.
Rochish Mon…. ‘దేశంలో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఒక సినిమా కవి కూడా కారణం’ అయ్యాడు; ఆ కవి వాలి!
కలం పేరు వాలి; అసలు పేరు టీ.ఎస్. రంగరాజన్. శ్రీరంగం వైష్ణవుడు వాలి. దశావతారం సినిమాలో తన పాటకు తఖల్లుస్ (నామ ముద్ర)గా తన రంగరాజన్ పేరును వాడుకున్నారు.
Ads
తొలిదశలో ఒక డబ్బింగ్ పాటలో ఇలా రాశారు వాలి:
“రాయి అవడమూ, పండు అవడమూ దేవుని చేతి రాత
అది కల అవడమూ నిజమవడమూ మనిషీ నీ తలరాత”
నాలుగు వేలకు పైగా తమిళ్ష్ సినిమా పాటలు రాశారు వాలి. తొలి దశలో కణ్ణదాసన్‌ను అనుకరిస్తూ రాసేవారు. వాలి రాసిన ఒక పాట విని “ఈ పాటను నేనెప్పుడు రాశాను?” అని కణ్ణదాసన్ తన అబ్బాయిని అడిగారట. కణ్ణదాసన్ పోయాక ఆయనకు తొలి నివాళిగా వాలి ఇలా అన్నారు…
“దేవుడు తన తొందరపాటుతనంతో తను రాసుకున్న అందమైన కవితా పుస్తకాన్ని తనే చించేసుకున్నాడు”. తాను పోయాక తన మరణంపై తొలి కవిత వాలి రాయాలని స్వయంగా కణ్ణదాసన్ కోరుకున్నారు. కణ్ణదాసన్‌పై మర్యాదకు మించిన భక్తితో “కాళిదాసన్, కణ్ణదాసన్ కవితవు నువ్వు / దరికి రా చదవచ్చు, అస్వాదించచ్చు” అని రాశారు వాలి.
తాను నిరాశా నిస్పృహలతో అలమటిస్తున్న దశ నుంచి తాను కవిగా విజయవంతమై గొప్ప జీవనం గడపడానికి కణ్ణదాసన్ పాటే కారణం అని పలుమార్లు చెప్పారు వాలి. ప్రముఖ కవిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న తరువాత కూడా తొలి రోజుల్లో దినసరి ఖర్చులకు రూపాయాల కోసం పీ.బీ. శ్రీనివాస్ దగ్గర చెయ్యి చాచే వాణ్ణి అని బహిరంగంగా చెప్పుకున్నారు వాలి. వాలిని నిలబెట్టిన కణ్ణదాసన్ పాట పీ.బీ. శ్రీనివాస్ పాడిన పాటే.
- జీవనం గడవక, విరక్తితో మద్రాసు వదలి సొంత ఊరుకెళ్లిపోదాం అనుకుంటూ మధనపడుతున్న రోజుల్లో ఒకరోజు పీ.బీ. శ్రీనివాస్ దగ్గర తిండి ఖర్చులకు డబ్బులు తీసుకుంటూ ఇవాళ ఏ పాట పాడారు అని పీ.బీ.ఎస్.ను అడిగారు వాలి. తాను పాడిన కణ్ణదాసన్ పాటను వాలికి పాడి వినిపించారు పీ.బీ.ఎస్. ఆ పాటను విన్న వాలి తన విరక్తిని వదులుకుని ఎదురీదడానికి నిర్ణయించుకున్నారు; అటుపై ఘన విజయవంతమయ్యారు.
.
వాలి కావ్య కవిగానూ ప్రసిద్ధికెక్కారు. రామాయణాన్ని అవతార పురుషన్ (అవతార పురుషుడు) పేరుతోనూ, భారతాన్ని ‘పాణ్డవర్ బూమి’ (పాండవుల భూమి) పేరుతోనూ తనదైన కొత్త శైలిలో అంటే అంత్య ప్రాసల వచనా కవితా ధోరణిలో వాలి రాశారు.
