.
Director Devi Prasad.C.....
మద్రాస్ వెళ్ళిన కొత్తలో టి.నగర్‌లోని రంగనాధన్ స్ట్రీట్‌లో, ప్రభాకర్‌రెడ్డి గారి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసే “N.శంకర్” (తరువాత కాలంలో ఎన్‌కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం వంటి చిత్రాలకు దర్శకుడు), మా గురువు గారి దగ్గర నా కొలీగైన “శీతిరాల రామారావు, నేను రూమ్మేట్స్‌గా ఉండేవాళ్ళం.
ఆ తర్వాత కొన్నాళ్ళు కరాటే వివేక్ (సినిమా సీరియల్ నటుడు)తో కలిసి దామోదర్ స్ట్రీట్ లో ఉన్నాను.
అప్పుడు నా కొలీగైన వీరశంకర్ (తరువాత కాలంలో గుడుంబా శంకర్, విజయరామరాజు వంటి చిత్రాలకు దర్శకుడు), హీరో శ్రీకాంత్ (అప్పటికి హీరో కాలేదు) కలిసి కోడంబాక్కం బ్రిడ్జ్ ప్రక్కనుండే “జక్రయ కాలనీ”లో ఉండేవారు.
Ads
శ్రీకాంత్ హైదరాబాద్ షిఫ్ట్అ యిపోవటంతో నేను ఆ రూమ్‌లోకి షిఫ్ట్ అయ్యాను. నా రూమ్మేట్స్ అయిన ఎన్.శంకర్, వీరశంకర్లకు ఉన్న సారూప్యం ఏమిటంటే తరువాతి కాలంలో ఇద్దరూ “తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం”కి అధ్యక్షులయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు వీరశంకరే.
ఓనర్స్ బంధువుల రాకవల్ల మేము జక్రయకాలనీ రూమ్ ఖాళీ చేయవలసివచ్చింది. “ఆవేశం” అనే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రావటం వల్ల మాకు కొత్త రూమ్ వెతుక్కునే తీరిక చిక్కలేదు. ఆ రోజుల్లో రజనీకాంత్, విజయకాంత్ వంటి హీరోలతో పని చేసే నెంబర్‌వన్ ఫైట్‌మాస్టర్” సూపర్ సుబ్బరాయన్” గారే మా సినిమాకీ పనిచేస్తున్నారు.
చూడటానికి భీకరంగా కనిపించే ఆయన అతి సున్నిత మనస్కుడు. గొప్ప జ్ఞాని. ఏ విషయాన్నైనా విడమరిచి చెప్పగల ఎన్‌సైక్లోపీడియా ఆయన. స్కూల్‌ఫైనల్ కూడా దాటని ఆయన జ్ఞానానికి కారణం అమితమైన ఆయన సాహిత్యాభిలాష, పుస్తకపఠనమే అని తెలిసింది. షాట్‌గ్యాప్స్‌లో ఎన్నో గొప్ప విషయాలు మాతో చెబుతుండేవారు తమిళంలో.
మాస్టర్ గారి అసిస్టెంట్ “మణి” ద్వారా వడపళనిలోని వేంగీశ్వరనగర్ లో మాస్టర్ గారు కొత్త ఫ్లాట్స్ నిర్మించి అద్దెలకివ్వటానికి రెడీగా ఉన్నట్లు తెలిసింది. అయితే వాటి ఆర్ధికపరమైన విషయాలన్నీ మాస్టర్ గారి భార్య గారే చూసుకుంటారనీ, ఫామిలీస్ కి మాత్రమే అద్దెకివ్వాలని ఆమె నిర్ణయించినట్లు చెప్పాడు.
మొత్తానికి మా సమస్య మాస్టర్ గారికి తెలిసి మా గురించి మంచి కుర్రాళ్ళు అని తన భార్య గారికి చెప్పి ఒప్పిస్తానన్నారు. అప్పట్లో చెన్నై లో అద్దెలు ఎలా వున్నా అడ్వాన్స్ మాత్రం 8 నెలలు, 10 నెలలు అద్దె చెల్లించమనేవారు. అదే తరహాలో దీనికీ 10 నెలలు అడ్వాన్స్ అనేసరికి గుండె గుభేలుమంది.
అద్దె కూడా మాకు ఎక్కువే అయినప్పటికీ ఇవ్వగలమనీ, 10 నెలల అడ్వాన్స్ మాత్రం మావల్ల అయ్యే పని కాదన్నాము. ఆమె మాత్రం డబ్బు విషయంలో నయాపైసా తగ్గరనీ, చాలా స్ట్రిక్ట్ అనీ “మణి” చెప్పాడు. ఆమె పర్యవేక్షణలో డబ్బులు వసూలు చేసేది మణే. మేము ఆశలు వొదిలేశాం.
