పాటల్లేని తెలుగు సినిమా… నో పైట్స్… ఇతరత్రా ఏ సగటు సినిమా కమర్షియల్ వాసనలు లేకుండా కథ… సమాజ సహజ పాత్రలు… డిఫరెంట్ టేకింగ్… లో బడ్జెట్ మూవీ తీసిపెట్టాలని రామినేని సాంబశివరావు అనే నిర్మాత దర్శకుడు దాసరిని అడిగాడు…
సెవన్టీస్, ఎయిటీస్‌లో దాసరి అంటే ఓ బ్రాండ్… తన పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు, అదే మార్కెటింగ్ మంత్ర… తనకు తోచిన ప్రయోగాలు చేస్తూ వెళ్లేవాడు… సాహసి… నిర్మాత రామినేని అడిగినప్పుడు అలా సినిమా తీస్తే మహా అయితే రెండు వారాలు ఆడుతుందేమో సినిమా అని బదులిచ్చాడు దాసరి…
Ads
ఐనాసరే, నాకు వోకే అన్నాడు నిర్మాత… కొత్త నటీనటులు… సమస్యాత్మక కథ… పంపిణీదారులు, కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా సరే నాకు అలాంటి సినిమాయే కావాలన్నాడు నిర్మాత… సరే అన్నాడు దాసరి… ఏకంగా జాతీయ అవార్డుకు అర్హమైన రీతిలో తీద్దామని ముందుకొచ్చాడు… సామాజిక ప్రయోజనార్థం కొన్ని సినిమాలైనా తీయబడాలి అంటాడు తను…
అలా మొదలైంది ‘నీడ’ అనే సినిమా… ఇవి కావు అసలు విశేషాలు… మీ అబ్బాయిలను పరిచయం చేస్తాను అన్నాడు సూపర్ స్టార్ కృష్ణతో… అప్పటికి రమేష్ బాబు వయస్సు 14 ఏళ్లు… మహేశ్ బాబు వయస్సు నాలుగేళ్లు… దాసరి అడిగాక కృష్ణ నో అంటాడా మరి… తనూ ప్రయోగశీలి కదా… గోఎహెడ్ అన్నాడు… అదుగో అదీ ప్రస్తుత స్టార్ హీరో మహేశ్ బాబు తెరంగేట్రం…
నిజానికి చాలామంది మహేశ్ బాబు అభిమానులకే తెలియవు ఈ విశేషాలు… పైగా యూట్యూబ్‌లో సినిమా లేదు, పాటల్లేవు కాబట్టి ఆ వీడియోలు కూడా లేవు… 1979లో రిలీజైంది ఈ సినిమా… జస్ట్, 10 రీళ్లు… 14 రోజుల్లోనే విజయవాడ పరిసరాల్లో షూటింగ్ కంప్లీట్ చేశాడు దాసరి… కార్యశూరుడు కదా… తను చేరదీసిన ఎర్ర స్టార్ నారాయణమూర్తికి కూడా ఓ ప్రధాన పాత్ర…
రమేశ్ బాబు మరో ప్రధానపాత్ర… కథంతా చిన్న పిల్లలు ఎదిగే పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం, ఇరుగుపొరుగు తత్వాలు, సినిమాల ప్రభావం మీదే ఉంటుంది… రమేశ్ బాబు చిన్నప్పటి పాత్ర మహేశ్ బాబు… ఆ సెట్‌లో బాల మహేశ్ నుదుటన బొట్టు పెట్టి, ఓ ఉజ్వల కెరీర్‌కు నాంది పలికాడు దాసరి…
ఈ సినిమాకు సంబంధించి ఆమధ్య నారాయణమూర్తి ఇలా గుర్తుచేసుకున్నాడు… ‘‘నటన, సినిమాల మీద ప్రేమతో దాసరిని కలిశాను… డిగ్రీ పూర్తి చేశాక కనిపించు, తప్పక నటుడిని చేస్తాడు అన్నాడు గురువుగారు… డిగ్రీ పూర్తి కాగానే వచ్చాను… నీడ సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు…
రమేశ్ బాబు హీరో, నాది సెకండ్ మెయిన్ లీడ్… అప్పట్లో నాకు ప్రజాఉద్యమాలతో సంబంధం ఉండేది కదా, నా తత్వం తెలిసి నాకు ఈ సినిమాలో అలాంటిదే రాడికల్ రోల్ ఇచ్చాడు… తరువాత అనేక నక్సల్బరి సినిమాలు చేశాను… దానికి నీడ సినిమాయే ఆరంభం…
నారాయణమూర్తిని కొట్టిన దాసరి
ఓ సీన్‌లో నారాయణమూర్తి అసలు నటించలేకపోతున్నాడు పాత్రకు తగినట్టు… చూసీ చూసీ అందరి ముందే ఫట్‌మని కొట్టాడు దాసరి… అదేమిటండీ రమేశ్ బాబు అన్ని టేకులు తింటుంటే తనను ఏమీ అనకుండా నన్ను కొట్టారేమిటి అనడిగాడు కన్నీళ్లపాలవుతూ నారాయణమూర్తి… దానికి దాసరి జవాబు…
‘‘నువ్వు అన్నీ వదులుకుని ఫీల్డ్‌కు వచ్చావు, నిన్ను నటుడిని చేస్తానని హామీ ఇచ్చాను… తప్పులు సరిచేసి, తీర్చిదిద్దే క్రమంలో కొన్నిసార్లు కఠినత్వం తప్పదు, రమేశ్ బాబు తనంతట తాను ఈ సినిమాలోకి రాలేదు, నిర్మాతలు తనే కావాలని వెళ్లి అడిగారు… తేడా తెలిసింది కదా’’
ఈ సినిమా తొలి క్లాప్‌కు పెద్ద పెద్ద ఆర్టిస్టులను పిలవలేదు దాసరి… జర్నలిస్టు తుర్లపాటి కెమెరా స్విచాన్ చేస్తే సంపాదకుడు నండూరి రామ్మోహనరావు క్లాప్ కొట్టాడు… రెండు వారాలు అనుకున్న సినిమా బాగానే ఆడింది… నాలుగు కేంద్రాల్లో ఏకంగా హండ్రెడ్ డేస్… శతదినోత్సవాన్ని చెన్నై చోళ హోటల్‌లో జరిపారు…
దానికి కరుణానిధి, అక్కినేని, కృష్ణ హాజరయ్యారు… దాసరిని కరుణానిధి ‘తెలుగు చిత్ర కేసరి దాసరి’ అని పొగిడాడు అక్కడ… మరో ఇంట్రస్టింగ్ విశేషం ఏమిటంటే.? దీన్ని జాతీయ అవార్డుల కోసం పంపించారు… అప్పట్లో ఎల్‌వి ప్రసాద్ జ్యూరీ మెంబర్… చిత్రం చూసి దాసరిని అభినందించి అవార్డుకు రికమెండ్ చేస్తానన్నాడు… కానీ కొన్ని సాంకేతిక కారణాలతో మిస్సయింది…
టైటిల్స్ పడుతుంటే దాసరి వ్యాఖ్యానం వినిపిస్తూ ఉంటుంది… సినిమాలో ట్రాలీ షాట్స్, జూమ్ లెన్స్ పెద్దగా వాడకుండా క్లోజ్ షాట్స్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చాడు దాసరి… ఇదండీ నీడ సినిమా కథ… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article