అది 2017… తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా… కలెక్టర్ కార్యాలయం… దాని ఎదుట నలుగురు సభ్యులున్న ఓ నిరుపేద దినసరి కూలీ కుటుంబం తామకుతామే నిప్పు పెట్టుకుని సజీవంగా దహనమయ్యారు… ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి, కలవరం- గగుర్పాటు కలుగుతున్నయ్ కదా… కారణమేంటో తెలుసా..? అక్కడ ఓ వడ్డీవ్యాపారి ఉన్నాడు, ఈ కుటుంబం ఆయన దగ్గర అధిక వడ్డీకి డబ్బు తీసుకుంది… కడుపు కాలిందో, రోగమొచ్చిందో, ఏం ఆపద వచ్చిందో… వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణుచక్రవడ్డీ ఎట్సెట్రా కలిపి తడిసిమోపెడైంది… చెల్లింపుకై సదరు వడ్డీవ్యాపారి విపరీతంగా సతాయిస్తున్నాడు… ఈ అడ్డగోలు వడ్డీ దోపిడీ నుంచి, మా కష్టాల నుంచి ఆదుకొండి మహాప్రభో అని ఆ కుటుంబం పలుమార్లు కలెక్టర్‌కు, ఎస్పీకి మొరపెట్టుకుంది… మనకు తెలిసిందేగా… ప్రభుత్వం అంటేనే రోజూ లక్ష యవ్వారాలు, ఎవడికి పట్టింది ఓ పేద కుటుంబం గోడు… ఇక విసిగిపోయి, ఈ వ్యవస్థలో న్యాయం జరగదని తేల్చేసుకుని, కలెక్టరాఫీసు ఎదుటే ప్రాణాలు వదిలారు… అత్యంత సహజంగా మీడియా ఓ క్రైం న్యూస్‌లాగా రాసేసి, ఇంకేవైనా మసాలా వార్తలు దొరుకుతాయేమో అనే అన్వేషణలో బిజీ అయిపోయింది… సదరు వడ్డీ వ్యాపారి మీద ఈగ కూడా వాలలేదు… దీంతో ఓ కార్టూనిస్టు కడుపు మండిపోయింది… ఓ బొమ్మ గీశాడు, తన కోపం, తన ఆవేదన, తన దుఃఖం అన్నీ కలగలిపి ఇదుగో ఇలా గీశాడు…
ఓ పిల్లాడు మంటల్లో కాలిపోతుంటే సీఎం పళనిస్వామి, ఆ కలెక్టర్, అక్కడి పోలీస్ కమిషనర్ తమ ప్రైవేటు పార్ట్స్‌కు కరెన్సీ నోట్లను అడ్డు పెట్టుకుని, కళ్లు మూసుకుని, బరిబాతల నిలబడి ఉన్నారు…. అంతే… మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇది వాడుకునే దమ్ముందా..? ఉండదు కదా… సహజంగానే… అందుకని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు… వ్యాఖ్య లేదు, విమర్శ లేదు… ఒక్క అక్షరమూ రాదు… కానీ అది ఎంత బలంగా తాకింది అంటే… సోషల్ మీడియాలో హల్‌చల్ అయిపోయింది… ఒక కుటుంబం సజీవంగా కాల్చుకుంటే ఓ సాధారణ నేరవార్తలా ట్రీట్ చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దల మొహాలు సిగ్గుపడ్డయ్… వాళ్లూ ధైర్యంగా ఒకటీరెండు ఫాలోఅప్ కథనాలకు పూనుకున్నారు… ఇదంతా ఆ కార్టూన్ వల్లేనని ప్రభుత్వ పెద్దలకు కోపమొచ్చింది… అసలే కలెక్టర్, తోడుగా పోలీస్ కమిషనర్… అందులో సీఎం కూడా ఉన్నాడాయె… అర్జెంటుగా క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టేశాడు… ఇది వ్యక్తిగతంగా, అసభ్యంగా, తమ కేరక్టర్‌ను దెబ్బతీసేలా ఉందనేది కేసు… రకరకాల సెక్షన్లు పెట్టేశారు… (ఒట్టు, రాజద్రోహం కేసు మాత్రం పెట్టలేదు…) నిజంగానే హఠాత్తుగా చూస్తే మనమూ ఫీలయ్యేది కూడా… ఏమిటింత పచ్చిగా గీశాడు అని… సరే, తిరిగీ తిరిగీ హైకోర్టు దాకా వచ్చింది కేసు…
జస్టిస్ ఇళంగోవన్ తీర్పు చెబుతూ కొన్ని ఆలోచనాత్మక వ్యాఖ్యలు చేశాడు… ‘‘ఒక మనిషి తన భావాల్ని వ్యక్తీకరించడంలో భిన్నత్వం ఉంటుంది… మనది ప్రజాస్వామిక దేశం… భావప్రకటన స్వేచ్ఛ మన ప్రజాస్వామిక వ్యవస్థకు ఓ బలమైన పిల్లర్… ఇది లేకుండా ఆ వ్యవస్థే లేదు… నిజానికి మనిషి తనలోని భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం లేకపోతే, మనిషి పరిణామగతి ఎలా సాధ్యం అవుతుంది..? అంతేకాదు, నువ్వు ఫలానా రీతిలో నీ భావాల్ని వ్యక్తీకరించాలి, ఇలా చేయకూడదు అని కోర్టులు నైతికపాఠాలు చెబుతూ కూర్చోలేవు… భావస్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు… దానికి తుది, మొదలు నిర్వచించలేం… వడ్డీవ్యాపారి మీద చర్య తీసుకోలేని వ్యవస్థ మీద కార్టూనిస్టు తన కోపాన్ని, సంతాపాన్ని, విమర్శను ఇలా ప్రజెంట్ చేశాడు… అంతేతప్ప దీన్ని ఉద్దేశపూర్వకమైన, కుట్రపూరిత నేరంగా పరిగణించలేం… అసభ్యం, అతి చిత్రీకరణ అనేవి కాదు, కోర్టు చూస్తున్నది కేవలం కార్టూనిస్ట్ ఏం చెప్పాలనుకున్నాడని మాత్రమే… అధికారుల పరువు తీయాలనేది కాదు ఇక్కడ ఉద్దేశం… సమస్య తీవ్రతను బలంగా వ్యక్తీకరించడానికి తాను ఎంచుకున్న రూపం అది… చెప్పిన తీరు వివాదాస్పదమే తప్ప చెప్పాలనుకున్న విషయంలో వివాదం లేదు కదా… సో, ఈ కేసును కొట్టేయడమే సరైన చర్య…’’ జస్టిస్ ఇళంగోవన్… మీ తీర్పు అదిరిపోయింది…
Share this Article