విషయం మాస్టర్ గారికి తెలిసి “మీరెంత ఇవ్వగలరు అంటే మూణ్ణెళ్ళు అడ్వాన్స్ మాత్రమే ఇవ్వగలం. అద్దె మాత్రం పర్ఫెక్ట్ గా ఇవ్వగలమన్నాం. అప్పుడు మణిని పిలిచి మాస్టర్ గారు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేం…
ఒరే మణీ … వాళ్ళు కాబోయే దర్శకులురా… వాళ్ళకి మనమే సహకరించకపోతే ఎలా? మనం మాత్రం కష్టాలు పడలేదా? ఒక పని చెయ్. వాళ్ళిచ్చే మూడు నెలల అడ్వాన్స్ డబ్బు తీసుకో. 10 నెలల డబ్బూ ఇచ్చేశారని మీ అక్కకి (ఆయన భార్యకి) అబధ్ధం చెప్పెయ్. మిగతా 7 నెలల డబ్బేది అని అడిగితే హైదరాబాద్‌లో ప్రొడక్షన్ సరిగా లేకపోవటం వల్ల నేను తీసుకొని ఖర్చుపెట్టేశానని నామీదికి తోసెయ్. నేను మేనేజ్ చేస్తాను”అన్నారు…
మణి సరే అంటూ” అక్క దగ్గర నేను ఇరుక్కోకుండా చూసే బాధ్యత మీదే” అన్నాడు. అలా అబధ్ధంతో ఆ ఫ్లాట్‌లో చేరిపోయాము. అప్పుడప్పుడూ వచ్చే మాస్టర్ గారి భార్య గారు మాతో ” ఫామిలీస్ మధ్య బ్యాచ్‌లర్స్ అంటే మొదట భయపడ్డాను గానీ మీ గురించి అందరూ చాలా మంచిగా చెబుతున్నారు తంబీ. మీరింత మంచివాళ్ళని ముందే తెలిసుంటే అందరిలా పదినెలలు అడ్వాన్స్ కాకుండా ఓ రెండునెలలు తగ్గించి తీసుకొనేదాన్ని”అన్నారు. మేము మాత్రం గప్‌చుప్ సాంబారుబుడ్డి అన్నట్లే ఉన్నాము…
ఆ ఫ్లాట్స్ లో ఉన్న కుటుంబాల వారంతా మాకు పంచిన ఆప్యాయతని మర్చిపోలేము. పండగలొస్తే చాలు, వాళ్ళందరూ పంపే పిండివంటలతో మా కడుపులు ఉబ్బిపోయేవి. మా ఫ్లాట్స్ ఎదురుగా ఉండే ఫ్లాట్స్ పైన తరువాత పెద్ద దర్శకులైన తమిళులు కరుణాకరన్ (తొలిప్రేమ) , శశి (బిచ్చగాడు) మరికొందరు ఉండేవారు.
కొత్తగా వచ్చే సినిమావాళ్ళకి నికర ఆదాయం ఉండదని తెలిసి కూడా ఇళ్ళు కట్టుకునివున్న కొందరు సీనియర్స్ అయిన సినిమావాళ్ళు సినిమా బ్యాచ్‌లర్స్‌కే అద్దెకిచ్చేవాళ్ళు మద్రాస్ లో. అద్దెల కోసం పీడించేవాళ్ళు కాదు. హీరో భానుచందర్ గారిల్లు, డాన్సర్ అనూరాధ గారిల్లు మరికొందరు సినిమావారి ఇళ్ళు ఆ కోవలోకొస్తాయి.
ఆ ఇళ్ళల్లో అప్పట్లో అద్దెలకున్న ఆనాటి ఎందరో బ్యాచ్‌లర్స్ ఈనాటి సినీ ప్రముఖులయ్యి అగ్ర స్థానాలలో ఉన్నారు. అతి సులువైనా అతి కష్టంగా అనిపించే విషయం మరొకరికి “మంచి” చెయ్యటమే. ఆ నిధిని మాబోటివారికెంతో పంచారు తమిళులు. మా చెన్నై జీవితం ఎంతో రుచిగాఉండేది. అందుకే ఆ జ్ఞాపకాలకు ముసలితనం రాలేదు… ______ దేవీప్రసాద్.
Share this Article