.
మహారాష్ట్ర ఫలితాలు నిజంగానే బీజేపీకి పెద్ద రిలీఫ్… మోడీ నాయకత్వానికి పెద్ద రిలీఫ్… గత లోకసభ ఎన్నికల్లో బాగా దిగాలుపడిపోయిన కాషాయ కూటమికి పెద్ద రిలీఫ్…
మసకబారిన యోగి ప్రతిష్ఠకు యూపీ ఉపఎన్నికల ఫలితాలు పెద్ద రిలీఫ్… వెరసి రాహుల్ నాయకత్వానికి మరో చేదు అనుభవం… కాంగ్రెస్‌తో జతకట్టే పార్టీలకు కూడా అంతే…
Ads
ఇంకొన్ని కోణాలూ ఉన్నాయి… తరచూ మోడీషాలపై ఉరుముతున్న ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్‌కు ఓ లెసన్… సొంత కాషాయ పడవకు చిల్లులు పొడవొద్దు అని జనమే తేల్చి చెబుతున్నట్టు లెక్క…
ఇక శరద్ పవార్ శకం సమాప్తం… సుప్రియా సూలేకు ఆ పార్టీని నిలబెట్టి నడిపించే స్థోమత లేదు… శరద్ పవార్ వయస్సు ఇక ఎన్నికలకు సహకరించదు… రాబోయే ఎన్నికల్లో నిలబడను అని ఆల్రెడీ చెప్పేశాడు… ఇప్పటికే ఆ పార్టీ, ఆ గుర్తు అజిత్ పవార్ చీలిక పార్టీ హస్తగతం అయిపోయాయి… కాస్త శరద్ పవార్ వైపు మిగిలిన కేడర్ కూడా అజిత్ పవార్ వైపు వెళ్తారు…
సేమ్… రాబోయే రోజుల్లో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కూడా ఇంకా దురవస్థలో పడుతుంది… ఆల్రెడీ పార్టీ గుర్తు, పార్టీ పేరు షిండే శివసేన వశమయ్యాయి… తన పట్ల మహారాష్ట్ర ప్రజలు నమ్మకాన్ని కనబరిచారు… వీసమెత్తు యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ వోటు కనిపించలేదు… సర్వేలలో దేవేంద్ర ఫడ్నవీస్‌కన్నా షిండే పట్ల ఆదరణ కనిపిస్తోంది…
ఠాక్రే వైపు ఉన్న శివసేన పాత కేడర్ కూడా బహుశా షిండే వైపు ఇంకా మళ్లుతారు… వెరసి ఠాక్రే ఇంకా సతమతం అవుతాడు… రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి పదే పదే చెబుతున్నాడు… అజిత్ పవార్‌ను ఈసారి ప్రభుత్వంలోకి తీసుకోకపోవచ్చుననీ, లేదా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చుననీ…
ఒకవేళ అదే జరిగితే బీజేపి తప్పులపాలవుతుంది… ఎందుకంటే… కలిసి పోటీచేశాం కదా, మమ్మల్ని విడిచిపెట్టి నీ సిద్ధాంతాలకు బద్ధవ్యతిరేకులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో ఎలా కలిశావు అని కదా బీజేపీ పదేపదే ఠాక్రేను విమర్శించింది… ఇదేం స్నేహధర్మం అని ప్రశ్నించింది…
అలాంటిది కలిసి పోటీచేసిన అజిత్ పవార్‌ను దూరం ఎలా పెట్టగలదు..? పెడితే ఇక బీజేపీ స్నేహధర్మం, క్రెడిబులిటీ గంగలో కలిపినట్టు కాదా..? బీజేపీ సొంతంగా 100కు పైగా సీట్లు గెలవబోతోంది కాబట్టి సీఎం పోస్టును తనే తీసుకుంటుందనీ, దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేస్తారని అంచనాలున్నాయి…
ఏమో, షిండేను కొనసాగించి, బీజేపీ డిప్యూటీ సీఎంతోపాటు కేబినెట్‌లో అధిక వాటా తీసుకోవడాన్ని కూడా కొట్టిపారేయలేం… ఇది మహారాష్ట్ర రాజకీయాల మీద ఈ ఫలితాల ఆధారంగా ఓ రఫ్ అంచనా… జార్ఖండ్ గురించి మరో కథనంలో చెప్పుకుందాం…
Share this Article