Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజువయ్యా మహారాజువయ్యా…. నటనలో, ఈ పాత్రల్లో, ఈ కథనాల్లో…

July 14, 2025 by M S R

.

Subramanyam Dogiparthi     .........  మనుషులు మారాలి , చెల్లెలు కాపురం , తాసిల్దారు గారమ్మాయి వంటి సూపర్ హిట్ సినిమాల సరసన చేరిన సినిమా 1985 లో వచ్చిన ఈ మహారాజు సినిమా . శోభన్ బాబే కాదు , నటి సుహాసిని కూడా తమ కెరీర్లలో ఈ సినిమాను ఒక మైలురాయిగా భావిస్తారు . నీతినిజాయితీ , బాధ్యత గల ఓ సాధారణ వ్యక్తి అష్టకష్టాల కధే ఈ సినిమా కధ .

బాధ్యత కలిగిన వ్యక్తులు సంతానాన్ని , తోబుట్టువులను కష్టపడి సాకటం , రెక్కలొచ్చాక నిర్దయగా , బాధ్యతారాహిత్యంగా ఎగిరిపోవడం ఎన్నో సినిమాలలో చూసాం . ఈ సినిమాలో ఆ పుణ్యం తోబుట్టువులు కట్టుకుంటారు . నీతినిజాయితీ కలవారే నిరంతరం ప్రతి వారి చేత మోసగించబడుతూ ఉంటారు .

Ads

అలాంటి పాత్రే శోభన్ బాబుది ఈ సినిమాలో . ఆ బతుకు జట్కా బండిలో ఎన్ని ఎగుడుదిగుడులు వచ్చినా , ఎన్ని గతుకులొచ్ఛినా విడవకుండా వెంట ఉండేది భార్యే . అలాంటి ఉదాత్తమైన పాత్రలో సుహాసిని నటించారు . ఇద్దరూ బాగా నటించారు .

ఇద్దరిలో ఒక అడుగు శోభన్ బాబుదే ముందు . వీరిద్దరి పాత్రల తర్వాత గొప్ప పాత్ర హీరో శోభన్ బాబు మిత్రుడు రాళ్ళపల్లిది . జీవితంలో మనుషులకు ఇలాంటి మంచి మిత్రులు దొరకటం కూడా అదృష్టమే . రాళ్ళపల్లి చాలా బాగా నటించారు .

తమిళంలో హిట్టయిన రజనీకాంత్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడంలో కూడా రీమేక్ అయింది . తమిళంలో రజనీకాంత్ , చో , ఫటాఫట్ జయలక్ష్మి నటించారు . అందులో కూడా ముగ్గురూ బాగా నటించారు . ఇలాంటి కుటుంబ కధా చిత్రాలను తెరకెక్కించటంలో సిద్దహస్తులు విజయ బాపినీడు . (కాస్త మొరటు, వెగటు కామెడీ కూడా) .

చక్కటి దర్శకత్వాన్ని వహించారు విజయ బాపినీడు . 18 సెంటర్లలో వంద రోజులు ఆడింది . మహిళా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిన ఈ సినిమాకు రెండు కన్నీటి బొట్లను విడవకుండా పురుషులు కూడా ఉండలేరు . నాకయితే మనుషులు మారాలి సినిమాయే గుర్తుకు వస్తూ ఉంటుంది ఈ సినిమాను చూసినప్పుడు . టివిలో తరచూ వస్తూనే ఉంటుంది .

ముఖ్యంగా రాజువయ్యా మహరాజువయ్యా పాట . వేటూరి వారు ఎంత ఆర్ద్రంగా వ్రాసారో అంతే ఆర్ద్రతతో శోభన్ బాబు , సుహాసిని నటించారు , విజయ బాపినీడు చిత్రీకరించారు . ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ ఇది . అలాగే సుహాసిని చనిపోయినప్పుడు వచ్చే ఆత్రేయ గారి పాట చెలివో చెలిమివో .

  • (రాజువయ్యా మహారాజువయ్యా పాటను ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు మొదటిసారిగా ఈ పాట టీవీల్లో బాగా వేశారు… వైయస్ చనిపోయినప్పుడు ఎక్కువగా వేసిన పాట “చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు”….)

ఆడపడుచు అత్తవారింటికి వెళ్ళే అప్పగింతల సమయంలో తనకు చెప్పకుండా… అన్నగారికి మాత్రమే చెప్పి వెళ్ళిపోతుంటే బాధగా తలొంచుకుని ఇంట్లోకి నడుస్తూ… తిరిగి తలెత్తి వెళ్ళిపోతున్న ఆడపడుచు వెనక్కి వచ్చి చెబుతుందేమోనని ఆశగా చూడటం, వెంటనే నిరాశతో ఇంట్లోకి నడవటం, క్షణకాలంలో సుహాసిని తన కళ్ళల్లో చూపించిన వైవిధ్యం చాలా నచ్చింది…

మరొకచోట మీ పేర ఇన్సూరెన్స్ తీసుకుంటా అని భర్తతో అన్నప్పుడు, నేనిప్పుడే చచ్చిపోనులే అంటాడు. ఛ ఛ ఏమిటంత మాటన్నారు అని కంగారుగా అచ్చ తెలుగింటి ధర్మపత్నిలాగా బాధపడుతూ సుహాసిని చూపిన హావభావాలు ఎప్పటికి మరిచిపోలేం…

ఓ పాత్రధారీ ఎవరికి తెలుసు ఏ క్షణమేదో ఎవరికి తెలుసు అనే మరో వేటూరి వారి పాట కూడా జీవిత సారాంశమే . చిరునవ్విస్తా శ్రీవారికి సుహాసినితో , కన్యాకుమారిలో కన్ను కొట్టుకున్నాము స్వప్నతో డ్యూయెట్లు కూడా బాగుంటాయి …

