకీ, అతడు మాట్లాడుతున్నది “కొన్ని గంటల క్రితం తనకి వీడ్కోలు ఇవ్వటానికి స్టేషను కి మనవడితో” అని ఆ సంభాషణ బట్టి అర్ధమైంది.

‘నిరాటంకంగా నిద్రపోవటం కోసం కొందరు ఖరీదయిన టికెట్లు కొనుక్కుంటారు. వారిని బాధించటం కోసం అర్ధరాత్రి వరకూ కబుర్లు చెప్పుకునేవారు పక్కన చేరుతారు. నా దురదృష్టం కొద్దీ ఈ రాత్రి ఈ ఉచిత పాసువాడి బారిన పడ్డాను’ అని తిట్టుకుంటూంటే నిద్రపట్టలేదు.

ఇక ఆలోచించబుద్ధిగాక నా ఉపన్యాసం చదవసాగాను. ఆ రోజు నా సబ్జెక్టు “భావోద్వేగాల సానుకూల నియంత్రణ” గురించి. అది చదువుతూంటే మనసులో చిరాకు కాస్త తగ్గినట్టు అనిపించింది. మరోవైపు తెల్లవారసాగింది. మొహం కడుక్కుని వచ్చేసరికి మరింత ఫ్రెష్‌గా అనిపించింది. లోపలికొస్తూంటే అతడు కొద్దిగా జరిగి వినమ్రంగా నమస్కరించాడు.

గమ్యం చేరటానికి మరో గంట సమయం ఉంది. నా మనసు కూడా ప్రశాంతంగా వుండటంతో అతడితో సంభాషణ ప్రారంభించాను. మాటల సందర్భంలో అతడు మరణానికి చాలా దగ్గరలో వున్నాడని తెలిసి నిశ్చేష్టుడనయ్యాను.

మహా అయితే మరో కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతానని అతడు చెపుతూంటే, వెన్ను మీద పాము పాకిన భావనతో ఒళ్ళు వణికింది. అతడి ప్రవర్తన వెనుక ఒక్కొక్క కారణమే విశదమైంది.

నేను అనుకున్నట్టు అతడు రైల్వే ఉద్యోగి కాదు. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సిటీలో హోటల్‌ రిసెప్షనిస్ట్. చిన్నవాడు సౌదీలో కూలీ. సౌకర్యంగా వుంటుందని తండ్రికి ఖరీదైన టికెట్టు పంపింది అతడే. పెద్ద కొడుకునీ, మనవడినీ చూసి తిరిగి గ్రామానికి వెళ్ళిపోతున్నాడు.

తన మనవడిని బహుశా ఇక చూడలేనేమోనని చెబుతున్నప్పుడు అతడి కంఠం గాద్గదికమైంది. మనసు బోనులో నేరస్తుడిలా నిలబడ్డాను. పేగుల్లో కేన్సర్ వలన అతడికి శస్త్రచికిత్స జరిగింది. నేను ఆల్కహాల్ అనుకున్న స్పిరిట్‌ వాసన మందుల వలన వచ్చింది.

కండరాల బలహీనత వలన అతను భుజాలు పైకెత్తలేకపోయాడే తప్ప తాగుడు వలన కాదు. రెండు మూడు గంటలకు ఒకసారి ఏదైనా మెత్తటి పదార్ధం తినటం తప్పనిసరి అని డాక్టర్లు చెప్పటం వలన ఇడ్లీలు తెచ్చుకున్నాడు.

అప్పుడే నాకొక విషయం అర్ధమైంది. రాత్రి నా చిరాకుకి కారణం అతడి ప్రవర్తన కాదు. తోటి ప్రయాణికుడిగా అతడిని అంగీకరించలేని నా అహంభావానిది. అదే స్థానంలో ఒక ‘ఖరీదైన’ వ్యక్తి ఉంటే, అతడి విస్కీ వాసనని నవ్వుతూ భరించేవాడిని. తలుపు కొక్కెం అంత బలంగా పెట్టినందుకు రైల్వేవారిని తిడుతూ అతనికి సాయం చేసేవాడిని.

ఆ సమయంలో నాకొక పాత ఆఫ్రికన్ కథ గుర్తొచ్చింది. అందరూ వేటకి వెళ్ళిపోయాక గుడిసె ముందు కూర్చుని మనవడితో తీరిగ్గా కబుర్లు చెపుతున్నాడు ముసలి నాయకుడు. “నా మనసులో రెండు జంతువులు ఎప్పుడూ పోరాడుకుంటూ ఉంటాయిరా చిన్నా..! ఒకటి రక్కసి. దుర్మార్గురాలు. మరొకటి మంచిది. సాధుస్వభావురాలు. నిరంతరం వాటి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. భయంకరమైన యుద్ధం…”

మనవడు కుతూహలంగా “ఏది గెలుస్తుంది?” అని అడిగాడు. దూరపు కొండల మీద నిశ్చలంగా వున్న చెట్లపై తన నిస్తేజమయిన చూపు నిలిపి అభావంగా చెప్పాడా వృద్ధుడు “నేను దేనికి తిండి పెడితే అది..!” (లోయ నుంచి శిఖరం – పుస్తకం నుంచి)…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions