.
వెన్నుపోటుపై మాగంటి – దగ్గుబాటి సినిమా ప్రయత్నం…
ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేసిన తరువాత హిమాయత్ నగర్ లోని టీడీపీ ఆఫీస్ లో గంటల తరబడి రాజకీయ ముచ్చట్లు సాగేవి … టీడీపీ ఆఫీస్ తొలుత హిమాయత్ నగర్ లోనే ఉండేది … బాబు పార్టీని హస్తగతం చేసుకున్న తరువాత అదే హిమాయత్ నగర్ లో కొద్ది దూరంలో అదే యజమానికి చెందిన భవనంలో బాబు టీడీపీ ఆఫీస్ ఉండేది ..
Ads
హిమాయత్ నగర్ లోనే ఇటు ఎన్టీఆర్ టీడీపీ, అటు బాబు టీడీపీ కార్యాలయాలు సందడిగా ఉండేవి … ఎన్టీఆర్ టీడీపీలో పాత ముచ్చట్లు వినిపించేవి, ఆసక్తి వల్ల ఎక్కువ సమయం ఇక్కెడే ఉండేవాడిని … దగ్గుబాటి వెంకటేశ్వర రావు బాబు వర్గంలోకి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చారు …
హిమాయత్ నగర్ లోని ఎన్టీఆర్ టీడీపీ కార్యాలయంలో వెన్నుపోటుపై గంటల తరబడి ముచ్చట …
మీకు సినిమా అనుభవం కూడా ఉంది కదా ? వెన్నుపోటుపై ఓ రాజకీయ సినిమా తీయండి బాగుంటుంది అని నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించాను …
వెంటనే దగ్గుబాటి బాగా ఉత్సాహపడ్డారు … అక్కడే ఉన్న మాగంటి గోపినాథ్ కు చెప్పి, మనం ఆ సినిమా తీస్తున్నాం అని అప్పటికప్పుడే సినిమా రంగానికి సంబంధించి ఎవరినో సంప్రదించమని చెప్పారు . ( బహుశా దర్శకుడిని కావచ్చు )
మరుసటి రోజు ఈ వెన్నుపోటు సినిమా వార్త నేను ఆంధ్రభూమిలో రాశాను . అన్ని పత్రికల్లో వచ్చింది …
పత్రికల్లో బాబు వెన్నుపోటు సినిమా వార్త రాగానే నాయకుల్లో చర్చ … అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ ఎస్ రామకృష్ణ నాతో ఈ వెన్నుపోటు సినిమాలో దగ్గుబాటి పాత్ర ఏమిటీ అని జోక్ గా అడిగారు .
వెన్నుపోటు సినిమా తీయవచ్చు కదా అని నేను దగ్గుబాటితో అనగానే ఆయన మాగంటి గోపినాథ్ తో సినిమా గురించి మాట్లాడడంతో అప్పుడే తెలిసింది . మాగంటి సినిమా నిర్మాత కూడా అని … అప్పటి వరకు లోకల్ టీడీపీ లీడర్ అనుకున్నాను కానీ ఆయన గురించి వివరాలు తెలియవు …
అంతకు ముందు దగ్గుబాటి భగత్ సింగ్ గా నటించాలి అని సినిమా స్టిల్స్ కూడా విడుదల చేశారు . దానితో సినిమా పట్ల ఆసక్తి ఉంది కాబట్టి వెన్నుపోటు కథతో రాజకీయ సినిమా తీస్తే క్లిక్ అవుతుంది అనిపించి చెప్పాను …
మాగంటి దగ్గుబాటి వర్గం… చివరి వరకు ఎన్టీఆర్ తోనే ఉన్నారు .. కాలం కలిసి వస్తే వెన్నుపోటుపై సినిమా కూడా తీసి చరిత్రలో మిగిలిపోయే వారు … ఆ తరువాత సినిమా ప్రయత్నాలు ఏమయ్యాయో ? ఎందుకు ఆగిపోయాయో తెలియదు కానీ దగ్గుబాటి , మాగంటి నేతృత్వంలో మాత్రం సినిమా వెలుగు చూడలేదు ..
రెండున్నర దశాబ్దాల తరువాత రాంగోపాల్ వర్మ వెన్నుపోటుపై సినిమా తీశారు .. సహజంగా వర్మ సినిమాలు ధియేటర్ లో కన్నా మీడియాలో ఎక్కువ నడుస్తాయి … ఈ వెన్నుపోటు సినిమా కూడా మీడియాలో రాజకీయాల్లో ఎక్కువగా పాపులర్ అయింది …
మాగంటి ఎన్టీఆర్ ను అడ్డుకున్నారు అని రేవంత్ రెడ్డి ఏదో అన్నారనే వార్త చూసి మాగంటి తీయబోయిన వెన్నుపోటు సినిమా ప్రయత్నాల ఉదంతం గుర్తుకు వచ్చింది .. మీడియా మద్దతు ఉంటే చేతిలో మైకు , నోట్లో నాలుక ఉంటే ఎన్టీఆర్ ను వెన్నుపోటు నుంచి బాబు రక్షించారు అని కూడా చెప్పగలరు నాయకులు …
టీడీపీ శ్రేయోభిలాషులు , టీడీపీ పెద్దలు , టీడీపీ తటస్థ మద్దతుదారులు వెన్నుపోటు సినిమా ప్రయత్నాలను నిలిపి వేయించి ఉంటారు అనిపించింది … ఇప్పటి పరిస్థితి వేరు కానీ 1995- 96 లో ఆ పెద్దలను కాదని సినిమా రంగంలో అడుగు ముందుకు పడేది కాదు … – బుద్దా మురళి
Share this Article