ఇద్దరూ హీరో రేంజే… సో, తెర మీద రెండు బలమైన వ్యక్తిత్వాల ఘర్షణ కనిపించాలి… సరిగ్గా తీయాలే గానీ ప్రేక్షకుడిని మస్తు కనెక్ట్ చేయగలిగే సబ్జెక్టు… దానికి తగ్గట్టు కథ, కథనం, ట్రీట్‌మెంట్ ఉంటే మాత్రమే..! కానీ అప్పట్లో ఆర్ఎక్స్ 100 అనే ఓ సబ్‌స్టాండర్డ్ సెమీ బూతు సినిమా తీసిన దర్శకుడు ‘ఇద్దరు మిత్రుల’ సబ్జెక్టునయితే ఎన్నుకున్నాడు గానీ, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక చేతులెత్తేశాడు… జస్ట్, శర్వానంద్ కేరక్టరైజేషన్ మినహా మిగతా పాత్రలేవీ పెద్దగా కనెక్టయ్యేలా లేవు… సహజంగానే శర్వానంద్ మంచి నటుడు కాబట్టి సినిమాను డామినేట్ చేశాడు… ఎందుకో గానీ సిద్ధార్థ తేలిపోయాడు పలు సీన్లలో…! పైగా ఆ మీసాలు, ఆ జుట్టు, ఆ లుక్కు తనకు అస్సలు సెట్ కాలేదు… సిద్ధార్థ్‌కు బహుశా ఇక తెలుగులో హీరో రేంజ్ కెరీర్, పాత్రలు కష్టమే… తెర మీద చూసినంతసేపూ ప్రేక్షకుడికి ఓ విసుగు… ఓ చిరాకు.. నిజానికి తను పెద్ద నటుడేమీ కాదు, కాకపోతే తెలుగులో అప్పట్లో కొన్ని హిట్ సినిమాలు పడ్డయ్, అప్పట్లో యంగ్, సో, నడిచింది…. ఇప్పుడు వయస్సు మీదపడుతున్న దశలో పాత్రల్లో దమ్ము తనను నిలబెట్టాలి… అదే ఈ మహాసముద్రంలోనూ లోపించింది… శర్వా డైలాగ్ డెలివరీలో కూడా మొనాటనీ కనిపిస్తోంది… జాగ్రత్తపడాలి…
ఇందులో అనూ ఇమాన్యుయేల్ ఉంది… ఎందుకు ఉందో దర్శకుడికే తెలియదు… ప్రేక్షకుడికి అంతకన్నా తెలియదు… కానీ ఉన్నంతసేపూ ప్లజెంటుగా కనిపించేది అదితిరావు హైదరీ… పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్రేమీ కాదు… కానీ ఆమె కళ్లల్లో ఏదో ఆకర్షణ ఉంది… నిజానికి ఆమెలోని నటనను, ఆమె అందాన్ని సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయగల పాత్ర ఆమెకు దొరకడం లేదు… రావు రమేష్ ఈమధ్య ఏదో పిచ్చి సినిమాలో ఉండీలేనట్టున్న పాత్ర చేశాడు ఒకటి… కానీ ఉద్వేగాల్ని సరైన టైమింగుతో పలికించగల నటుడు తను… విలనీ కావచ్చు, కామెడీ కావచ్చు, మామూలు పాత్ర కావచ్చు… ఈ సినిమాలో పాత్రలో బలం లేదు, అందుకే సెమీ- గూనితో పాత్ర లుక్కు వెరయిటీగా చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు, కానీ డిఫరెంటు లుక్కుకు తగినంతగా పాత్రలో దమ్ము లేదు, అందుకే తేలిపోయింది… జగపతిబాబు ఎప్పుడూ అంతే… ఏ సినిమా అయినా, ఏ పాత్ర అయినా తను అలాగే ఉంటాడు… మీ ఖర్మ, ఇష్టముంటే చూడండి అన్నట్టుగా…. ఇక మిగతావారి గురించి చెప్పుకోవడం పెద్దగా అవసరం లేదు…
Ads
ఇలాంటి సినిమాలకు పాటలు వెన్నుదన్నుగా నిలవాలి… అప్పట్లో, యాభై ఏళ్ల క్రితం… కృష్ణ, శోభన్‌బాబు నటించిన మంచి మిత్రులు సినిమా గుర్తుందా..? అందులోని ‘ఎన్నాళ్లో వేచి ఉదయం’ అనే పాట ఒకసారి వింటే చాలాసేపు చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది… అదీ ట్యూన్, అదీ భావం… మహాసముద్రంలో పాటలు ఒక్కటీ కనెక్ట్ కావు… అదితి డ్రీమ్ సాంగ్ ఒకటి మరీ అసందర్భంగా వచ్చి పడుతుంది, కాకపోతే అదితి కాబట్టి ప్రేక్షకుడు పారిపోకుండా కాపాడింది… ఇద్దరు హీరోలు కాబట్టి ఇద్దరికీ హీరోయిన్లు కావాలా..? ఇద్దరికీ లవ్ ట్రాకులు సపరేటుగా ఉండాలా..? ఒకప్పుడు మల్టీ స్టారర్ అంటే… హీరోల నడుమ సమానమైన ఫైట్లు, సమానమైన డాన్సులు అనబడే గెంతులు, సమానమైన డైలాగులు పెట్టేవాళ్లు… లేకపోతే ఫ్యాన్స్‌తో చిక్కు… కానీ ఇక్కడ శర్వానంద్, సిద్ధార్థలకు కూడా అవసరమా..? పైగా శర్వా, అనూ లవ్ ట్రాక్ మధ్యలోనే ఏమైపోతుందో అర్థం కాదు… పోనీలెండి… ఈ సినిమాలోనే డైలాగ్ రైటర్ చెప్పినట్టు… సముద్రం అంటేనే అన్నీ దాచుకునేది, ఈ సినిమాలోని కథన లోపాల్లాగే…! నదులన్నీ సముద్రాన్ని చేరలేవు, కొన్నింటికి ఆ అదృష్టం ఉండదు, విజయసముద్రాన్ని చేరడానికి ఈ కథకు కూడా అదృష్టం లేదు…!!
Share this Article