పార్లమెంటులో ఆమె వాగ్ధాటి చూస్తే ముచ్చటేసేది… సబ్జెక్టు డీవియేట్ గాకుండా.., కాస్త చదువుకుని, ప్రిపరేషన్ వర్క్ చేసుకున్నట్టు కనిపించేది… చేసే వ్యాఖ్యల్లో కూడా సీరియస్‌నెస్ ఉండేది… బీజేపీ విధానాలు, వైఫల్యాల్ని ఎఫిషియెంట్‌గా ప్రశ్నిస్తున్న గొంతు అనిపించేది… కానీ ఏమైంది..?
ఒక్కసారిగా బురద పూసుకున్నట్టయింది… ఏ పార్లమెంటులో ఆమె ప్రతిభ ఎక్స్‌పోజ్ అయ్యిందో అదే పార్లమెంటు ప్రమాణాల్ని, విలువల్ని పాతరేస్తూ… ఎవరికో లాగిన్ ఇచ్చేసి, ఏవేవే ప్రశ్నలు, అవీ ఎవరి స్వార్థం కోసమే ఉపయోగపడే ప్రశ్నలు ఆన్‌లైన్‌లో సంధించడానికి అవకాశం ఇచ్చిన నిర్వాకం బయటపడి ఆమె ఇజ్జత్ పజీత అయిపోయింది… ఇకపై ఆమె ఏం మాట్లాడినా, ఏం ప్రశ్నించినా దానికి విలువ ఉండదు… అయిపాయె…
Ads
నిజానికి ఈ ప్రశ్నల దందా గతంలో లేదనీ చెప్పలేం, కానీ ఆమె చేయడం నచ్చలేదు… మిగతా తుప్పుల గురించి మాట్లాడే పనిలేదు, నిప్పులా కనిపించి తుప్పులా మారిన తీరు మీదే చర్చ… పేరు చెప్పనే లేదు కదూ… మహువా మొయిత్రా… నిజానికి ఆమె బెంగాలీ కాదు, అస్సోంలోని కచార్ జిల్లాలో పుట్టింది… ఉన్నత విద్యావంతురాలు… కోల్‌కతాలో ఎకనమిక్స్, అమెరికాలో మ్యాథ్స్ పీజీ, న్యూయార్క్ జేపీ మోర్గాన్‌లో కొలువు… లండన్‌లో కొన్నాళ్లు కొలువు… చివరకు అన్నీ వదిలేసి 2009లో రాజకీయాల్లోకి వచ్చింది…
మొదట కాంగ్రెస్, తరువాత తృణమూల్ కాంగ్రెస్… మొదట్లో ఎమ్మెల్యే, తరువాత గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపు… ప్రస్తుతం ఆమె వయస్సు 50… తన రాజకీయ కెరీర్ బాగా వెలిగిపోతున్న ఈ దశలో హఠాత్తుగా మసకబారింది… కారణం, ఆన్‌లైన్‌లో స్వార్థపు ప్రశ్నలు వేయడానికి ఎవరికో ఆమె లాగిన్ యాక్సెస్ ఇవ్వడం… దుబాయ్ నుంచి సదరు లబ్ధిదారు అనేకసార్లు లాగిన్ కావడమే గాకుండా తనకు ఇష్టమున్న ప్రశ్నలు వేశాడు… ఇది కాస్తా బయటపడింది…
తనతో కొన్నాళ్లు సహజీవనం చేసి విడిపోయిన ఓ లాయర్ ఈ రహస్యాలన్నీ బయటపెట్టాడనీ, తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడనీ ఆమె ఆరోపణ… కారణం, కారకులు ఏదైనా, ఎవరైనా సరే ఆమె తప్పు చేసిందా లేదానేదే ముఖ్యం… అబ్బే, ఆ ఆన్‌లైన్ ప్రశ్నల కోసం నేనేమీ పెద్దగా కానుకలు తీసుకోలేదనీ, జస్ట్, ఏవో లిప్‌స్టిక్ గట్రా మేకప్ సామాగ్రి తీసుకున్నాననీ, లాగిన్ ఇవ్వడం నిజమేననీ అంటోంది… ఆమె ఏం లబ్ధి పొందిందో బయటపడటం కష్టం… కాస్త విలాసజీవి అంటుంటారు… చివరకు తప్పు అంగీకరించింది… ఎవరైతే ఆమె వల్ల లబ్ధి పొందారో వాళ్లే ఫిర్యాదులకు దిగారు… అదీ విశేషం…
తప్పు చేయలేదని అనడం లేదు… కానీ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి తనను విచారించే హక్కు లేదని అంటోంది… చివరకు తప్పలేదు… ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరైంది… మధ్యలోనే బయటికి వచ్చేసి, నన్ను అన్నీ అసభ్యమైన చెత్త ప్రశ్నలు అడుగుతున్నారని ఆరోపించింది… ఈమెకు మద్దతుగా మన ఉత్తమకుమార్‌రెడ్డి తదితరులు కూడా నిలిచారు… ‘ఇండియా’ కూటమిలో టీఎంసీ కూడా ఉంది కదా… అందుకోసమేనేమో… కానీ ఆ కమిటీలో ఉండేది కూడా తోటి ఎంపీలే… లోపల ఏం అడిగారో, ఏం జరిగిందో ఎవరూ చెప్పరు… చెబితే బాగుండు…
విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది ఆమెలో… ఎవరో విలేకరి అడిగాడు, మీ కళ్లల్లో నీళ్లు వస్తున్నట్టున్నయ్ అని… వెంటనే కోపంతో కళ్లు ఇలా వేళ్లతో తెరిచి, చూడు, నీళ్లు కనిపిస్తున్నాయా అని విరుచుకుపడింది… ఇలాంటి చేష్టలతో ఆమె పరువు మరింత దిగజారుతోంది… గతంలో ఓసారి ఆమె ఎవరి మీదో విమర్శలు చేస్తే టీఎంసీ డిస్‌ఓన్ చేసుకుంది, పార్టీకి సంబంధం లేదని చెప్పింది… బహుశా ఇప్పుడు కూడా మమతా బెనర్జీ ఆమె వ్యవహారశైలిని క్షమించకపోవచ్చు… మహువాలో అందుకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది… ఎన్‌డీఏను కడిగేసే గొంతు ఇప్పుడు సరిగ్గా పెగలడం లేదు… అంతా స్వయంకృతం…!!
Share this Article