జయమాలిని తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసింది . వారిద్దరు , సాయికుమార్ల మీద సాగే పెళ్ళి మాట ఎత్తకే సౌదామినీ పాట హుషారుగా ఉంటుంది . (సినిమాకు కమర్షియల్ మసాలాలు)… చక్రవర్తి సంగీతంలో పాటలే కాకుండా బేక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది . సత్యమూర్తి సంభాషణలు అక్కడక్కడా మన హృదయాలను నలిపేస్తాయి . Of course , హృదయం ఉన్న మనుషులకు . లేని వాళ్ళు అదృష్టవంతులు . వాళ్ళకు నలపటమే కానీ , నలిపించుకోవటం ఉండదు . పాషాణ జీవితాలు .

ఈ సినిమాలో మంచి పాత్రలూ ఉన్నాయి . ఆ మంచి పాత్రల్లో జగ్గయ్య , శ్రీధర్ , శుభలు నటించారు . స్వార్ధం , బాధ్యతారాహిత్యం గూడుకట్టుకున్న పాత్రల్లో ఈశ్వరరావు , సాయికుమార్ , నూతన్ ప్రసాద్ , సుత్తి వేలు నటించారు . ఎవరి గోల వారిది పాత్రల్లో అల్లు రామలింగయ్య , స్వప్న , మమత , శ్రీలక్ష్మి నటించారు . కాసేపే తళుక్కుమన్నా స్వప్న గ్లామర్ స్పేసుని బాగానే ఫిల్ చేసింది .

ఆరోజుల్లో కూడా స్లోగా నడిచే సినిమాగానే పేరుపడింది . అయినా ప్రేక్షకులు ఎందుకు ఆదరించారంటే (సీడెడ్, ఆంధ్రా కాదు, నైజాంలో…) ఆ సన్నివేశాలు తమ జీవితాలలో తారసపడేవి కావటం . ప్రేక్షకులు తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు .

సుహాసిని చనిపోయాక ఆమె ఇన్సూరెన్స్ డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించిన హీరో సక్సెస్ కావటం , డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించటంతో ప్రేక్షకుడు ఊరట చెందుతాడు . పోనీలే పాపం అనుకుంటాడు ప్రేక్షకుడు . అలా అనుకుంటూనే అయ్యో కష్టాలను పంచుకున్న భార్య సంపద వచ్చినప్పుడు లేకపోయిందే అని కూడా బాధ పడతాడు .

అవన్నీ మన చేతుల్లో ఉంటాయా ! ఆ కధను వ్రాసిన రచయిత చేతుల్లో ఉంటాయి . సినిమా ముగింపులో కష్టాలలో వదిలి వెళ్ళిపోయిన తోబుట్టువులు సంపద రాగానే చుట్టూ చేరుతారు . (చెరువు నిండిన కుప్పలుగా కప్పలు)… తెర మీదకు వెళ్లి కొట్టేద్దామని అనిపిస్తుంది సగటు ప్రేక్షకుడికి . అంతగా ప్రేక్షకులను సినిమా కధనంతో ఈడ్చుకుపోతాడు దర్శకుడు .

ఇంతకుముందు చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా . సినిమా ఫాస్ట్ పాసింజర్ రైలు లాగా సాగుతుంటుంది . ఇందుకు ప్రిపేర్ అయి చూస్తే సినిమాను ఆస్వాదించగలరు . శోభన్ బాబు అభిమానులకు ఇష్టమైన సినిమా ఇది . యూట్యూబులో ఉంది . ట్రై చేయండి .

ఈ సినిమాను ఫీల్ గుడ్ సినిమా అనాలా లేక ఫీల్ బేడ్ సినిమా అనాలా చర్చనీయాంశమే . ఎందుకంటే జీవితమంతా అష్టకష్టాలు అనుభవించి , సంపదను ఆర్జించాక అనుభవిస్తానికి భార్య లేకపోవడం బేడ్ కాకుండా గుడ్ ఎలా అవుతుంది !? #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కంచం పొత్తు – మంచం పొత్తు…. తెలంగాణ సమాజంలో ఎడతెగని చర్చ…
  • ఫాఫం సాక్షి… కోట శ్రీనివాసరావును ఇలా అవమానించడం దేనికి..?!
  • రాజువయ్యా మహారాజువయ్యా…. నటనలో, ఈ పాత్రల్లో, ఈ కథనాల్లో…
  • ఒకప్పటి లేడీ సూపర్ స్టార్… అగ్ర హీరోలందరికీ తెరపై ఇష్టసఖి…
  • రేషన్ కార్డు విలువ పెంచిన రేవంత్‌రెడ్డి… ఇదుగో ఇలా…!
  • ప్రమాదం కాదు… ఏదో కుట్ర… బాధ్యులు, ఉద్దేశాలు మాత్రమే తేలాల్సింది..!!
  • పొయ్యి మీద ఉప్పాలి… చేతిలో మెత్తటి ముద్దవ్వాలి… ఆవకాయతో జతకలవాలి…
  • కవితకు కేసీయార్ తీవ్ర శిక్ష… మల్లన్న కూతలకన్నా ఈ బహిష్కరణే పెద్ద నొప్పి..!!
  • దటీజ్ KSR దాస్… చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఓ సినిమా తీసేశాడు…
  • అయ్యా, అంబానీ వారూ… కాస్త మమ్మల్ని దయచూడండి సారూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions