ఫాఫం మమతా బెనర్జీ… ఆ ప్రశాంత్ కిషోర్‌ను నమ్ముకుని, తనెలా చెబితే అలా ఆడుతోంది… ‘బీజేపీ వాళ్లు వస్తుంటారు, పోతుంటారు, నేను లోకల్’ అని చంటిగాడి డైలాగులు కొట్టింది.., వర్కవుట్ కాలేదు… ‘నేను పొద్దునే చండీపాఠం చదవనిదే ఇల్లు కదలను, నేను బ్రాహ్మణ మహిళను’ అంటూ హఠాత్తుగా హిందుత్వ పాఠం మొదలుపెట్టి బీజేపీ పైకి అదే కులాస్త్రం, మతాస్త్రం సంధించింది… అదీ వర్కవుట్ కాలేదు… ‘నా కాలు విరిచేశార్రా దేవుడోయ్’ అంటూ చక్రాల కుర్చీ ఎక్కి తిరుగుతోంది… సీపీఎం, బీజేపీ వాళ్లను చావగొట్టి, ఇరగ్గొట్టి, గల్లీగల్లీలో రౌడీగిరీ చేసేదే ఆమె పార్టీ లీడర్లు కదా, జనం ఈ ఏడుపులనూ పెద్దగా నమ్మడం లేదు… ఇక ఇప్పుడు ఏం డౌట్ వచ్చిందో ఏమో… తన పాత నినాదం ‘మా, మాతి, మానుష్ (జనని, జన్మభూమి, ప్రజలు…)’ వదిలేసి, ‘నా గోత్రం శాండిల్య తెలుసా’ అని ఎన్నికల ప్రచారాల్లో గోత్రనామాలు, ప్రవర వినిపిస్తోంది తాజాగా… తప్పదు, ఎన్నికలొస్తే అందరూ భయంకరమైన హిందువులే అవుతుంటారు అకస్మాత్తుగా…! ఫస్ట్ ఫేజ్ పోలింగు మీద ఏం అంచనాలు వేసుకున్నదో ఏమో గానీ… దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నేతలకు లేఖలు రాసింది… నేనొక్కతినే ఈ యుద్ధం చేయలేను, ఈ బీజేపీ దుర్మార్గాల మీద అందరమూ కలిసి కొట్లాడదాం, కలిసి రండి అనేది ఆ లేఖల సారాంశం…
Mamata Banerjee writes to leaders incl Sonia Gandhi, Sharad Pawar, MK Stalin, Tejashwi Yadav, Uddhav Thackeray, Arvind Kejriwal, Naveen Patnaik stating, "I strongly believe that the time has come for a united & effective struggle against BJP's attacks on democracy & Constitution" pic.twitter.com/OLp7tDm9pU
— ANI (@ANI) March 31, 2021
సెకండ్ ఫేజ్ పోలింగ్ అయ్యాక ఇంకేం కథలు పడుతుందో చూడాలి… కానీ ఆమె ప్రతిపక్షాలకు రాసిన లేఖలు కాస్త ఇంట్రస్టింగు… ఇందులోనూ ఆమె ఓ తప్పు చేసినట్టు కనిపిస్తోంది… అదెలాగంటే..? ఏడాది క్రితం ఎన్ఆర్సీ, సీఏఏ మీద సోనియా ప్రతిపక్షాల మీటింగు పెడితే ఇదే మమత డుమ్మా కొట్టింది… ఇప్పుడు ఆమెకు ప్రతిపక్షాల ఐక్యత కావల్సి వచ్చింది… పైగా ఆమె లేఖలు రాసినవాళ్లలో సీపీఎం, సీపీఐ నేతలు లేరు… ఎందుకంటే..? అక్కడ ఆమెతో పోరాడుతున్నవి కదా అవి… కానీ లెఫ్ట్ కూటమిలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ ప్రతిపక్ష కూటమిలోకి వచ్చి చేరాలట… సీపీఐ, సీపీఎం వద్దు, సీపీఐఎంఎల్ కలిసి రావాలట… పైగా ఆ లేఖలో ఏం చేద్దామో లేదు, బీజేపీ నీచ్, నికృష్ట్, భయంకర్, పిశాచ్ అంటూ తిట్టడమే తప్ప… తన ప్రతిపాదిత కార్యాచరణ ఏమిటో చెప్పాలి కదా… ఈమె లేఖలు రాయగానే అందరూ కట్టగట్టుకుని వెళ్లి బెంగాల్ ఊళ్లల్లో మైకులు పట్టుకోరు కదా…
Ads
ఆమె లేఖలు రాసిన జాబితాలో మాయావతి లేదు… ఎస్పీ అఖిలేషుడు, ఆర్జేడీ తేజస్వి యాదవుడు రావాలి గానీ మాయావతి వద్దా..? నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ మెహబూబా ముఫ్తిలకన్నా మాయావతి తీసిపోయిందా..? పోనీ, మాయావతి బీజేపీ మీద రాజీలేని పోరాటం చేయలేదు అనేది మమత ఉద్దేశం అనుకుందాం.., మరి ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కే.చంద్రశేఖరరావు, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి బీజేపీ మీద ఫరమ్ ఫైటింగుకు సిద్ధంగా ఉన్నారా..? లేదు కదా..! డీఎంకే స్టాలిన్, కాంగ్రెస్ సోనియా, ఢిల్లీ ఆప్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ శరద్ పవార్, మహారాష్ట్ర శివసేన సీఎం ఉద్దవ్ ఠాక్రేలు సరే… కానీ ప్రధానంగా ఇందులో కనిపిస్తున్న వ్యూహరాహిత్యం… చంద్రబాబును కాన్ఫిడెన్సులోకి తీసుకోకపోవడం… ఏ వార్తలోనూ ఆమె చంద్రబాబుకు కూడా లేఖ రాసినట్టు కనిపించలేదు…
ఇప్పుడున్న స్థితిలో చంద్రబాబు బీజేపీ మీద పల్లెత్తు మాట కూడా అనే స్థితిలో లేడు, ఆయనకు లేఖ రాయడం కూడా దండుగ అని మమత భావించి ఉండవచ్చుగాక… కానీ నిజానికి దేశంలోని అన్ని పార్టీల నేతలనూ ఆర్గనైజ్ చేయగల కెపాసిటీ చంద్రబాబుకే ఉంది… తన సీనియారిటీ, అందరితోనూ ఉన్న పాత సంబంధాలు, వ్యవహారజ్ఞానం, లౌక్యం వంటి కోణాల్లో చంద్రబాబు చాలా బెటర్… కానీ మరీ మర్యాదకు కూడా బాబుకు లేఖ రాయలేదు మమత… ఇలా తనను ఓ వట్టిపోయిన గోవులా పక్కన పెట్టేయడం విశేషంగా అనిపిస్తోంది… ఫాఫం, మనవి కాని రోజులొస్తే చివరకు మమతకు కూడా అలుసైపోతామంటే ఇదే కాబోలు… ఐనా ఇదెంతకాలంలే… ఈ పోలింగు ముగియనివ్వండి, వీళ్లలో ఆమె ఎవ్వరినీ మళ్లీ దేకదు… ఆమె టెంపర్‌మెంటు ఎదుట వీళ్లెవరూ ఆనరు… ఆడపులి… కాకపోతే ఆత్మరక్షణలో పడి ఆ బెంగాల్ అడవుల్లో అటూఇటూ పరుగులు తీస్తున్నది…!!
Share this Article