.
దీదీ మాటలు, చేతల్లాగే ఆ తృణమూల్ కాంగ్రెస్ నేతలందరూ అదో టైపు… అలాంటోళ్లను మమత ఎంచుకుంటుందా..? లేక పార్టీలోకి వచ్చాక అలా తయారవుతారా తెలియదు గానీ… తాజాగా ఓ ఎమ్మెల్యే ఏకంగా రాముడు ముస్లిం అని వ్యాఖ్యానించి ఓ కొత్త వివాదానికి తెరతీశాడు…
యావత్ హిందూ జాతికి దేవుడు రాముడు… అలాంటి రాముడిని ఏకంగా ముస్లిం అని ముద్రవేయడం అంటే, అది ఖచ్చితంగా టీఎంసీ నేతలకే సాధ్యం… ప్రజలు రకరకాలుగా నవ్వుతారనే సోయి ఎలాగూ ఉండదు వాళ్లకు… పైగా కావాలనే హిందువులను గోకడం ఆ పార్టీకి అలవాటు… బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులను సంతృప్తిపరచడం కోసమో, కావాలనే హిందువుల్ని అవమానించడం కోసమో…
Ads
బీజేపీ హిందుత్వను ఎదుర్కొనడానికి మమత పార్టీ కనిపెట్టిన మూర్ఖపు ఎత్తుగడా ఇది..? ఈ వ్యాఖ్యలు చేసిన నాయకుడు టీఎంసీ సీనియర్ నాయకుడు, కామర్‌హట్టి ఎమ్మెల్యే మదన్ మిత్రా… తను శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీసి, చర్చనీయాంశంగా మారాయి…
వివాదం ఎలా మొదలైంది?
రీసెంటుగా ఒక బహిరంగ సభలో మదన్ మిత్రా ప్రసంగిస్తూ.. “భగవాన్ శ్రీరాముడు హిందువు కాదు, ఆయన ఒక ముస్లిం” అని ప్రకటించాడు… బీజేపీ హిందూ మతాన్ని తమ సొంతం చేసుకున్నట్లు ప్రవర్తిస్తోందని, అసలు వారికి మతం గురించి అవగాహన లేదని విమర్శించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు…
తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఆయన ఒక ఆసక్తికరమైన పాత సంఘటనను గుర్తుచేశాడు… గతంలో తాను ఒక బీజేపీ నేతతో చర్చించినప్పుడు “రాముడి ఇంటి పేరు (Surname) ఏమిటి?” అని ప్రశ్నించాననీ, దానికి ఆ నేత సమాధానం చెప్పలేకపోయాడనీ, ఆ సందర్భంలోనే తాను తర్కబద్ధంగా రాముడిని ముస్లింగా అభివర్ణించానని ఏదో పిచ్చి సమర్థన వినిపించబోయాడు…
బీజేపీ చూపిస్తున్న హిందుత్వ చాలా ‘డొల్ల’ అనీ, వారిని ఇబ్బంది పెట్టడమే తన ఉద్దేశమని చెప్పుకొచ్చాడు… ముందే చెప్పుకున్నాం కదా, టీఎంసీ నేతలందరూ అదో టైపు అని… ఇంటి పేరుకూ, బీజేపీ డొల్ల హిందుత్వకూ, రాముడి ముస్లిం అని చెప్పడానికి లింక్ ఏమిటి..? తన మానసిక స్థితిపైనే డౌటనుమానం…
మండిపడ్డ బీజేపీ, భగ్గుమన్న నిరసనలు
ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో సహజంగానే విరుచుకుపడింది… ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర నేతలు మండిపడ్డారు… ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకే TMC నేతలు ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు… మదన్ మిత్రాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు…
సందర్భం- ముగింపు
మదన్ మిత్రా గతంలోనూ ఇలాంటి వింత వ్యాఖ్యలకు పేరుగాంచాడు… అయితే, రామమందిర నిర్మాణం తర్వాత దేశంలో నెలకొన్న భావోద్వేగాల నేపథ్యంలో, రాముడికి మతాన్ని ఆపాదిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా టీఎంసీని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి…
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) స్పందన ఎప్పటిలాగే కప్పదాటు, దాటవేత ధోరణిలోనే ఉంది… తన సహజ వైఖరిలోనే…
‘‘ మదన్ మిత్రా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం… పార్టీకి ఎలాంటి సంబంధం లేదు…’’ అనేసింది… అంటే తమ పార్టీ నేతలు ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు వ్యాఖ్యానాలు చేసుకోవచ్చా..? కోట్లాది మంది మనోభావాలు, మతభావాలు దెబ్బతిన్నా పర్లేదా..? పైగా బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి వివాదాలను వాడుకుంటోందని అంటోంది… ఇవి మదన్ మిత్రా వ్యాఖ్యలకన్నా చిల్లర…

ఒక నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక వర్గం ఓటర్లను ఆకర్షించడం, అదే సమయంలో వివాదం ముదిరితే “అది వ్యక్తిగత వ్యాఖ్య” అని పార్టీ చేతులు దులుపేసుకోవడం… ఇదో పిచ్చి వ్యూహం… క్రమశిక్షణ చర్యల పేరుతో కేవలం నోటీసులు ఇవ్వడం లేదా కొన్నాళ్ల పాటు మీడియా ముందుకు రాకుండా నిరోధించడం (Gag order) మాత్రమే చేస్తారు… ఇది కేవలం ప్రజలకు చూపే “ఐ వాష్” లాంటిదే… అఫ్‌కోర్స్ మమత అది కూడా చేయదు… మావాడు బీజేపీ మీద భలే దాడి చేశాడు అని ఆనందపడే కేరక్టర్…
తృణమూల్ కాంగ్రెస్‌లో గతంలోనూ ఇలాగే జరిగింది… కాళీ మాతపై మహుశా మొయిత్రా చేసిన వ్యాఖ్యలప్పుడు పార్టీ దూరం జరిగింది కానీ, ఆమెకు మద్దతు తగ్గలేదు… ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ (Mimicry) వివాదంలో కల్యాణ్ బెనర్జీ చిక్కుకున్నప్పుడు కూడా పార్టీకి సంబంధం లేదని దాటేసింది, కానీ తర్వాత మమతా బెనర్జీ ఆయనకు మద్దతుగానే నిలిచింది…
చివరగా... ఇలాంటి వ్యాఖ్యలు ఏ పాకిస్థాన్‌లోనో, ఏ అఫ్ఘనిస్థాన్‌లోనో, ఏ బంగ్లాదేశ్‌లోనో చేస్తే... ఏం జరుగుతుంది..? ఇది ఇండియా కదా, సబ్ చల్తా... హిందువుల ఖర్మకొద్దీ..!!
Share this Article