.
Prasen Bellamkonda …….. కుంభమేళా నీటిని జలప్రసాదం అని ఆన్లైన్లో అమ్ముతున్న ప్రకటనలు ఈ మధ్య చూసి ఏమీ తోచలేదు…. ఓ బుడ్డి సీసా 198 రూపాయలట. మన ఫోటో ఫలానా web site కి పంపితే వాడే ఆ ఫోటోను కుంభమేళాలో ముంచుతాడట. అందుకు అయిదొందలట. ఈ నేపథ్యంలో చాలా విషయాలు గుర్తొచ్చాయి.
ముఖ్యంగా ఒక పాలపిట్ట , ఒక కాకి గుర్తొచ్చాయి. నేను ఆనాడు ఉహించిన బిజినెస్ టైకూన్ లు కళ్ళముందు నిలిచారు.
.
ముప్పయ్యేళ్ళ క్రితపు జ్ఞాపకం…
ఖమ్మంలో జమ్మిబండ దగ్గర పండుగరోజు శమీశమయతే పాపం అని రాసాక ఎందుకో తెలియకున్నా పాలపిట్టను ఆచారం ప్రకారం చూడాలట అని అనుకుంటున్నవేళ భవిష్యత్ బిజినెస్ టైకూన్ ఒకరు తన స్టార్టప్ యూనిట్ తో కనపడ్డాడు…
ఒక సంచి, ఆ సంచిలో ఓ పంజరం, ఆ పంజరంలో పాలపిట్ట అతని యూనిట్. పావలా చార్జ్ చేసి తలకాయను సంచిలోకి దూర్చినంతపనిచేసి వాళ్ళకు మాత్రమే పిట్ట కనపడేట్టు చేస్తున్నాడా వ్యాపార మాగ్నెట్. అది చూసి నేను ఆశ్చర్యవిచిత్రాయోమయగందరగోళకంగార్బయాందోళనను బోలిన మిక్స్ డ్ ఫీలింగ్ కు గురయ్యా.
Ads
ఎటుపోతున్నాం ఏమవుతోంది లాంటి ప్రవచనాత్మక పృచ్చకుడినై సమాధానపడలేక అర్జునాఫల్గుణాధనుర్దారీ అని గొణుక్కుని పావలా లేకపోవడంతో పుణ్యం మూటగట్టుకోలేక విచలిత మేధనై వెళ్ళిపోయా…
ఆ తరవాతి సంవత్సరం జమ్మిబండ నిర్వాహకులే ఓ పాలపిట్టను పంజరంలో పెట్టి బహిరంగంగా ఎత్తు మీద వేళ్లాడగట్టి అందరికీ దర్శనభాగ్యం కల్పించి ఆతడి స్టార్టప్ యూనిట్ కు తాళా లగాదియే అనుకోండి…
పిండాల దగ్గరికి కాకులు రావడం లేదని కాకుల దగ్గరికే పిండాలను తీసుకెళ్లిన ఓ వీడియో చూసి కూడా నేను కాకావికలం అయ్యాను.
ఆఆ తర్వాత్తరవాత దేవుడి ముందు చమురు జ్యోతికి బదులు మిణుక్కుమిణుక్కు బల్బులు, టేప్ రికార్డర్, సీడీ మంత్రాల పూజల షార్ట్ కట్ వెర్షన్లూ, ఖననానికి స్థలం లేదంటూ స్మశానంలో బోర్డులూ, అయ్యప్ప జ్యోతి మానవకల్పితమే అని చిరకాల అనుమానం కోర్టు ద్వారా రుజువైనపుడూ, ఇంకా చాలాచాలా చూసినా ఆనాడు సంచిలో పాలపిట్ట నాటకాన్ని చూసినప్పటి వేదనంతటి వేదన కలగలే..
అలవాటు పడిపొయ్యుంటానేమో బహుశా.. ఇవన్నీ నమ్మని నీకెందుకు వేదన అని నా మిత్రులు నన్ను ట్రోల్ చేయడం మొదలెడతారిక… నేనిక్కడ మాట్లాడేది సాంప్రదాయమో ఆచారమో కాదు.. మార్పు గురించి మాత్రమే… ఆచారాలను, సాంప్రదాయాలనూ పునర్నిర్వచించుకునే చౌరస్తాలో ఘర్షణ తప్పదు.
ఇదంతా ఎందుకంటే ..ఈ వ్యాపార ప్రకటనలు చూసి గుండె కలుక్కుమన్నందుకు!… వాడు మన ఫోటోను రోడ్డుపక్క మురిక్కాలువలో ముంచినా మనం ఇక్కడ హరోం హర అనుకుంటాం. వాడు మునిసిపల్ పంపుకు సీసా పెట్టి నింపి సీల్ చేసినా వాటిని మనం పరమ భక్తితో నెత్తిన చల్లుకుంటాం…
ఆ రోజు పాలపిట్ట
మొన్న కాకి
నిన్న ఫోటో మునక
ఇవాళ జల ప్రసాదం
రేపింకోటి
ఇంకా ఎన్నెన్ని చూడాలో
షో మస్ట్ గో ఆన్.
పిక్చర్ అభీ బాకీ హై దోస్త్!
Share this Article