కాదు… కాదు… మీడియాలో వస్తున్న కారణాలు కాకపోవచ్చు… ఇంకేదో ఉంది… మదనపల్లెలో మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల correspondents చేసిన ఘాతుకం వెనుక అసలు కారణాలు బయటపడాల్సి ఉంది… వాళ్లిద్దరూ బాగా చదువుకున్నవాళ్లే… పదిమందికీ ఉన్నత విద్యాబద్దులు నేర్పించేవాళ్లే… మరి వాళ్ల బుద్దులే పెడదోవ పట్టి, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడపిల్లలకు బలి ఇవ్వడం ఏమిటి..? మళ్లీ బతికివస్తారని చెప్పడం ఏమిటి..? బలి నిజమే… ఘోరం నిజమే… కానీ అసలు కారణాలు, కారకులూ వేరు… అసలు హంతకులు వేరు… పోలీసులు వేటాడాల్సింది వాళ్లను… షూట్ చేసి, తక్షణశిక్షలు అమలు చేయాల్సింది వాళ్లపైనే… ఈ ఏడుపులు, ఈ శోకాలు, ఈ ఆగ్రహాలు రెండురోజులు… అంతే… రకరకాల మూఢనమ్మకాల వైపు విద్యావంతుల్ని కూడా మళ్లిస్తున్నవాళ్లు కదా అసలు హంతకులు..? ఇద్దరు కూతుళ్లను సొంత తల్లిదండ్రులే బలి ఇచ్చేంత మౌఢ్యాన్ని ఎవడో వాళ్లలో నింపాడంటే… అసలు వాడిని కదా సమాజం కోసం బలి ఇవ్వాల్సింది..?
ఈ దారుణ సంఘటనలో కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలున్నయ్… అంశాలున్నయ్…
Ads
- పిల్లలు ఒకరు 27, మరొకరు 23 ఏళ్లు… తల్లి క్రూరంగా బలి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ప్రతిఘటించలేదు…?
- తల్లి, తండ్రి మూర్ఖులు… విద్యావంతులు, విద్యావేత్తలు అనేది మన భ్రమ… మనం కమర్షియల్ చదువులు తప్ప లైఫ్ సైన్సెస్ ఎప్పుడో డిలిట్ కొట్టేశాం కదా మన చదువుల్లో నుంచి… వీళ్లూ అంతే… వీళ్ల చదువులు అదే స్థాయి, వీళ్లు నేర్పే చదువులూ అదే స్థాయి… 3 రోజులుగా ఇంట్లో ఎవరినీ పిలవకుండా, రహస్యంగా పూజలు చేస్తుంటే ఎవరూ కనిపెట్టలేకపోయారా..? బాగా యాక్టివిటీ ఉండే సొసైటీ కదా వాళ్లది…
- పెద్దమ్మాయి IFS కొలువు వదిలేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతోందట… నగ్నంగా పూజలో కూర్చున్నది అనే మీడియా version నమ్మొచ్చా..? ఆమె వివేకం ఏమైంది..?
- ఈ ఫోటోలో రోజూ చాలా మంది రెగ్యులర్ గా పూజించే దేవుళ్ళ ఫోటోలే ఉన్నాయి… వేరే క్షుద్రపూజల సంబంధ దేవతల ఫోటోలు గానీ, ఆ చిహ్నాలు గానీ, క్షుద్రపూజల వాతావరణం గానీ కనిపించడం లేదు… మరి నిజానికి ఏం జరిగింది..?
