.
Subramanyam Dogiparthi ….. మరో విశ్వాస ఘాతుక కొడుకుల సినిమా . ఇలాంటి కధాంశంతో ఎన్ని సినిమాలు వచ్చాయో ! ఆల్మోస్ట్ పెద్ద హీరోలందరికి ఇలాంటి కధాంశంతో సినిమాలు వచ్చాయి . ఇది కృష్ణంరాజు సినిమా . కృష్ణంరాజు , జయసుధ , నిర్మలమ్మ అద్భుతంగా నటించారు .
కృష్ణంరాజు ఒక రవాణా కాంట్రాక్టర్ వద్ద అత్యంత విశ్వాసపాత్రుడయిన లారీ డ్రైవర్ . అతని విశ్వాసానికి ఫిదా అయిన ఓనర్ నూతన్ ప్రసాద్ , అతని భార్య రమాప్రభ వారి కుటుంబానికి చాలా సాయం చేస్తారు . ఆ సాయంతో ఎదిగి ఇద్దరు కొడుకులతో , ఒక కూతురితో హేపీ కుటుంబాన్ని నడుపుతుంటాడు .
సినిమా అన్నాక శకుని లాంటి కుళ్ళుబోతు విలన్ ఉండాలి కదా ! ఆ పాత్ర కోట శ్రీనివాసరావుది . అతనికి నూతన్ ప్రసాద్ మీద , కృష్ణంరాజు మీద కుళ్ళు , కచ్చ . ఎలాగోలా కృష్ణంరాజుని నాశనం చేయాలనే కడుపు నొప్పి .
Ads
అందుకు తగ్గట్లుగానే కోట శ్రీనివాసరావు కొడుకు శుభలేఖ సుధాకర్ కృష్ణంరాజు కూతురు పూర్ణిమ ప్రేమించుకుంటారు . ఒక కొడుకు తులసీరాం నూతన్ ప్రసాద్ కూతురు తులసి ప్రేమించుకుంటారు . మరో కొడుకు రాజేష్ అదే ఊళ్ళో అష్టకష్టాలు పడే ఫించను రాని స్కూల్ మాస్టారి కూతురు సంధ్యతో పెళ్లి జరిపిస్తాడు కృష్ణంరాజు .
ఇద్దరు కోడళ్ళు ఇంటికి రావడం , వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడటం , చివరకు తల్లిదండ్రులతో ఘర్షణ పడి వెళ్ళిపోతారు . వెళ్ళిపోయాక కూడా చిన్నప్పుడులాగానే తన్నుకుని హాస్పిటల్ పాలవుతారు . వాళ్ళకు బ్లడ్ కొరకు లారీ వేసుకుని టౌనుకెళ్ళి హీరోచితంగా రౌడీలతో యుధ్ధం చేస్తూ రక్తాన్ని తెచ్చి కొడుకుల్ని రక్షించుకుంటాడు . పోలీస్ ఇనస్పెక్టర్ అయిన శుభలేఖ సుధాకర్ కోటను , రౌడీలను అరెస్ట్ చేయడంతో సినిమా సుఖాంతం అవుతుంది .
సినిమాలో సుత్తి వేలు స్కూల్ మాస్టారిగా ఫించను కష్టాలు , ఆ కష్టాలను అనుభవించే ఆరోజుల్లో మాస్టారిగా సుత్తి వేలు అదరగొట్టేసారు . సినిమా ఏవరేజుగా ఆడినా మంచి సినిమా . కధాంశం రొటీనే అయినా కాస్త భిన్నంగా నేసారు విజయబాపినీడు . స్క్రీన్ ప్లేని గట్టిగా తయారు చేసుకున్నారు . ప్రధాన పాత్రల్ని చాలా బాగా మలిచారు .
వాసూరావు సంగీతం , భునవచంద్ర లిరిక్స్ శ్రావ్యమైన పాటల్ని అందించాయి . అందాల హరివిల్లు మా బొమ్మరిల్లు నవ్వులు పూచేటి ఓ పొదరిల్లు పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . అలాగే ఒట్టి మాయమాటలాడి ఓరి పిల్లడు జయసుధ , ఆమె స్నేహితురాళ్ళ మీద తోటలో బాపు లాగా చిత్రీకరించారు విజయబాపినీడు .
కృష్ణంరాజు మీద చిత్రీకరించబడిన ఈశ్వరా పరమేశ్వరా పాట కూడా బాగా తీసారు . కృష్ణంరాజు బాగా నటించారు . మరో పాట కసిరికొట్టి పొమ్మన్నా బుంగమూతి రమ్మంటోంది తులసి , తులసీరాం మీద ఓకే . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ పాటల్ని పాడారు .
సినిమా అంతా ఫుల్ సెంటిమెంట్ . జయసుధ ఇలాంటి తల్లి పాత్రలు అప్పటికే చాలా సినిమాల్లో వేసింది . ఆమెకు కొట్టిన పిండే . ఇతర ప్రధాన పాత్రల్లో నూతన్ ప్రసాద్ , రమాప్రభ , రాళ్ళపల్లి , కోట శ్రీనివాసరావు , నిర్మలమ్మ , తులసి , సంధ్య , శుభలేఖ సుధాకర్ , అశోక్ కుమార్ , పూర్ణిమ , రాజేష్ , తాతినేని రాజేశ్వరి , ప్రభృతులు నటించారు .
కృష్ణంరాజు స్వంత బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు డైలాగులను కాశీ విశ్వనాధ్ వ్రాసారు .ఫైట్లను బాంబే విక్కీ కంపోజ్ చేసారు . ఇంతకుముందు చూడనట్లయితే చూడొచ్చు . చూడబులే . యూట్యూబులో ఉంది .
నేను పరిచయం చేస్తున్న 1176 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article