.
Subramanyam Dogiparthi ….. చాలా చక్కటి ఫేమిలీ ఓరియెంటెడ్ ఎమోషనల్ సినిమా 1989 లో వచ్చిన ఈ మమతల కోవెల . సంతోషం ఏమిటంటే ఈ సినిమా దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దీనిని విషాదాంతం చేయకుండా శుభాంతం చేయటం .
ప్రేక్షకులు వినోదం కోసమో , కాసేపు కష్టాలు మరచిపోయేందుకో , గర్ల్ ఫ్రెండుతో/బాయ్ ఫ్రెండుతో టైం స్పెండింగుకో సినిమా హాలుకు వస్తారు . మరీ తప్పకపోతే విషాదాంతం చేయొచ్చు యన్టీఆర్ , సావిత్రి రక్తసంబంధం సినిమా లాగా . ఉత్త పుణ్యానికి బాలచందర్ లాగా విషాదాంతాలు చేయకూడదు .
Ads
ప్రేక్షకులు హాయిగా , ఆహ్లాదంగా థియేటర్లో నుంచి బయటకు రావాలి . ఈ సినిమాలో ఆ ఆహ్లాదం చివరకు కలుగుతుంది .
కృష్ణచిత్ర బేనర్లో వచ్చిన ఈ సినిమా కధను నేసింది సినిమా యూనిట్టే అని వేసారు టైటిల్సులో . ఎవరు నేసినా చక్కగా నేసారు . 1970s దాకా ఫేమిలీ ఓరియెంటెడ్ సినిమాలు బాగానే వచ్చేవి . 1980s లో క్రైం , ఏక్షన్ , రివెంజ్ సినిమాల తాకిడి ఎక్కువయి ఫేమిలీ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గిపోయాయి . ఆ పీరియడ్లో ఇలాంటి ఎమోషనల్ , సెంటిమెంటల్ సినిమా తీయడం కాస్త సాహసమే .
కధ టూకీగా ఏంటంటే ..: తన తండి సంపాదన , స్టేటస్ , క్రమశిక్షణలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడనే కారణంతో రాజశేఖర్ తండ్రి జగ్గయ్యకు దూరదూరంగా ఉంటాడు . రాజశేఖరుకు శృతిమించిన ఆత్మాభిమానం , ఆత్మ విశ్వాసం . తండ్రికి P.A గా చేరిన మరో అతి ఆత్మాభిమాని సుహాసినిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళి స్వంత కాపురం పెట్టుకుంటాడు .
కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని ఆనందంగా ఉంటున్న సమయంలో భార్యకు ప్రమాదకరమైన గుండె జబ్బు వస్తుంది . దానికి ఆపరేషన్ అమెరికాకు వెళ్ళాలని డాక్టర్లు చెపుతారు . తండ్రి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు . స్నేహితులు ఎవరూ సాయం చేయరు . ఆ సమయంలో తమ్ముడు శుభలేఖ సుధాకర్ అన్నని ఒప్పించి వదినను , ఇద్దరు పిల్లలను తీసుకుని అమెరికా వెళతాడు .
ఇండియాలో ఉండిపోయిన రాజశేఖర్ని తోటి ఉద్యోగి రెచ్చకొడతాడు . ఊరకూరకే కోపం , ఆవేశం తెచ్చుకునే రాజశేఖర్ అతనితో ఘర్షణకు దిగుతాడు . ఘర్షణలో తోటి ఉద్యోగి చనిపోవటంతో అరెస్ట్ అవుతాడు . అమెరికాలో ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది . ఎలాంటి ఆవేశం , ఉద్రిక్తత కలగకుండా చూసుకోవాలని డాక్టర్లు చెపుతారు .
సుహాసినికి హత్య విషయం తెలియకుండా అందరూ జాగ్రత్త పడతారు . ప్రత్యేక అనుమతితో రాజశేఖర్ రోజూ ఇంటికి వచ్చేలా అనుమతి సంపాదిస్తారు . చివర్లో సుహాసినికి అసలు విషయం తెలుస్తుంది . అదృష్టవశాత్తూ కోర్ట్ నేరారోపణ నుంచి విడుదల చేస్తుంది . అందరూ గ్రూప్ ఫొటో తీయించుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .
మంచి కధకు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చిక్కటి స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . నటీనటులు అందరూ బాగా నటించారు . రాజశేఖర్ , సుహాసిని ఇద్దరూ బాగా నటించారు . వాస్తవానికి ఈ సినిమాలో హీరో కధే . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , శుభలేఖ సుధాకర్ , సుప్రియ , సుత్తి వేలు , శ్రీలక్ష్మి , చిట్టిబాబు , రాళ్ళపల్లి , హరిబాబు తదితరులు నటించారు .
చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు చక్రవర్తి . ముఖ్యంగా తెలియని రాగం కలిపింది తీయని భావనదే అనే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయికి , చుక్కు బుక్కు రైలు బండి కూసింది , ఇదే ఇదే నేనడిగింది అంటూ సాగుతాయి మిగిలిన పాటలు . అన్నీ బాగుంటాయి .
సి నారాయణరెడ్డి , జాలాది , వెన్నెలకంటి వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , వందేమాతరం శ్రీనివాస్ , లలితాసాగరి , రమణ పాడారు . డైలాగులను యం వి యస్ హరనాధరావు వ్రాసారు . బాగా వ్రాసారు .
సినిమా యూట్యూబులో ఉంది . ఫేమిలీ ఓరియెంటెడ్ , ఎమోషనల్ , ఓల్డ్ మోడల్ అంబాసిడర్ కార్లను నచ్చేవారికి ఈ సినిమా బాగుంటుంది . సుహాసిని చక్కని హాసినిగా అలరిస్తుంది . రాజశేఖర్ శాకాహార సినిమాలకు కూడా పనికొస్తాడని రుజువు చేస్తుందీ సినిమా . చూడతగ్గ సినిమాయే . స్లోగా పాసెంజర్ బండి లాగా సాగుతుంది .
నేను పరిచయం చేస్తున్న 1217 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article