Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తల్లీకూతుళ్లకు హీరోగా నటించిన ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్ ఒక్కడేనేమో..!!

August 24, 2024 by M S R

మూడు నాలుగు తరాల హీరోయిన్లతో నటించిన హీరోలు దేశంలో చాలామంది ఉండి ఉండవచ్చు . తల్లీకూతుళ్ళతో హీరోగా నటించిన నటుడు తెలుగు ఇండస్ట్రీలో NTR ఒక్కరేనేమో ! సంధ్య – జయలలితలు , అమ్మాజీ – జయచిత్రలు . 1976 లో వచ్చిన ఈ మా దైవం సినిమాలో మొదటిసారిగా జయచిత్ర NTR జోడీగా నటించింది .

హిందీలో హిట్టయిన దో ఆంఖే బారా హాథ్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా తీసారు . ఈ హిందీ సినిమా గురించి తప్పక వివరంగా చెప్పుకోవాలి . ఈ హిందీ సినిమాలో హీరోగా నటించిన శాంతారామే నిర్మాత , దర్శకుడు కూడా . ఆయన భార్య సంధ్యే హీరోయిన్ . సినిమా క్లైమాక్సులో బుల్ ఫైట్ ఉంటుంది . ఆ ఫైట్లో శాంతారాంకు చూపు పోతుంది . కొన్నాళ్ళు చీకటిని అనుభవించిన శాంతారాంకు సర్జరీ తర్వాత చూపు వస్తుంది .

ఆ వచ్చిన చూపు వలన చిత్ర పరిశ్రమలో ఓ అద్భుత కళాఖండం , ఓ దృశ్య కావ్యమయిన నవరంగ్ అనే సినిమా ఉద్భవించింది . సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా . సంధ్య నృత్యాలు మహాద్భుతం . ఏడు కుండలు నెత్తి మీద పెట్టుకుని చేసే డాన్స్ కోసం ఆ సినిమా ఓ అయిదారు సార్లు చూసి ఉంటా . ఈరోజుకీ ఈ నవరంగ్ సినిమాలో పాటలు ఆ తరం జనం చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి .

Ads

ఈ శాంతారాం తీసిన మరో సినిమా ఝనక్ ఝనక్ పాయల్ బాజే . అదో సూపర్ డూపర్ హిట్ . అందులో కూడా సంధ్యే హీరోయిన్ . హీరో ప్రముఖ నాట్య కళాకారుడు గోపీకృష్ణ . ఈతరం వారిలో ఈ మూడు హిందీ సినిమాలను చూడనివారుంటే మాత్రం అర్జెంటుగా వాచ్ లిస్టులో పెట్టేసుకోండి . ముఖ్యంగా నవరంగ్ , ఆ తర్వాత ఝనక్ ఝనక్ పాయల్ బాజే . రస హృదయులు , నాట్య ప్రియులు అసలు మిస్ కావద్దు .

ఇంక మన తెలుగు సినిమాకు వద్దాం . హీరో NTR ఒక జైలర్ . నేరస్తులను సంస్కరించవచ్చు అని ప్రగాఢంగా నమ్మే శాంతిప్రియుడు , సంస్కరణవాది . ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో ఆరుగురు కరుడుగట్టిన ఖైదీలను ఓపెన్ ప్రిజన్ మోడల్లో తెచ్చుకొని , వారిని సంస్కరించి , వారికి దైవం అవుతాడు . ఖైదీలుగా నాగభూషణం , నంబియార్ , ప్రభాకరరెడ్డి , పద్మనాభం , భీమరాజు , త్యాగరాజు నటించారు . హిందీ సినిమాలోని బుల్ ఫైటుని తెలుగులో తీసేసారు . అందుకనే తెలుగులో ఆ పేరుని పెట్టుకోలేక పోయిఉంటారు . ఇతర పాత్రల్లో జయచిత్ర , గిరిబాబు , రాజనాల , చలపతిరావు , కె వి చలం , జగ్గారావు ప్రభృతులు నటించారు .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు కొన్ని హిట్టయ్యాయి . మిగిలిన పాటలు థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి . బాల సుబ్రమణ్యం పాడిన ‘ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే’ పాట బాగా పాపులర్ అయింది . రాజశ్రీ వ్రాసారు . సి నారాయణరెడ్డి వ్రాసిన ‘మాఘమాసం మంగళవారం మామయ్యోచ్చాడు’ పాటను వాణీ జయరాం , ‘చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి’ పాటని బాల సుబ్రమణ్యం – సుశీలమ్మలు పాడారు . రెండూ చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాలు-సుశీలమ్మలు పాడిన మరో పాట ‘ఏదో ఏదో ఏదో ఉంది’ పాట , సుశీలమ్మ ఒక్కతే పాడిన ‘మనిషిలోని మనసు చూడు’ పాట బాగుంటాయి . డి వి నరసరాజు డైలాగ్స్ వ్రాసారు .

మంచి సినిమా . ఖైదీ బాబాయ్ సినిమా గుర్తుకొస్తుంది . ఆ సినిమాలో శిక్ష కోర్ట్ వేస్తుంది . ఈ మా దైవం సినిమాలో సంస్కరణవాది అయిన జైలర్ ప్రభుత్వ అనుమతితో ఓపెన్ ప్రిజన్ లోకి ఖైదీలను తెచ్చుకుంటాడు . ఖైదీ బాబాయ్ సినిమాలో కూడా జడ్జి గారు హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక అనుమతిని తీసుకునే బాధిత కుటుంబానికి సేవ చేయాలనే శిక్షను విధిస్తాడు . రెండు సినిమాల్లోను సంస్కరణ ఉద్దేశమే ఉంటుంది .

NTR బాగా నటించారు . ఫిఫ్టీస్ వయసులో ఉండి క్లైమాక్సులో డూప్ అవకాశం ఉన్నా , జీప్ వెంట అంత వేగంగా ఎలా పరుగెత్తాడు అనేది నాకు ఆశ్చర్యమే . జయచిత్రకు NTR తో మొదటి సినిమా అయినా చాలా చలాకీగా , బెరుకు లేకుండా నటించింది . సినిమా , విడి పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . సినిమా చూడని NTR అభిమానులు ఎవరయినా ఉంటే చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు      (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…
  • వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…
  • గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!
  • హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!
  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions