నో డౌట్… చదువుకోవాలనుకున్న ఈ పిల్లపై అప్పట్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపింది నిజం…. వాళ్లు చేసిన అనేకానేక బీభత్స, భీకరమైన అరాచకాల్లో చాలా చిన్న సంఘటన అది… అంతర్జాతీయ సమాజం ఖండించింది, అండగా నిలిచింది, ఆమె చదువుకుంది… ఆశ్చర్యంగా నోబెల్ వాడు ఆమెకు శాంతి బహుమతి ప్రకటించాడు… నిష్ఠురంగా ఉన్నా ఒకటి మాత్రం నిజం… ఆమె బాధితురాలు, అంతేతప్ప శాంతి స్థాపనకు ఆమె చేసింది ఏముంది..? తాలిబన్ల పాలనలో లక్షల మంది మహిళలు, పిల్లలు ఇంతకన్నా ఘోరాతిఘోరమైన దారుణాలకు గురయ్యారు… ఎహె, నోబెల్ బహుమతులకు విలువేముందీ అంటారా..? దాని లెక్కలు వేరే అంటారా..? సరే, ఆ చర్చలోకి వద్దు… ఆమె తరువాత అనేక అంతర్జాతీయ వేదికలపై మాట్లాడింది… ఓ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది… పర్లేదు… కానీ ఆమె ప్రతి మాటలో ఇండియా పట్ల విద్వేషం అనేది నిజం… అసలు ఆమెకు ఎందుకంత సీన్ అనేదీ అర్థం కాదు… ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతోంది..? మాటల్లో అర్థం లేదు, కానీ అంతర్జాతీయంగా మీడియా ఆమె మాటలకు అంతులేని విలువను ఆపాదిస్తూనే ఉన్నయ్… ఆమెను ఓ మహత్తర వ్యక్తిగా చిత్రీకరిస్తూనే ఉన్నయ్…
‘‘ఒక్క తూటా నుంచే నేనింకా కోలుకోలేదు, రోజూ లక్షల తూటాలు అప్ఘన్ ప్రజలపై కురుస్తున్నాయి… నా పాత తూటా గాయానికి సర్జరీ చేయించుకున్నాక తాలిబన్లు ఒక్కో ప్రావిన్సునూ హస్తగతం చేసుకుంటున్న విషయం తెలిసింది… కోలుకోగానే దేశాధినేతలు, మహిళా హక్కుల కార్యకర్తలకు ఫోన్లు చేస్తున్నాను… తాలిబన్ల నుంచి అప్ఘన్ మహిళల్ని కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి..’’ అంటోంది ఆమె… ఔనా..? జస్ట్, అలా అలా దేశాధినేతలకు కాల్స్ చేస్తోందా ఆమె..? తాలిబన్లతో అమెరికా చర్చలు చాలారోజులుగా జరుగుతున్నయ్, కిక్కుమనలేదు ఈమె… ఈ ఇంటర్నేషనల్ కేరక్టర్ ఇన్నిరోజులూ ఏం చేస్తోంది..? పోనీ, తాలిబన్ పీడన అనంతరం ఇన్నేళ్లూ అప్ఘన్ పాలకులు తాలిబన్ వైఖరులకు భిన్నంగా బాలికా విద్య, మహిళా స్వేచ్ఛపై ఉదార వైఖరినే అవలంబిస్తున్నరు కదా, ఒక్కరోజూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు… ఇప్పుడు రోజూ అఫ్ఘన్ ప్రజలపై లక్షల తూటాలు కురుస్తున్నాయట… నిజానికి కొన్నేళ్లుగా ఆ హింస లేనేలేదు అసలు… ఇప్పుడు కూడా వరుసగా ప్రావిన్సుల్ని బుల్లెట్లు కాల్చకుండానే తాలిబన్లు హస్తగతం చేసుకుంటున్నారు… అగ్రదేశాలు, ఐరాస కూడా అప్ఘన్ సంక్షోభంపై మల్లగుల్లాలు పడుతున్నాయి… ఇప్పుడు ఈమెకు లక్షల బుల్లెట్లు కనిపిస్తున్నాయిట…!! మలాలా వ్యాఖ్యల్లో వ్యక్తమయ్యే బాధను, ఆందోళనను ఖండించాల్సిన అవసరం లేదు… కానీ నిజంగా ఆమెకు అంత ఇంపార్టెన్స్ మీడియాలో అవసరమా అనేది ఇప్పుడూ ఒక పెద్ద ప్రశ్నే… సరే, ఇండియన్ మీడియా ఎప్పుడూ ఇంటర్నేషనల్ మీడియాను చూసి వాతలు పెట్టుకునే రకమే కాబట్టి మన మీడియా వార్తల్ని చూసి జాలిపడటమే… ఇంకా నిఖార్సయిన నిదర్శనం కావాలా..? ‘‘బాలికా విద్యపై అతివాదులు నిషేధం విధించడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను కాబట్టి నాపై తాలిబన్లు కాల్పులు జరిపారు’’ అంటోంది ఆమె… నిజమా..? ఆమె బాలికగా ఉన్నప్పటి నుంచే బాలిక విద్య, తాలిబన్ల నిషేధంపై పోరాడుతోందా నిజంగా..? అందుకే తాలిబన్లు కాల్పులు జరిపారా..? అబ్సర్డ్…! ఇంత సెల్ఫ్ ప్రమోషన్, అబద్ధాలు దేనికి..? ఇదే మలాలా మాటలకు అంత సీన్ లేదు అని చెప్పడానికి…! సరే, ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా, మంచిదేగా అంటారా..? అంతేలెండి…!!!
Ads
Share this Article