It’s a classic … అక్కినేని నటించిన సినిమాలలో ఈ సినిమా ఒక దృశ్యకావ్యం , కళాఖండం … మహాకవి కాళిదాసు , భక్త తుకారాం , భక్త జయదేవ సినిమాల్లాగానే 1976 లో వచ్చిన ఈ మహాకవి క్షేత్రయ్య కూడా ఓ రసానుభూతి … 1974 చివర్లో అమెరికాలో గుండె ఆపరేషన్ తర్వాత 1975 లో ఆయన సినిమాలు ఏవీ విడుదల కాలేదు … 1976 లో వచ్చిన మూడు సినిమాలలో ఒకటి ఈ సినిమా . అంజలీదేవి స్వంత సినిమా . ఆదుర్తి సుబ్బారావు మొదలుపెట్టారు . మధ్యలో ఆయన మరణించటం వలన సి యస్ రావు పూర్తి చేయవలసి వచ్చింది . ఇద్దరు దర్శకులు . లవకుశ కూడా ఇలాగే . తండ్రి పుల్లయ్య గారి అనారోగ్య కారణంగా సి యస్ రావు ఆ సినిమాను పూర్తి చేయవలసి వచ్చింది .
క్షేత్రయ్య అసలు పేరు వరద / వరదయ్య . కృష్ణా జిల్లా దివిసీమలోని మొవ్వ/ మువ్వ గ్రామంలో జన్మించారు . ఎలా అయితే కాళీమాత కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలను వ్రాసి మహాకవిని చేసిందో , అలాగే మువ్వ గోపాలుడు ఆకతాయిగా తిరిగే వరదను వాగ్గేయకారుడిగా చేసాడని చెపుతారు . కాళిదాసు లాగానే క్షేత్రయ్య కూడా ఏమీ చదువుకోలేదు . భగవంతుని కృప వలనే గొప్ప వాగ్గేయకారుడు అయ్యాడు …
ఆనాటి ఆచారాలు , దురాచారాల వలన మరదల్ని , దేవదాసి అయిన భామను ఎవరినీ వివాహాం చేసుకోలేక దేశ దిమ్మరి అయి పుణ్య క్షేత్రాల వెంట తిరగటం వలన క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని చెపుతారు . కంచి , శ్రీరంగం , తంజావూరు , చిదంబరం ఆయన తిరిగిన ప్రముఖ క్షేత్రాలు . భక్త జయదేవుని అష్టపదుల్లాగానే , క్షేత్రయ్య పదాలు . ఇద్దరూ కృష్ణుడితో సరసమాడిన వారే . శృంగార రసంతో తమ భక్తిని చాటుకున్న మహానుభావులు .
Ads
అంజలీదేవి భర్త ఆదినారాయణరావు గారు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం , వెంపటి సత్యం నృత్య దర్శకత్వం వహించటం వలన ఈ సినిమా గొప్ప దృశ్య కావ్యం అయిందని నేను భావిస్తూ ఉంటాను . 17 వ శతాబ్దానికి సంబంధించిన వాగ్గేయకారుడిగా చెప్పబడే క్షేత్రయ్య గురించి వివిధ కధల ఆధారంగా ఆరుద్ర , నిర్మాత ఆదినారాయణరావులు ఈ సినిమా కధను తయారు చేసుకుని ఉంటారు .
