ఓటీటీ శకం వచ్చాక మన తెలుగు ప్రేక్షకులు కూడా ఇతర భాషాచిత్రాల్ని నేరుగా చూసేస్తున్నారు… అవసరమైతే సబ్ టైటిల్స్ ఉండనే ఉన్నాయి… దీనికితోడు స్టార్ హీరోల ప్రతి సినిమాను పాన్ ఇండియా పేరిట ఇతర భాషల్లోకి అనువదిస్తూనే ఉన్నారు… అవీ ఓటీటీల్లో ఉంటాయి… మామూలు మలయాళ చిత్రాలతోపాటు మనవాళ్లు మోహన్‌లాల్, మమ్ముట్టి సినిమాలను ఖచ్చితంగా ఓటీటీల్లో టచ్ చేస్తూనే ఉన్నారు…
కారణం… ఆ ఇద్దరు స్టార్ హీరోలం అనే భేషజాలకు పోకుండా ఎలాంటి పాత్రనైనా ధరించడానికి ముందుకొస్తారు… అవసరమైతే కమర్షియల్ వాసనలన్నీ వదిలేసి మరీ పాత్రలోకి దూరిపోతారు… దర్శకులు కూడా ప్రయోగాలను ఇష్టపడుతుంటారు… సోకాల్డ్ మసాలా, ఫాల్స్ ఇమేజీ బిల్డప్పులనూ ఆశ్రయించరు… కానీ కొన్నిసార్లు అలాంటి పాత్రలూ ఆ హీరోల నమ్మకాల్ని అడ్డంగా బోల్తాకొట్టిస్తుంటాయి… అలాంటిదే మోహన్‌లాల్ నటించిన మలైకొట్టై వాలిబన్…
కంగారు పడకండి… వాలిబన్ అంటే ఆ హీరో పాత్ర పేరు… మలైకొట్టై ఎడారిని తలపించే ఓ ఏరియా పేరు… మళ్లీ తెలుగులోకి టైటిల్ అనువాదమో, మరో పేరో దేనికిలే అనుకుని అలాగే తెలుగులోనూ పెట్టేశారు… మోహన్‌లాల్ ఫ్యాన్స్ అధికంగా ఉండే మలయాళంలోనే సినిమా ఫ్లాప్… బాక్సాఫీసు లెక్కలు చూస్తే 30 కోట్ల వరకూ అంకె కనిపించింది… అందులో సగం ఓవర్ సీస్ కలెక్షన్లే… సినిమాలో పస లేకపోయినా హీరో స్టార్ డం తీసుకొచ్చిన వసూళ్లు అవి… దర్శకుడేమో జల్లికట్టు వంటి సినిమాలు తీసిన లిజోజోస్… తీరా సినిమా చూడటం స్టార్ట్ చేశామా, అనంతమైన నీరసం మనల్ని కమ్మేస్తుంది…
Ads
సో, మలయాళ సినిమా అనగానే, మోహన్ లాల్ సినిమా అనగానే పెద్దగా భ్రమలేమీ పెట్టుకోనక్కర్లేదు అనే సత్యం అర్థమై… సరే స్టార్ట్ చేశాం కదా, చివరిదాకా ఓ లుక్కేద్దాం అనుకుంటే మరింత బుక్కయిపోతాం… ఎవరో ఓ మల్లవీరుడు… అదెప్పటి కాలమో తెలియదు… సవాళ్లు ఎదురయ్యే ప్రతి చోటకూ వెళ్తుంటాడు, గెలుస్తుంటాడు, శత్రువులు పెరుగుతూ ఉంటారు… అలా సినిమా చివరిదాకా లాగబడుతూనే ఉంటుంది… మనం కర్సర్‌ను విపరీతంగా లాగదీస్తూ సినిమా వీక్షణం మమ అనిపించినట్టు..!
దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు, అసలు మోహన్ లాల్ ఎందుకు ఈ పాత్ర అంగీకరించాడో సమజ్ కాదు… ఖర్చు బాగానే పెట్టారు కాబట్టి బీజీఎం, సినిమాటోగ్రఫీ వంటివి స్టాండర్డ్‌గానే ఉన్నా అసలు కథలో, కథనంలో సరుకు లేదు… అయినా మోహన్ లాల్ తప్పేమీ లేదు… తన ఎఫర్ట్ లో లోపమేమీ లేదు… అసలే మమ్ముట్టి ఈనడుమ మంచి ప్రయోగాలతో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, నేను వెనుకబడిపోతున్నాను అనుకున్నాడేమో… పీరియాడికల్ సినిమా కదా, మరో మంచి పాత్ర, మాంచి దమ్మున్న దర్శకుడు, బాగానే తీస్తాడులే అనుకున్నట్టున్నాడు… తను బోల్తా, మనమూ బోల్తా… ధైర్యం చేసి మీరు చూడదలిస్తే హాట్ స్టార్‌లో ఉంది… నేనయితే రికమెండ్ చేయడం లేదు… రిస్కీ టాస్క్…
Share this Article