ఒక దేవెగౌడ, ఒక రేవణ్ణ, ఒక ప్రజ్వల్… ఒక కరుణానిధి, ఒక స్టాలిన్, ఒక ఉదయనిధి… ఒక బాల్ ఠాక్రే, ఒక ఉద్దవ్ ఠాక్రే, ఒక ఆదిత్య ఠాక్రే… జస్ట్, ఉదాహరణలు… భారతదేశంలో ఫుల్ రైట్, ఫుల్ లెఫ్ట్ పార్టీలు మినహా ఇక అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కుటుంబ ఆస్తులే… నాలుగో తరంలో ప్రజ్వల్ కొడుకు రెడీ కావల్సిందే… వేరే వాడు రాడు, రానివ్వరు… మన దేశ పార్టీల జన్యులక్షణం అస్సలు అంగీకరించదు…
వాళ్లే… తాతల నుంచి మనమళ్ల దాకా ఆస్తుల వారసత్వం, రాజకీయ వారసత్వం… పరమ దరిద్రమైన పరంపర… పైకి మస్తు నీతులు చెప్పినా సరే, ఆ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలదీ అదే తోవ… తరాలు మారుతున్నా సరే, వాళ్లే వారస యజమానులు అవుతారు… అంతేతప్ప ఇంకెవరికీ ఏదీ దక్కదు… మిగతా నాయకులు, మిగతా కార్యకర్తలకు ఏ హక్కులూ ఉండవు… వాళ్లెప్పుడూ దాసులే, బానిసలే…
ఒక పొలం, ఒక భవనం, ఒక ఫ్యాక్టరీ… అలాగే ఒక పార్టీ… అదొక ఆస్తి… అధ్యక్షపదవులూ వారసత్వమే… అధికారిక పదవులూ వారసత్వమే… ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారనే వార్త చూశాక అనిపించింది ఇదే… హేతువాదం, ప్రజాస్వామికం, సమానత్వం అన్నీ హంబగ్… పైన నేషనల్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి దిగువన డీఎంకే దాకా అన్నీ అంతే…
Ads
సింపుల్, కేసీయార్ తరువాత కేటీయార్… తరువాత హిమాంశు మాత్రమే… కవితకు చోటులేదు… రేప్పొద్దున చంద్రబాబు, లోకేష్‌ల తరువాత దేవాంశే… ఇంకెవరూ రాలేరు… ఎవరైనా వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకుంటే తప్ప..! ఇందులోనూ మగ వారసత్వాలే… సమానత్వాలు మన్నూమశానాలు అని ఎన్ని చెప్పుకున్నా మగాళ్లే వారసులు… వాళ్లు లేకపోతేనే కూతుళ్లు, లేకపోతే మేనల్లుళ్లు…
ఒక శరద్ పవార్‌కు ఒక సుప్రియా సూలే… ఒక మమతకు ఒక అభిషేక్ బెనర్జీ… ఇలా… మిగతావన్నీ సేమ్ షేమ్… శిబూ సోరెన్- హేమంత్ సోరెన్.., ములాయం- అఖిలేష్… లాలూ ప్రసాద్- తేజస్వి యాదవ్… ఫరూఖ్ అబ్దుల్లా- ఒమర్ అబ్దుల్లా… ఉదాహరణలన్నీ అవే… నితిశ్, నవీన్ పట్నాయక్ మాత్రమే కాస్త భిన్నంగా కనిపిస్తున్నారు…
కవితలు, కనిమెళిల కాలం కాదు ఇది… రానివ్వరు… అంతెందుకు..? రాజీవ్ గాంధీ తరువాత రాహుల్ గాంధీ మాత్రమే, ప్రియాంక గాంధిని రానివ్వరు… కుటుంబ వారసత్వాలు, అందులోనూ మగ వారసత్వాలు… ఇవీ మన దేశ రాజకీయ పార్టీల ప్రజాస్వామిక విశాల ఉదార పోకడలు… పైగా మనకు విలువలు, ప్రమాణాలు బోధిస్తాయి ఇవి… అవును, కొడుకులు, మనమళ్లే… పగ్గాలు అందుకున్నా వాళ్లే… పిండాలు పెట్టేదీ వాళ్లే… శుభం…
Share this Article