.
చైనాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలు అద్భుతాలను సృష్టిస్తున్నాయి… మెడిసిన్స్ దగ్గర నుంచి జీన్ ఎడిటింగ్ వరకు… రాబోయే రోజులు మనిషి జీవితాన్ని మరింత ఆరోగ్యవంతం చేసి, మరింత ఆయుష్షును పోస్తాయి…
మరణాన్ని జయించలేమేమో గానీ… వాయిదా వేయగలం..! ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సగటు మానవ జీవనకాలం (సగటు ఆయుష్షు) పెరిగింది కూడా…! ఇప్పుడు చెప్పుకునే వార్త ఏమిటంటే..? విరిగిన ఎముకలను మూణ్నాలుగు నిమిషాల్లో అతికించేయగల మెడిసిన్… (డ్రగ్ జిగురు)…
Ads
చైనాలో ఓ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్, ఆయన టీమ్ దీన్ని డెవలప్ చేశారనేది వార్త… (జెజియాంగ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న Sir Run Run Shaw Hospital కి చెందిన అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్)… ఈ జిగురుకు బోన్02 అని పేరు పెట్టారట…
సాధారణంగా ఎముకలు విరిగితే ప్రస్తుతం ఏం చేస్తున్నాం..? మామూలు పగులు, హెయిర్ ఫ్రాక్చర్ వంటివైతే సిమెంట్ పట్టీలు కట్టేస్తారు… మెల్లిమెల్లిగా అవే అతుక్కుంటాయి… లేదంటే స్టీల్ రాడ్స్, స్క్రూలు బిగించి మరీ కట్టేస్తారు… ఆలస్యంగా అతుక్కుంటాయి… ఖరీదైన, నొప్పితో కూడిన సర్జరీలు… ఆరోజులకు ఇక చెల్లు అంటున్నారు చైనా ఆర్థోపెడిక్ సర్జన్లు…
గ్లోబల్ టైమ్స్ కథనం ఏమిటంటే… డాక్టర్ లిన్ ఒక రోజు సము ద్రంలో రాళ్లకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలను గమనించారు. నీటి తడిలో ఉప్పులో కూడా అవి గట్టిగా అతుక్కుపోయి ఉండడం ఆయనకు ప్రేరణ ఇచ్చింది.. .అదే సూత్రాన్ని వైద్యరంగంలోకి తీసుకువచ్చి, ఎముకలకు ఉపయోగించే జిగురును తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది… 2016లో మొదలుపెడితే ఇదుగో 9 ఏళ్ల తరువాత ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చింది… అదే బోన్02 అనే గ్లూ…
ఇది ఓ ఇంజక్షన్… విరిగిన ఎముకల ముక్కల్ని మూణ్నాలుగు నిమిషాల్లో (క్విక్ ఫిక్స్ సొల్యూషన్‌లాగా) అతికించేస్తుందట… సేమ్, నీటిలో నివసించే అల్చిప్పలు రాళ్లకు అతుక్కునే టెక్నిక్ను అనుసరించి డెవలప్ చేసిందే…
ఆ టీమ్ చెబుతున్న ఈ జిగురు పరీక్ష ఫలితాలు ఏమిటంటే..? బాండింగ్ శక్తి (జిగురు తట్టుకునే శక్తి): 400 పౌండ్లకు పైగా… షియర్ స్ట్రెంగ్ (కదలడానికి ముందు ఆపగలిగే శక్తి): 0.5 మెగాపాస్కల్స్ (MPa)… కంప్రెసివ్ స్ట్రెంగ్త్: 10 MPa…
మరీ ముఖ్యం ఏమిటంటే… ఈ గ్లూ శరీరంలో క్రమంగా కరిగిపోతుంది… ఇంకా పెద్ద లాభం ఏంటంటే, ఈ గ్లూ వాడితే ఆపరేషన్ రంధ్రం చాలా చిన్నగా ఉంటుంది… తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, తక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటాయి… శస్త్రచికిత్స సమయం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది…
ప్రత్యేకించి ఈ జిగురు అత్యవసర పరిస్థితుల్లో (యుద్ధాలు, రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు వంటి విపత్తులు) రోగులకు తక్షణ చికిత్స అందించడంలో చాలా ఉపయోగపడుతుంది… కొన్ని నిమిషాల్లోనే ఎముకలు అతికిపోవడం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం కూడా పెరుగుతుంది… ఈ జిగురు ఆల్రెడీ వందలాది రోగులపై అద్భుత ఫలితాలు ఇచ్చింది…!! ఆర్థోపెడిక్స్‌లో ఇది గేమ్ ఛేంజర్..!!
Share this Article