పోసాని సుధీర్ బాబు… తెలుగు హీరో… బలమైన సినీ కుటుంబ నేపథ్యం ఉన్నా సరే ఈరోజుకూ పాపం ఒక్క హిట్ లేదు… 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్… బోలెడు సినిమాలు… కానీ ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్క సినిమా లేదు… హీరో మహేశ్ బాబుకు బావ, దివంగత హీరో కృష్ణకు చిన్నల్లుడు… అప్పుడే వయస్సు కూడా 46 దాకా వచ్చేసింది…
ఐనా తెలుగు హీరోలకు వయస్సుతో పనేమిటి..? 70 ఏళ్లొచ్చినా పిచ్చి గెంతులు, ఫైట్లు గట్రా చేసేస్తూనే ఉంటారు… అదేదో పాపులర్ జోక్‌లో చెప్పినట్టు… 70 ఏళ్ల ఏజ్‌లో రెండు నోట్ బుక్కులు పట్టుకుని వచ్చి, అప్పటికి ఇరవయ్యో, ముప్ఫయ్యో వయసులో ఉన్న పాత్రధారి ఒడిలో తలపెట్టి… అమ్మా నేను డిగ్రీ పాసయ్యానమ్మా అన్నట్టు…
నిజానికి సుధీర్ బాబును ఒక విషయంలో మెచ్చుకోవచ్చు… కావాలని సోకాల్డ్ మాస్ హీరో ప్రొజెక్షన్ కోసం తాపత్రయపడలేదు… భిన్నమైన పాత్రల్ని ఎంపిక చేసుకుంటాడు… ఫిజిక్ మెయింటెయిన్ చేస్తుంటాడు… తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు… ఆమధ్య చాన్నాళ్ల క్రితం సమ్మోహనం సినిమా కాస్త బెటర్… ఇక ఇతరత్రా సినిమాలన్నీ తనకు న్యాయం చేయలేదు… మరీ రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ఓ పెద్ద డిజాస్టర్… అదేదో నాని సినిమాలో నాన్-హీరో పాత్ర కూడా చేశాడు…
Ads
తన పాత్రల ఎంపిక బాగానే ఉంటుంది… కానీ ఎక్కడో ఉంది నెగటివ్ సుడి… ఒక్కటీ క్లిక్ కావడం లేదు… ఇప్పుడు ఏకంగా మూడు పాత్రలతో మామా మశ్చీంద్ర అనే సినిమా చేశాడు… మూడు రకాల గెటప్పులు వేశాడు… కానీ మళ్లీ దురదృష్టం… కొత్త ట్రెండ్స్ పట్టుకోలేని దర్శకులే దొరుకుతున్నారు తనకు… ఇదీ అంతే… అసలు ఆ మూడు గెటప్పులు సుధీర్‌కు నప్పలేదు,., కనీసం మేకప్ లోపాలను కూడా దర్శకుడు పట్టించుకోలేదు… భాష, డిక్షన్ కూడా అంతే…
తండ్రి క్రూరత్వం, తల్లి మరణం తాలూకు సానుభూతి ఓ ప్రధాన పాత్రపై కలిగేలోగా… ఆ కేరక్టరైజేషన్ భిన్నంగా, విలనీతో కనిపిస్తుంది… కథ కూడా గందరగోళం… ఏ పాత్ర ఏమిటో మనకు అర్థమయ్యే సమయానికి శుభం కార్డు పడుతుంది… ప్రేక్షకుడు తెల్లమొహం వేసుకుని థియేటర్ నుంచి బయటికి రావడమే… చివరకు సినిమాలోని లవ్ మ్యాటర్ కూడా అయోమయమే… కథ, కథనాలు సంక్లిష్టంగా ఉండటంతో సినిమా ఎక్కడా ప్రేక్షకుడికి రుచించలేదు…
నిజానికి కథాబలం ఉన్న సినిమాలకు ఇలాంటి హీరోలే ప్రాణం… ఇమేజ్ బిల్డప్పులు, రొటీన్ మాస్ మసాలా పోకడలకు దూరంగా సినిమాల్ని చేయడానికి సుధీర్ బాబు రెడీ… ఎటొచ్చీ అలాంటి కథలు, వాటిని రక్తికట్టించే దర్శకులే తనకు దొరకడం లేదు… అదే తన కెరీర్ ట్రాజెడీ… పుష్కరకాలం దాటినా తను ఓ మంచి హీరోగా రిజిష్టర్ కావడం లేదంటే… చెబుతూ పోతే అదే ఓ సినిమా కథ అవుతుందేమో…!! మహేశూ… కాస్త మీ బావను పట్టించుకో, అలా వదిలేశావేమిటీ…
Share this Article