Siva Racharla…….. కాలం మారింది.. ఎంత కాలం ప్రభుత్వాలను కూల్చటం? ఏకంగా పార్టీలను చీల్చి తమతో కలుపుకుంటే సరి! హోల్ సేల్ డీల్… రాష్ట్రపతి పాలన విధించడంలాంటివి ప్రాసంగితను కోల్పోయాయి. మంత్రి పదవి ,వేల కోట్ల కాంట్రాక్ట్ లు ఇస్తామంటే బంధాలు, జంధ్యాలు (మత కోణం కాదు) తెంచుకొని వెళ్ళటానికి ఎక్కువ మంది నాయకులు సిద్ధం, ఏ రాష్ట్రం అయినా ఏ పార్టీ అయినా. ఇప్పుడు అధికారమే పరమావధి, భవిష్యత్తు మీద చింత కాదు కదా కనీసం భవిష్యత్తు లేకున్నా పర్వాలేదు ఒక 2, 3 ఏళ్ళు మంత్రులుగా నో, మరొక పదవిలోనో ఉంటే చాలు అనుకునే పరిస్థితి ఏర్పడింది.
2019లో అజిత్ పవార్ బీజేపీ పక్షంలో చేరి 80 రోజులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతని లక్ష్యం మీద శరద్ పవార్ కు క్లారిటీ ఉండి ఉంటుంది. తిరిగి NCP లో చేరి ఈ నాలుగు సంవత్సరాలలో ఎమ్మెల్యేలను కూడగట్టుకొని ఇప్పుడు పార్టీని ఖాళీ చేసి బీజేపీతో చేరిపోయి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.
జూన్ మొదటి వారంలో సుప్రియా సులే, ప్రఫుల్ల పటేల్ లను వర్కింగ్ ప్రెసిడెంటట్లుగా శరద్ పవార్ నియమించినప్పుడే అజిత్ పవార్ NCP ని చీలుస్తాడని భావించారు. ఈసారి తెలివిగా చగన్ భుజభల్ ను కలువుకొని విజయవంతం అయ్యాడు. ఏకనాథ్ షిండే శివసేనను దక్కించుకున్నట్లే అజిత్ పవార్ కూడా NCP కి దక్కించుకుంటాడు. కోర్ట్ నిదానంగా విచారించి తీర్పు ఇస్తుంది ఈలోపు స్వీట్ టైమ్ చేదవుతుంది.
Ads
శరద్ పవార్ ఇప్పుడు గ్రౌండ్ లో తిరిగి బలాన్ని కూడగట్టే పరిస్థితుల్లో లేరు ,ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. సుప్రియా సులే మంచి వక్త, ఈ దశాబ్దపు మహిళ నేతల్లో ముందువరుసలో ఉంటారు. కానీ పార్టీని పునఃనిర్మించడం ఆవిడ శక్తికి మించిన పని. ప్రఫుల్ల పటేల్ రాజకీయ నేత కాదు, కార్పొరేట్ వ్యవహారాలు చూసే నేత మాత్రమే.
నిన్న అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రఫుల్ పటేల్, శరద్ పవార్ తమ నేత అనటం ncp శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్ఠించటానికే. రాజ్యసభ సభ్యుడైన ప్రఫుల్ పటేల్ ఆ ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించి ఉండాలి, హాజరు కావటం ద్వారా తాను ఎటు వైపు ఉన్నది సంకేతం ఇచ్చినట్లే.
వాజపాయి ప్రధాని అయిన తొలి రోజుల్లో గోవిందాచార్య లాంటి RSS నేతలు చెబుతుండేవారు.. బహుళ పార్టీ వ్యవస్థ మంచిది కాదు, ద్విపార్టీ వ్యవస్థ మాత్రమే ఉండాలి అని. 2024 ఎన్నికల తరువాత మహారాష్ట్రలో జరిగేది అదే, శివసేన ,ncp చీలిక పక్ష్యాలు బీజేపీలో విలీనం అవుతాయి, పాత NCP నేతలు కాంగ్రెస్ లో సర్దుకుంటారు. ఉద్ధవ్ థాక్రే కొద్ది రోజులో మరో శివసేన పేరుతో పోరాటం చేసి అలసిపోతాడు.
ప్రతి ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు ఒక భయం నెలకొన్నది. కనీస మెజారిటీకి అదనంగా 4, 5 సీట్లు గెలిచినా తమ ప్రభుత్వాన్ని ఏర్పడనిస్తారా? లేక కొందరు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి గవర్నర్ ని కలిసి ఎదురు పార్టీకి మద్దతు ఇచ్చేలా చేస్తారా? మరో 20 సంవత్సరాలలో అసలు పార్టీ వ్యవస్థ పోయి బ్లాంక్ ప్రభుత్వాలు ఏర్పడతాయేమో! అంటే ముందు సీఎం అవ్వటం, ఆ తరువాత రెండు వారాలలోనో లేక ఒక నెలలోనో ఎమ్మెల్యేల మద్దతు, అంటే కొనుగోలు చేయటం.
ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కువ మందికి చంద్రబాబు కనిపించొచ్చు కానీ నాకు మాత్రం శరద్ పవార్ కనిపిస్తాడు. డెమొక్రటిక్ కాంగ్రెస్ అని 1978లో కిచిడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దేవిలాల్ కుటుంబం, ప్రఫుల్లకుమార్ మొహంత, అజిత్ జోగి, జితిన్ మాంజీ చాలా పెద్ద లిస్టే ఉంది… అజిత్ పవార్ తో పాటు చగన్ బుజ్ భల్ వెళ్ళటం. కొంచెం ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఎమ్మెల్యేలను చగన్ భుజభల్ కూడగట్టి ఉంటాడు. శరద్ పవార్ అజిత్ పవార్ కన్నా You too Brutus అని చగన్ ను చూసి అనుకొని ఉంటాడు. గణేష్ నాయక్, నారాయణ రాణే, గోపీనాథ్ ముండే కుటుంబం… అందరి పరిస్థితి చగన్ కు బాగా తెలుసు, అయినా భవిష్యత్ మీద బెంగ లేదు.. ఈ రోజు మంత్రి పదవిలో ఉంటే చాలు అనుకున్నట్లున్నాడు…
Share this Article