.
Subramanyam Dogiparthi
……. ఇచ్చోటనె సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె ! ఇచ్చోటనె భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించె !!
గుర్రం జాషువా గారి కాటి సీను పద్యాలను నాటకంలో పాడీ పాడీ… ఈ సినిమాలో హీరో హీరోయినుతో సహా హరిశ్చంద్రుడు , చంద్రమతుల కష్టాలే పడతాడు . మనకు 1950s , 1960s లలో కష్టాల చుట్టూ సినిమాలు ఉండేవి . 1970s తర్వాత కధల్లో , మనుషుల్లో మార్పులు వచ్చాయి .
Ads
ఓ లమ్మీ తిక్క రేగిందా , రగులుతుంది మొగలి పొద సినిమాల వరదొచ్చి పడింది . 1986 లో వచ్చిన ఈ మగ మహారాజు ప్రేక్షకులను 1960s కు లాక్కెళ్ళింది . అయినా బాగానే ఆడింది . కాస్త విజేత , ఆలయ శిఖరం ఛాయలు కనిపిస్తాయి . శ్యాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బేనరుపై విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ మగధీరుడు సినిమాకు నిర్మాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి .
పి యల్ అబ్బాయ్ నాయుడు కధకుడిగా టైటిల్సులో పడుద్ది . ఈ పేరు నేనెప్పుడూ వినలేదు . ఎవరో ఎక్కడో ఉండే ఉంటారు మహేష్ బాబు ఏదో సినిమాలో అన్నట్లు ! చక్కటి కుటుంబ కధాచిత్రం . సినిమా ప్రారంభంలో అనురాగ కుటుంబం . ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం అంటూ ఫేమిలీ సాంగ్ పాడుకుంటూ ఉంటారు . అన్నదమ్ముల అనుబంధం సినిమాలో లాగా ఈ పాటే సినిమాకు ఐకానిక్ సాంగ్ అయి క్లైమాక్సులో కుటుంబ సభ్యులంతా పాడుకుంటూ ఒకటవుతారు .
ఓ మంచాయన సత్యనారాయణకు మొదటి కళత్రానికి ఇద్దరు కొడుకులు , రెండో కళత్రానికి ఒక కొడుకు . మారు బిడ్డల్లాగా కాకుండా ఒకే తల్లి బిడ్డల్లాగా పెరుగుతారు , పెంచబడతారు . మూడో కొడుకే హీరో చిరంజీవి . నాటకాల రాయుడు . జయసుధ ప్రేయసి , సహ నటి . తమ అంతస్తు అమ్మాయి కాకపోయినా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు .
రెండో కోడలు రోజారమణి బాబాయి గాంధార దేశ శకుని వారసుడు రావు గోపాలరావు . నక్క బుధ్ధి . కొంపలోకి చేరి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు . పెద్దోళ్ళు ఇద్దరూ చనిపోతారు . శకుని వికృత కార్యక్రమాలతో పెద్ద కొడుకు భార్యాబిడ్డలతో ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు . మూడో కొడుకు మీద హత్యా నేరం మోపి జైలుకు పంపుతారు . హీరోయిన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేస్తారు .
రెండో కోడలు రోజారమణిని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళనూ వీధి పాలు చేస్తాడు శకుని . మూడో కోడలు హరిశ్చంద్ర కధలో చంద్రమతి లాగా అష్టకష్టాలు పడి , ప్రమాదంలో చనిపోయిన బిడ్డను పూడ్చి పెట్టేందుకు శ్మశానానికి వచ్చి అక్కడే ఉన్న భర్తను కలుసుకుంటుంది . ఫేమిలీ సాంగ్ పుణ్యాన అందరూ కలుస్తారు . టూకీగా ఇదీ కధ .
శకుని రావు గోపాలరావు పాత్ర పూర్వం కుటుంబ చిత్రాలలో సూర్యకాంతం పాత్రలా ఉంటుంది . స్క్రీన్ మీదకెళ్ళి తన్నొద్దామా అనిపిస్తుంది . అంత బాగా విలనీకరించారు ఆ పాత్రని . ఆయనకో చింతామణి లాంటి పతివ్రత జోడీ . వై విజయ . ఎన్ని చేస్టిటీ బెల్టులు కట్టినా పాతివ్రత్య భంగం చేస్తూనే ఉంటుంది . ఆమెకు డాఫర్ రాళ్ళపల్లి . ఈ ముగ్గురి తిరణాల బాగానే ఉంటుంది . జయమాలిని , జ్యోతిలక్ష్మి , సిల్క్ స్మిత వంటి వారు సినిమాలో ఎవరూ లేరే అని గుర్తుకు కూడా రాదు .
బాల సుబ్రమణ్యం సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగానే ఉంటాయి . చిరంజీవి , జయసుధలకు రెండు డ్యూయెట్లు . ఒకటి మన జీవితాలు నవ నాటకాలు , జత కలిసే ఈ దినం పాటలు ఆ రెండు . అటు దహనం ఇటు ఖననం అంటూ కాటిలో ఓ రౌద్ర పాట , మంచిన పంచిన నీవు బాబూ అనే విషాద పాట ఉన్నాయి .
సినిమాలో అల్లు రామలింగయ్య స్నేహితుడి పాత్ర బాగుంటుంది . కాలింగ్ బెల్ కొట్టకుండా ఈల వేస్తుంటాడు . సరదాగా ఉంటుంది . ఈలే కాలింగ్ బెల్ . తల్లిదండ్రులుగా సత్యనారాయణ , శుభల నటన బాగుంటుంది . హీరోయిన్ తండ్రిగా జె వి సోమయాజులు , హీరో రెండో అన్నగా చంద్రమోహనుకి పెద్దగా నటించే పాత్రలు కావు . గుంపులో గోవింద .
రోజారమణిది కాస్త కీలక పాత్ర . బాగా నటించింది . పెద్ద వదినగా కె విజయ . పోలీసు ఇనస్పెక్టరుగా నూతన్ ప్రసాద్ మళ్ళా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ హడావుడి చేస్తాడు . ఇతర పాత్రల్లో నరసింహరాజు కూడా ఉన్నాడు .
సినిమాలో బ్రౌనీ అనే ఒక కుక్క పాత్ర కూడా ఉంటుంది . శకుని మామ ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు ఆ కుక్కని మునిసిపాలిటీ వాళ్ళకు అప్పగించి చనిపోయేలా చేసే సీన్ ప్రేక్షకులకు అయ్యో పాపం అనిపిస్తుంది . ఆ సీన్ని దర్శకుడు బాగా పండించాడు . నటన పరంగా అగ్ర తాంబూలం శకుని పాత్రధారి రావు గోపాలరావుదే . శకుని లేకపోతే కురుక్షేత్రం లేనట్లు ఈ రావు గోపాలరావు లేకపోతే ఈ సినిమా కధే లేదు .
చిరంజీవి , జయసుధ జంటగా నటించిన సినిమాలు కాసినే . ఆ కాసిన్లో ఒకటి ఈ సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండని చిరంజీవి , జయసుధ , రావు గోపాలరావు అభిమానులు చూడవచ్చు . చూడబులే . It’s family sentiment movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్
Share this Article