థియేటర్లకు జనం రావడం లేదని తెలుగు సినిమాల షూటింగులు 3 నెలలపాటు ఆపేస్తారట… ఓటీటీల్లో 100 రిలీజ్ చేయాలట… మరి పాఠకులు పత్రికలను చదవడం లేదు… ఏం చేయాలి..? ప్రింటింగ్ యూనిట్లను మూసిపారేసి, డిజిటల్ పేపర్లతో కథ నడిపించేయాలా..? ఈ-పేపర్లే ఓటీటీలు అనుకోవాలా..? ఈనాడులో రెండు భవ్యకథనాలు చూశాక (చూడటమే, చదివేంత శ్రమ ఈనాడు అస్సలు ఇవ్వడం లేదు చాన్నాళ్లుగా…) పైన డౌటనుమానాలు మరింత పెరిగాయి…
సోషల్ మీడియాలో, న్యూస్ యాప్స్‌లో వార్తల్ని ఫాలో అయ్యేవాళ్లు ఎవరైనా సరే… ప్రధాన పత్రికల సిబ్బంది అయినా సరే… ఈరోజు తెలుగు పత్రికల్లో ఒక్కటి… కనీసం ఒక్కటి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ చూపించండి… సోషల్ మీడియాలో కవర్ కాని వార్త ఒక్కటి చూపించండి… ఈరోజు పొద్దున్నే కొత్తగా చదువుతున్నాను అని ఫీలయ్యే కథనం ఒక్కటి చూపించండి… నిల్… అన్నీ సద్ది వార్తలే… పాచి వార్తలే…
ఇప్పుడు ఆ పాచి వార్తల శకం కూడా దాటి పత్రికలు ఎంగిలి వార్తల శకంలోకి ప్రవేశిస్తున్నాయి… నిజానికి వేరే పత్రికల్లో ఏదయినా వార్త వస్తే, మళ్లీ దాన్ని మనం కవర్ చేయాలంటే ఎంగిలి వార్తగా భావిస్తాం… వదిలేస్తాం… మరీ అవసరమైతే తప్ప టచ్ చేయం..! అలాంటిది ఇప్పుడు ఎటూ తిరగాల్సిన పనిలేదు… కొత్త వార్తల కోసం కష్టించాల్సిన పనిలేదు… సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, పోస్టులు, చెణుకులు, విమర్శలన్నీ ఒకేచోట గుదిగుచ్చి, పబ్లిష్ చేస్తే సరి… చదివేవాడు చదువుతాడు, వాడి ఖర్మ…
Ads
పత్రికల్లో వచ్చే వార్తలు చూసి మీమ్స్ చేసే పనిలేదు ఇప్పుడు… సోషల్ ప్లాట్‌ఫారాల మీద కనిపించే మీమ్స్, పోస్టులే పత్రికల్లో వార్తలయిపోతున్నయ్… వార్తల కోణంలో, పాత్రికేయ భాషలో… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు… నిజానికి సాక్షి, నమస్తే తెలంగాణ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవతెలంగాణ తదితర పత్రికలు ఆయా రాజకీయ పార్టీల సొంత పత్రికలు… వాటి గోల వాటిది… ఆ రంగు కళ్లద్దాల నుంచే వార్తలు చూపిస్తాయి… అవే నమ్మమంటాయి… పాఠకుడినీ అలాగే చదవమంటాయి… ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి కూడా అంతే…
ఎటొచ్చీ ఈనాడు… న్యూట్రల్ ముసుగు వేసుకున్నా సరే, అదీ పచ్చపత్రికే… కాకపోతే మరీ బజారులో బరిబాతల డాన్సు చేయదు… అదేమో ఇలా రంగు, రుచి, చిక్కదనం, వాసన లేకుండా జిగట ఉప్మా పత్రికయిపోయింది… దాని పచ్చ పైత్యాన్ని క్షమించగలిగితే ఆంధ్రజ్యోతి ఈమధ్య కాస్త బాగున్నట్టుగా భ్రమకల్పిస్తోంది…
సరే, పాచి, ఎంగిలి వార్తలకు వద్దాం… ఇది ఈనాడులో వచ్చిన వార్త… నిజానికి నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో వార్త ఇది… ఈ వార్తలో కొత్తగా ఏమీ లేదు… మరెందుకు అటెంప్ట్ చేసినట్టు..? సోషల్ మీడియాకన్నా ఈనాడు రీచ్ పెద్దదేమీ కాదుగా… ఆ లెక్కన ఈనాడు రీచ్ ఏపాటి..?! ఇలాంటి వార్తలు బోలెడు కనిపిస్తున్నాయి ప్రధానపత్రికల్లో…! ఏబీసీ వాడు, ఐఆర్ఎస్ వాడు ఆడిటింగ్, సర్వేలు ఆపేశారు కరోనా తరువాత… లేకపోతే ఈ పత్రికల తాజా సర్క్యులేషన్, రీచ్ బండారాలు బయటపడేవి…!!
Share this Article