- అక్కడ మెహర్ బాబా ఫోటో ఉంది, వాళ్లు జగ్గీ వాసుదేవ్ శిష్యులు అని రాస్తున్నారు కొందరు… కానీ మెహర్ బాబా మాంత్రికుడు కాదు, జగ్గీ వాసుదేవ్ కూడా క్షుద్ర పూజల్ని అనుమతించే వాడు కాదు…
- మన సీరియళ్లు, మన సినిమాలు, మన నవలలు… ఇలాంటివి ఎంకరేజ్ చేసే మన నాయకులు… రాజకీయాల్లో విజయాల కోసం గుప్తఅర్చనలు, క్షుద్రపూజలు జరిగే సొసైటీలో… ఆఫ్టరాల్ ఈ పేరెంట్స్ కూడా అటువైపు మొగ్గితే ఆశ్చర్యం ఏముంది..? ఎటొచ్చీ, ఆ ఇద్దరు పిల్లలే అన్యాయంగా బలైపోయారు…
- ఈ పూజల్ని చేయిస్తున్నదెవరు..? ఈ పూజలు చేస్తే ఏం ఫలితం వస్తుందని మభ్యపెట్టాడు..? అసలు అలాంటివాళ్లను కదా పట్టాల్సింది… ఇలాంటివారిలో నలుగురికి కఠినశిక్షలు పడితేనే కదా… కాస్త భయం, భక్తి ఏర్పడేది…
ఒకసారి ఈ పిల్లల ఫోటోలు, కుటుంబం ఫోటోలు చూడండి…
మూడు రోజులుగా కుటుంబసభ్యులు ఇంట్లోనే రహస్య పూజలు చేస్తుంటే… సొంత పిల్లల్ని బలి ఇచ్చి, మళ్లీ వాళ్లే బతికొస్తారు అని ఆ తల్లి వాదిస్తున్నదీ అంటే… బంధుమిత్రులు, వాళ్ల విద్యాసంస్థల స్టాఫ్, చుట్టుపక్కలవాళ్లు, పనిమనుషులు ఎవరూ ఈ కుటుంబంలో ఏదో తేడా కనిపిస్తోందని కనిపెట్టలేకపోయారా..? అదీ విస్తుపరిచే ఓ సందేహం… థాంక్ గాడ్… ఇంకా ఏ రాజకీయ రాబందులూ వాలలేదు… పరిహారాల ప్రకటనలు, డిమాండ్లు రావడం లేదు… పొలిటికల్ విమర్శలు, రచ్చ మొదలుకాలేదు… బహుశా ఏ పాయింట్ మీద తిట్టాలో, ఏ అంశం మీద సమర్థించాలో, ఏ కారణం చూపి అండగా నిలవాలో క్లారిటీ రానట్టుంది ఎవడికీ…
ఈ ఇన్సిడెంటు వదిలేస్తే… సమాజం శాస్త్రీయత వైపు పయనిస్తూ… మూఢనమ్మకాలకు దూరంగా పురోగమించాలంటే… ముందు ఈ పిచ్చి నమ్మకాలపై, దుష్ఫలితాలపై చిన్నప్పటి నుంచే చెప్పాలి… ఇలాంటి పాఠాలు సిలబస్లో ఉండాలి… అవి ఆధునిక యుగం వైపు ప్రయాణించేలా ఆలోచనలు పెంచాలి… మూఢ పూజల ప్రాక్టీసు నిరోధించే చట్టాలు కావాలి… (కర్నాటకలో ఓ చట్టం చేశారు కొన్నాళ్ల క్రితం…) చిన్నప్పటి నుంచే పిల్లల మెదళ్లను హేతువు వైపు, శాస్త్రీయత వైపు ట్యూన్ చేయగలిగితే… వాళ్లే మన పిచ్చి సీరియళ్లు, తిక్క సినిమాలు, మెంటల్ నవలల్ని తిరస్కరిస్తారు… వాళ్లు పేరెంట్స్ అయ్యాక వాళ్ల పిల్లల్నీ అలాగే పెంచుకుంటారు… మారాల్సింది మన చదువులు… అది జరగకపోతే… ఇదుగో ఇలా చదువులు చెప్పే చదువుపరులు కూడా ఇలాంటి చదువుల తల్లుల్ని పొట్టనపెట్టుకుంటారు…!! అయ్యా, మోడీ గారూ… మీ బెనారస్ యూనివర్సిటీ ఈ క్షుద్ర పూజల మీద ఏదో కోర్స్ స్టార్ట్ చేసిందట కదా… సారు మనల్ని ఎటు తీసుకు పోతున్నారు..?!
Share this Article