భారతాన్ని ‘పాణ్డవర్ బూమి’ (పాండవుల భూమి) అన్న పేరుతో రాయడంలోనే వాలి ఎత్తు తెలియవస్తోంది.
‘1967లో డీ.ఎమ్.కె. పార్టీ అధికారంలోకి రావడానికి వాలి ఒక కారణం!’ స్వయంగా అణ్ణాదురై ఆ విషయాన్ని చెప్పారు. ఎమ్.జీ.ఆర్., కణ్ణదాసన్ మధ్య వైరుద్ధ్యాలు రావడంతో 1963 నుంచీ ఎమ్.జీ.ఆర్. పాటలు పెద్ద శాతం వాలి రాసేవారు. ఆ పాటల్ని ఎమ్.జీ.ఆర్. ఇమేజ్ పరంగా రాసేవారు. అవి జనాల్లోకి ఎమ్.జీ.ఆర్. భావాల్ని తీసుకెళ్లాయి. ఆ పరిణామం డీ.ఎమ్.కే. విజయకారణాల్లో ఒకటి. ఒక సినిమా కవి వాలి ఒక పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అవడం విశేషం.
వాలి ఫక్తు ఒక కమర్ష్అల్ సినిమా కవి. ఏ పాటైనా రాస్తారు. “నేను డబ్బు కోసమే సినిమా పాట రాస్తున్నాను” అని బహిరంగంగా చెప్పుకున్నారు.
“మట్టి గుడిసె వాకిలి అంటే
తెమ్మెర వీచడానికి అయిష్టపడుతుందా?
రాత్రి జాబిలి బీదవాడంటే
వెన్నెల నివ్వడం ఆపేస్తుందా?” అనీ, “ప్రేమ అనేది వాన అయితే ఆమె కళ్లే కదా నల్లమబ్బులు” అనీ “అగ్నీ నీకు తీరని ఆకలా?” అనీ మంచి మంచి వెన్నో రాశారు.
‘అత్తైమడి మెత్తై అడి” (అత్త ఒడి పరుపమ్మా) అని వాలి రాసిన దాన్ని ‘అత్త ఒడి మెత్తనమ్మా’ అని ఆత్రేయ తెలుగులోకి తెచ్చారు.
వాలికి నివాళిగా ఆయన పాటకు నా అనువాదం…
కన్ను వెళ్లిన తీరులో కాలు వెళ్లచ్చా?
కాలు వెళ్లిన తీరులో మనసు వెళ్లచ్చా?
మనసు వెళ్లిన తీరులో
మనిషి వెళ్లచ్చా?
మనిషి వెళ్లిన దారిని మరిచిపోవచ్చా?
నువ్వు చూసిన చూపులు కలతో పోతాయి
నువ్వు అన్న మాటలు గాలితో పోతాయి
ఊరు చూసిన నిజాలు నీ కోసం జీవిస్తాయి
అవగతం చేసుకోని వాళ్లకు వ్యర్థమైపోతాయి
కుహనా వ్యక్తులు కొందరిది కొత్త నాగరికత
అర్థంకాని పలువురికి ఇది నాగరికత
పద్ధతిగా బతికే వాళ్లకు ఏది నాగరికత?
ముందటి వాళ్లు చెప్పారు అది నాగరికత
సరిదిద్దుకోని హృదయాలు ఉండీ ఏం లాభం?
నొచ్చుకోని ఆకృతులు పుట్టీ ఏం లాభం
ఉన్నా పోయినా పేరు చెప్పుకోవాలి
ఇలాంటి వ్యక్తి ఎవరు అని ఊరు మాట్లాడుకోవాలి
1965లో పణం పడైత్తవన్ సినిమాలో ఎమ్.జీ.ఆర్. కోసం రాసిన పాట ఇది. అరవైయేళ్ల క్రితం రచన ఇప్పటికీ అన్వయమౌతుందేమో కదా?
(పాట లింక్ https://youtu.be/8qoOGA-2Ono?si=4AwbhVE5qMpCOcOz )
వాలి స్మరణలో…… తమిళ్ష్ కవి వాలి (1931-2013) జయంతి నిన్న… రోచిష్మాన్ 9444012279
Share this Article