.
మహాయుతిలో చీలిక అనివార్యమా..? ఈ కోణంలో చాలా వార్తలు కనిపిస్తున్నాయి… ఎందుకంటే..?
దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఆలోచన… కానీ మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఏకనాథ్ షిండే మళ్లీ తనే ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు… పార్టీలు గెలిచిన సీట్ల సంఖ్యతో సంబంధం లేదనీ వాదిస్తున్నాడు…
Ads
ఇవీ ఆ వార్తల సంక్షిప్త సారాంశం… 1) ఫడ్నవీస్ రెండున్నరేళ్లు, షిండే మరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని ఓ ప్రతిపాదన… 2) ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎలు అని మరో ప్రతిపాదన… 3) ఫడ్నవీస్‌ను కేంద్ర మంత్రిగా చేసి, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పట్టం గట్టి, షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఇంకో ప్రతిపాదన…
రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి… బీజేపీ చెప్పినట్టు షిండే వినడమే ధర్మం అవుతుంది… అఫ్‌కోర్స్, రాజకీయాల్లో ధర్మాధర్మాల నిర్వచనాలు వేరుగా ఉంటాయని ఎంత సమర్థించుకున్నా సరే…
1) బీజేపీ పొత్తులో భాగంగా 145 సీట్లలో నిలబడితే… షిండే శివసేన 75 సీట్లలో మాత్రమే నిలబడింది… అజిత్ పవార్ ఎన్సీపీ మరో 50 స్థానాల్లో నిలబడింది… అంటే ముందుగానే బీజేపీ ఆధిపత్యాన్ని అంగీకరించినట్టే కదా…
2) కూటమికి ప్రజాదరణ దక్కితే ఎలాగూ బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిసిందే కదా… ఇప్పుడు సీట్ల సంఖ్యతో ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదని షిండే ఎలా అనగలడు..? ఏదో బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకునే ఎత్తుగడ మాత్రమే…
3) అన్నింటికీ మించి శివసేనను చీల్చి బయటికి వచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చి తనను ముఖ్యమంత్రిని చేసింది… ఎన్నికల గుర్తు, పార్టీ పేరు కూడా దక్కడానికి సాయం చేసింది… సో, ఏ కోణం నుంచి చూసినా బీజేపీ పట్ల షిండేకు కృతజ్ఞత ఉండాల్సిందే… బీజేపీ నిర్దేశించిన మార్గంలో నడవాల్సిందే…
4) కాదూ లేదూ నేనే సీఎం అని భీష్మించుకున్నా ఒరిగేదేమీ ఉండదు… 132 సీట్లు గెలుచుకున్న బీజేపీ మరీ అవసరమైతే మెజారిటీకి అవసరమైన మరో 13 మంది ఎమ్మెల్యేలను ఎలాగోలా సమకూర్చుకోగలదు… ఎలాగంటే..? ఎన్డీయే కూటమి తరఫున జేఎస్ఎస్ రెండు, ఆర్వైఎస్పీ ఒకటి, ఆర్ఎస్వీఏ ఒకటి గెలుచుకున్నాయి… ఇద్దరు స్వతంత్రులున్నారు… మరో 7 మంది కావాలి…
5) షిండే గతంలో శివసేన ఠాక్రే ఫిరాయించినట్టుగా… కాంగ్రెస్ కూటమితో కలవలేడు… ఎందుకంటే, అందులో ఠాక్రే శివసేన ఉంది కాబట్టి… ఠాక్రే రానివ్వడు కాబట్టి… ఒకవేళ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ కలిసి, ఠాక్రేను వదిలేసి షిండేను కలుపుకున్నా సరే, మెజారిటీ లేదు… (కాంగ్రెస్ 16 + శరద్ పవార్ ఎన్సీపీ 10 ప్లస్ షిండే 57… 83 దాటవు… ఎస్పీ 2, సీపీఎం 1, పీడబ్ల్యూపీఐ 1 కలిపినా 87 మాత్రమే…)
6) ఎలా చూసినా సరే, మహాయుతి నుంచి బయటికి రావడం షిండేకు మంచిది కాదు… ఆల్రెడీ అజిత్ పవార్ కేసుల్లో ఉన్నాడు… బీజేపీతో వైరం పెట్టుకుని షిండే ప్రశాంతంగా అధికారాన్ని అనుభవించలేడు…
7) ఈసారి మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం గతంలోకన్నా బాగా పనిచేశాయి… దేవేంద్ర ఫడ్నవీస్ పట్ల దాని మొగ్గు… బీజేపీ తప్ప షిండే పగ్గాలు తీసుకోవడానికి అంగీకరించదు కూడా… సో, ఇలా ఏ కోణంలో చూసినా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం తథ్యం అనిపిస్తోంది… అదే కనిపిస్తోంది… ఇలా జరగకపోతేనే ఆశ్చర్యం..!!
8) మరీ అవసరమైతే గతంలో పొత్తు ధర్మాన్ని విస్మరించిన ఠాక్రేను వదిలేసి, షిండేను ముందుబెట్టి అధికారంలో ఉన్నట్టే… మరో షిండేను వెతుక్కుంటుంది… సింపుల్… వర్తమానంలో బీజేపీ వ్యూహాలు అవే కదా..!!
Share this Article