….
ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్… ఆమె తన భార్య బ్రిజిట్… వియత్నాం వెళ్తూ విమానం దిగే ముందు ఆయన మొహంపై సరదాగా చరిచింది… నిన్నంతా ప్రపంచవ్యాప్తంగా మీమ్స్, జోక్స్, పోస్టులు… సోషల్ మీడియా ఊగిపోయింది…
అఫ్‌కోర్స్, సరదా వ్యాఖ్యలే… మరీ అప్పడాల కర్ర బాపతు వడ్డింపు కాదు కదా… అవన్నీ చదివి, విని, చూసి మాక్రాన్ కూడా నవ్వుతూ, అబ్బే, ఆమె కొట్టలేదోయ్, జస్ట్ అలా సరదాగా ఒకటేసింది అన్నాడు… ఐనా భర్తలను కొట్టే హక్కు భార్యలకు ఉండదా ఏం..? ఎంత దేశాధ్యక్షుడు అయితేనేం, ఆ భార్యకు భర్తే కదా…
Ads
అంతేకాదు, తను ఒకప్పుడు మాక్రాన్‌కు పాఠాలు చెప్పిన పంతులమ్మే కదా… అప్పటి నుంచీ ఇప్పటికీ అతను ఆమె దగ్గర నిత్య విద్యార్థే… నిజం… ఆసక్తికరమైన వాళ్ల ప్రేమకథ ఏమిటో తెలుసా..?
పారిస్ నగరానికి దూరంగా…, అమియాన్ అనే చిన్న పట్టణం… ఓ స్కూల్ కాంపౌండ్ లో చిన్న కుర్రాడు తన జీవితాన్ని మార్చేసే మహిళను కలిశాడు… ఆయన పేరు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్… ఆమె పేరు బ్రిజిట్ ట్రోగ్నెయు…
అతను 15. ఆమె 39. తాను చదువుతున్న స్కూల్‌లో ఆమె తన టీచర్. ఆమెకు అప్పటికే వివాహం అయిపోయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పెద్ద కూతురు కూడా మాక్రాన్ క్లాస్‌మేట్…
తను తన వయసు పిల్లలతో ఆడుకుంటూ కాలం గడిపే పిల్లవాడు కాదు. టీచర్లతో ముచ్చట్లు, పెద్దలతో చర్చలు – ఇవే అతనికి నచ్చిన దారులు. డ్రామా క్లాస్‌లో స్క్రిప్ట్‌లను చదువుతూ, పాత్రలను విశ్లేషిస్తూ, తన గురువుతో రాజకీయాలపై సంభాషిస్తూ, ఈ టీనేజ్ బాలుడు ఒక బంధాన్ని కలుపుకున్నాడు – అది మామూలు విద్యార్థి- గురువు సంబంధం కాదేమో…
ఆ వయస్సులో తనకు ఆ ఆకర్షణ ఏమిటో అర్థం గాకపోయినా… మాక్రాన్ తన కుటుంబానికి ఓ స్పష్టమైన వాక్యం చెప్పాడు – “మీరు నాకు బ్రిజిట్‌ను దూరం చేయొద్దు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను…” ఆ కుటుంబం మాన్పడిపోయింది మొదట… ఇదేం తిక్కరా అని మందలించింది… అంగీకరించలేదు… తను వినిపించుకోలేదు, పెళ్లి తప్పదు అన్నాడు… నీ ఖర్మ అని వదిలేశారు వాళ్లు చివరకు…
ఆ సమయంలో బ్రిజిట్ భర్త ఆండ్రే లూయి ఆజియెర్, ఓ బ్యాంకర్… ఆమె అతనితో అప్పటికే చాలా కాలం జీవితాన్ని గడిపింది… ముగ్గురు పిల్లల తల్లి… కానీ మాక్రాన్‌తో ఆమెకు ఏర్పడిన అనుబంధం ఆమె జీవితం దిశ మార్చేసింది…
ఈ ప్రేమ విషయం బయటపడిన తర్వాత కొద్దికాలంలోనే ఆమె మొదటి భర్తతో గొడవలు పెరిగి, చివరకు ఆ సంబంధం ముగిసింది… 2006లో విడాకుల తర్వాత, 2007లో, మాక్రాన్‌తో ఆమె వివాహం జరిగింది… ఆండ్రే ఆజియెర్ మళ్లీ మీడియాకు ఎప్పుడూ కనిపించలేదు… మళ్లీ పెళ్లి లేదు, 2019లో మృతి చెందాడు… కుటుంబం ఈ విషయాన్ని ఆయన మరణం తరువాతే 2020లోనే బయటపెట్టింది — గౌరవంగా, మౌనంగా…
మాక్రాన్ ప్రజల మనసు గెలుచుకుంటున్నంత వేగంగా, బ్రిజిట్ అతని జీవితంలో మరింత లోతుగా పాత్ర పోషించసాగింది… ఆమె రాజకీయాలపై ఎలాంటి అధికారిక పాత్ర పోషించకపోయినా… అతని ప్రసంగాల్ని మెరుగుపరిచింది, తన సాహిత్య పరిజ్ఞానం ద్వారా స్ఫూర్తి నింపింది, ప్రచారాల్లో హ్యూమానిటీని, ఎమోషన్‌ను రంగరించింది… తనకు ఆలోచనా భాగస్వామిగా ఉండిపోయింది…
ఆమె తన మొదటి విమర్శకురాలు… విశ్లేషించింది ప్రసంగాల్ని, నిర్ణయాల్ని, అడుగుల్ని… ఆమె మాటే ఫైనల్… అంత నమ్మకం ఆమె మీద… ఇది ఒక సినిమా కథ కాదు… అంత త్వరగా అంతుపట్టని ప్రేమ… ఇది న్యాయం, అన్యాయం అని మనం తీర్పులు చెప్పే ప్రేమకథ కాదు… పరిపక్వ ప్రేమ… అదొక ప్రవాహం….
ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పలేం కదా… కానీ తన ప్రేమ మీద తనకు ఓ క్లారిటీ వచ్చాక ఇక ఆయన లోకనిందకు భయపడలేదు.,. నిలబెట్టుకున్నాడు… అతడు ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు… ఆమె, తొలి లేడీ…. ఒక బోర్డింగు స్కూల్‌లో మొదలైన ఆ ఏజ్ బార్ ప్రేమ… ఈరోజుకూ అలా కొనసాగుతూనే ఉంది..!! ఆమెకు ఇప్పుడు 72… ఆయన గారు జస్ట్, 47…
Share this Article