సినిమా అంతా పదాలు , పాటలు , నృత్యాలు . బహుశా అందువలనే ఏమో సాధారణ , పామర ప్రేక్షకులకు ఎక్కలేదు .కమర్షియల్ గా సక్సెస్ కాలేదని గుర్తు . కానీ ఈరోజుకీ పండితులకు , కళాభిమానులకు , రస హృదయులకు గొప్ప విందు ఈ సినిమా . రామకృష్ణ , సుశీలమ్మలు పాడిన జాబిల్లి చూసేను నిన్ను నన్ను పాట సూపర్ డూపర్ హిట్ . ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట . ఆరుద్ర వ్రాసారు . సినిమాలో ANR- ప్రభల మీద చిత్రీకరించబడింది . ఆ తర్వాత అద్భుతమైన మరో పాట మేలుకో కవిరాజ అని ప్రారంభమయి అష్ట విధ నాయక లక్షణాలను ఆవిష్కరించే పాట , ఆ పాటలో రాధాకృష్ణుల నృత్యం చాలా గొప్పగా ఉంటుంది . నృత్యించిన వారి పేర్లు నాకు తెలియవు . అభినందనీయులు . సి నారాయణరెడ్డి వ్రాయగా బాల సుబ్రహ్మణ్యం , సుశీలమ్మలు పాడారు …
నజరానా అనే పాటకు జయసుధ నృత్యం బాగుంటుంది . ఇంక మంజుల . ఆమె పాత్ర , నటన , నృత్యాలు , చలాకీతనం ఈ సినిమాకు గొప్ప ఎస్సెట్స్ . దేవదాసిగా , వరదకు స్నేహితురాలిగా , కూచిపూడి కళాకారిణిగా అక్కినేనితో సమానంగా నటించింది . మరో గొప్ప పాత్ర అంజలీదేవి నటించిన రంగాజమ్మ పాత్ర . తంజావూరు ప్రభువు రఘునాధ నాయకుడి ఇష్టపత్నిగా , కవియిత్రిగా అద్భుతంగా నటించింది .
ఇతర పాత్రల్లో హేమాహేమీలు నటించారు . రాజబాబు , ధూళిపాళ , రావి కొండలరావు , రాధాకుమారి , కాంతారావు , గిరిబాబు , కృష్ణకుమారి , రావు గోపాలరావు , మేమ సుందర్ , ప్రభాకరరెడ్డి , సాక్షి రంగారావు , ఝాన్సీ ప్రభృతులు నటించారు . అందరూ తమ తమ పాత్రలను చాలా గొప్పగా పోషించారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి , సిల్వర్ మెడల్ని ప్రదానం చేసింది .
కృష్ణా నది తీరాన దివిసీమలో కూచిపూడి , మొవ్వ , పెద కళ్ళేపల్లి , మోపిదేవి , ఘంటసాల , శ్రీకాకుళం వంటి గొప్ప పుణ్య క్షేత్రాలు ఉన్నాయి . సాహిత్య , సంగీత , నృత్యాలకు నెలవైన కూచిపూడి , మొవ్వ అభివృద్ధి నోచుకోకపోవటం తెలుగు వారికి అత్యంత దురదృష్టం . రెండూ పక్కపక్కనే ఉంటాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953 లో మద్రాసు నుండి విడిపడి ఇప్పటికి 71 ఏళ్ళు అయినా ఈ ప్రదేశాలు అభివృద్ధి కాలేదంటే మన పాలకులు ఎంత అభివృద్ధి కాముకులో అర్థం అవుతుంది . ఆ ప్రాంతం నుండి ఉద్దండులు ప్రజాప్రతినిధులు అయి , దశాబ్దాలుగా వెలిగిపోతున్నారు . కానీ , ఈ బెల్టుని దేశ పర్యాటక పటంలో ఎక్కించలేకపోయారు . ఈ క్షేత్రాలను అన్నీ రెండు సార్లు సందర్శించే భాగ్యం నాకు కలిగింది . మళ్ళా సినిమాలోకి వద్దాం .
బహుశా ఈ తరంలోనే కాదు ; మా తరంలో కూడా ఈ సినిమాను చూడని వారు ఉన్నారేమో ! యూట్యూబులో ఉంది . అర్జెంటుగా చూసేయండి . ఇంత అందమైన నృత్యాలు , శ్రావ్యమైన పాటలు పదాలు ఎక్కడ దొరుకుతాయి ?! తెలుగు వారి సంగీత , సాహిత్య , నృత్య వారసత్వ సంపద . మనం ఆస్వాదించకపోతే ఎలా ? కూస్తంత కళాపోషణ కూడా ఉండాలిగా ! చూసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article