అనుకుంటున్నదే… సినిమా వాళ్లకు తాము రాసిందే చరిత్ర… అసలు చరిత్ర ఇది కాదు కదా అంటే అస్సలు ఊరుకోరు, మస్తు రీసెర్చ్ చేశాం అంటారు… ఏమైనా వ్యతిరేకంగా చెప్పబోతే క్రియేటివ్ లిబర్టీ, సినిమా కోసం కొంత ఫిక్షన్ యాడ్ చేయక తప్పలేదు అంటారు… ఆది నుంచీ అంతేగా… మొన్నటి ఆర్ఆర్ఆర్ రాజమౌళి కథ వరకూ…
చెప్పొచ్చేది మంచు కన్నప్ప గురించి… అందులో మంచు విష్ణు, మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయకుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్ ఎట్సెట్రా వివిధ భాషల స్టార్స్ నటిస్తున్నారు… పాన్ ఇండియా లుక్ రావాలంటే పలు భాషల స్టార్స్ ఉండాలా..? ఆయా భాషల మార్కెట్లలో బజ్ కోసం, బిజినెస్ కోసమా..?
ఇంతకుముందు తెలుగులో తీయబడి పాన్ ఇండియా రేంజులో హిట్టయిన సినిమాల్లో ఈ ఇదే సూత్రం అమలు చేశారా..? కథలో దమ్ముండి, లోకల్ టాలెంట్‌తో మాత్రమే తీయబడినా దేశవ్యాప్తంగా హిట్ కొట్టాలి, అదీ అసలైన పాన్ ఇండియా అంటే…!
Ads
కన్నప్ప అలియాస్ తిన్నడు… ఒక సగటు బోయ… వేట తన వృత్తి… మహా అయితే అప్పట్లో తనకు ఓ వెదురువిల్లు, బాణాలు, ఓ కత్తి ఉండేవేమో… శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యంలో ధూర్జటి కూడా తిన్నడిని ఓ మామూలు వనవాసిగానే చిత్రించాడు… కన్నడ రాజకుమార్ కూడా బెదర కన్నప్ప అని 1954లోనే తీశాడు, అందులోనూ తిన్నడు ఓ సగటు వనవాసి…
బెన్‌హర్ స్థాయిలో భారీ సినిమా సంకల్పించిన కృష్ణంరాజు ఆ కథకు భారీతనాన్ని అద్దాడు… నాస్తికుడు, ఆస్తికుడు, ఓ నకిలీ బాబా ఎట్సెట్రా జతచేసి బోల్డంత లిబర్టీ తీసుకున్నారు… ఇక ఇప్పుడు మరీ బాహుబలి తరహా కథను రచిస్తున్నారు… మరి అందరు టాప్ హీరోలకు తగిన ప్రాధాన్యం ఉండాలి కదా… సో, కన్నప్ప కథ ఈ అవసరానికి తగినట్టు ‘కొత్త చరిత్ర’గా రచింపబడుతోంది…
మరి ఇప్పుడు కల్కి మార్క్ మహాభారతం ట్రెండ్ కదా… సో, కథలో ఓ పాత్ర… నాథనాధుడు… ఘటోత్కుచుడి వంశ వారసుడట… కథలోకి వచ్చేశాడు, అదే శరత్ కుమార్ లుక్కు… ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతున్నారు కథను… సరే, ఒరిజినల్ కన్నప్ప కథనే చెబుతారనే నమ్మకం లేకపోయినా… మంచి ఆకట్టుకునే కథ చెబుతారా చూడాలి…
టీజర్లలో సినిమా టీం పడుతున్న ప్రయాస, పెడుతున్న ఖర్చు కనిపిస్తూనే ఉంది… 100 కోట్ల వ్యయం అంచనా… సెట్టింగులు, ఆయుధాలు… (ఈమధ్య పాన్ ఇండియా ప్రయాస ఎక్కువైపోయింది మనోళ్లకు, 100 కోట్ల ఖర్చు ఈజీగా దాటించేస్తున్నారు… ఏదో నాని సినిమా కూడా అంతే ఖర్చు అట, కల్కి ఖర్చు కథ తెలిసిందే…) కాకపోతే మామూలు తిన్నడి కథను మహాభారతం అంతటి భారీ కథగా మారుస్తున్నారని ఎక్కడో ఓ చిన్న చిరాకు..!!
ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకుడు… గతంలో మహాభాారతం సీరియల్ తీసినవాడే… కన్నప్ప కథనూ మహాభారతం రేంజులో చెప్పాలంటే తను ఆప్ట్ దర్శకుడే… కానీ, ఇంకా అదే మహాభారతం సీరియల్ హ్యాంగోవర్ వదలకుండా మరేమైనా భారత పాత్రల్ని ఈ నాథనాధుడి తరహాలో క్రియేట్ చేస్తున్నాడేమో తెలియదు… ఇంకెన్ని పురాణ పాత్రలు వస్తాయో కూడా తెలియదు…
చివరగా… రాజకుమార్ కన్నప్ప హిట్ కావడానికి కారణం, తిన్నడిలోని భక్తి పారవశ్యాన్ని, భక్తి తాదాత్మ్యతను ప్రజెంట్ చేయడం… తరువాత కృష్ణంరాజు కన్నప్ప హిట్ కావడానికి కారణం పాటలు, దర్శకత్వ ప్రతిభ… అంతేగానీ భీకర పోరాటాలు, నెత్తుటి ధారలు, నరికివేతలు, శవాల కుప్పలు, కురుక్షేత్ర సంగ్రామాల స్థాయి యాక్షన్ సీన్లు కావు… ఉంటే తప్పని కాదు, భక్తి కథ కనెక్ట్ కావడానికి సంగీతం, సాహిత్యం ప్లస్ భక్తిలోని తాదాత్మ్యతను కనెక్టయ్యేలా ప్రజెంట్ చేయడం… అన్నమయ్య హిట్ కావడానికీ ఇవే కారణాలు… పాటలు ప్లస్ క్లైమాక్సులో అన్నమయ్య ఆ దేవుడిలో విలీనమయ్యే బలమైన దృశ్యాలు..!!
Share this Article