అసలు ఎవడండీ ఈ మమ్ముట్టి..? తను హీరోయేనా..? హీరో లక్షణాలున్నాయా..? ఇన్నేళ్లుగా ఓ టాప్ స్టార్‌గా ఎలా కంటిన్యూ అవుతున్నాడసలు..? ప్చ్, ఇలాంటోళ్లతో ఈ సినిమా లోకం ఏమైపోతుందో అర్థం కావడం లేదు… ము- కిందికి 72 ఏళ్లు వచ్చినయ్… ఇప్పటికీ అదేదో నటన అంటాడు, వైవిధ్యమైన పాత్రలు అంటాడు… దిక్కుమాలిన సంత, కొన్ని సినిమాలైతే తనే నిర్మిస్తున్నాడు… తన ప్రయోగాలతో ఎవరూ చేతులు కాల్చుకోకూడదట, రిస్క్ తీసుకోవద్దట…
అరె, కొడుకు దుల్కర్ కూడా మాంచి డిమాండ్ ఉన్న హీరో అయిపోయాడు, ఇక మమ్ముట్టి కూడా సగటు సౌత్ ఇండియన్ టాప్ స్టార్ విలువ తగ్గకుండా, ఎక్కడా కాంప్రమైజ్ గాకుండా… ఏ మనవరాలు వయస్సున్న అమ్మాయినో పక్కన పెట్టేసుకుని నాలుగు పిచ్చి స్టెప్పులు, మరో నాలుగు తలతిక్క ఫైట్లు చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా… భిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు అంటూ అర్థం కాని మాటలు, చేష్టలూనూ…
ఈమధ్య కాథల్ అనే ఓ సినిమా చేశాడు… అమెజాన్‌లో ఉంది లెండి, తెలుగులో కూడా… ఈ సినిమాను ఎవరైనా మామూలు చిన్న తెలుగు హీరోకు చూపించినా సరే… అ శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రిని ఉద్దేశించి అదేదో పాత్ర అంటుంది కదా… వీడి పాటలే కాదు, వీడి మాటలూ అర్థం కావు అని… అచ్చం అలాగే కామెంట్ చేస్తారేమో… ‘‘హేమిటో, వీడి సినిమాలే కాదు, వీడి నటనా అర్థం కాదు’’ అని…
Ads
అరె, ఏమిటండీ ఇది… హీరోకు ఓ ఇంట్రడక్షన్ సాంగ్ లేదు, కీర్తనల్లేవు, ఎక్కడా ఐటమ్ సాంగ్ లేదు, పంచ్ డైలాగులు లేవు, రౌడీల నరికివేత లేదు… రొచ్చు రొమాన్స్ కూడా లేదు… కనీసం ఓ మాస్ మసాలా సాంగ్ వేసుకుని ‘కుర్చీ మడతపెట్టీ’ అంటూ అరుపులు కూడా లేవు… బీభత్సమైన బీజీఎం కూడా లేదు… అసలు ఎందుకు తీస్తారండీ ఇలాంటి సినిమాలు… అసలు ఆ కథకు మనవాళ్లయితే ఎంతటి ‘రసపట్టు’దల ప్రదర్శించేవాళ్లో…
అదేదో గే పాత్ర… అనగా ఓ స్వలింగ సంపర్కి… పెళ్లయిన 20 ఏళ్లకు విడాకుల కేసు… అదే కథ, అదే చర్చ… హీరో పేరు మాథ్యూ… సినిమా మొత్తం మాథ్యూలాగే కనిపిస్తాడు మమ్ముట్టి… కానీ ఒక్క సీన్‌లోనూ ఓ సూపర్ స్టార్ కనిపించడు… ఇదేం ధోరణి అండీ… హీరో అంటే ఎలివేషన్స్ కుమ్మేయాలి… మెగాసూపర్‌సుప్రీంబర్నింగ్‌బంపర్ స్టార్ అనిపించుకోవాలి… తుప్పుపట్టిన కథలతో, కత్తులతో వెండితెర నిండా నెత్తురు వరదలై పొంగాలి, వాగులై పారాలి… సినిమా ప్రేక్షకుల బుర్రల్ని తుకడా తుకడా చేసేయాలి… భిన్నమైన పాత్రలు అంటూ ఏడవడం ఆ అమితాబ్‌కంటే నడిచింది గానీ, ఆఫ్టరాల్ ఓ మలయాళ హీరోకు ఈ బుర్రతిరుగుడు ఆలోచనధోరణి ఏమిటండీ…
ఈయనకు తగ్గట్టు ఆ జ్యోతిక… సూర్య వంటి సూపర్ స్టార్ పెళ్లి చేసుకున్నాడు, ఎంచక్కా సంసారం చేసుకోక, ఈరోజుకూ గుండెలో తడిని తడిమేసే పాత్రల ఎంపిక దేనికండీ ఆమెకు..? ఇలాంటి హీరోయిన్‌ను తోడు తెచ్చుకుని, సగటు స్టార్ సినిమాలో ఉండాల్సిన డ్యుయెట్లు, అలుముకోవడాలు, ఆరబోతలు, మూలుగులు, నిట్టూర్పులు ఏమీ లేని సీన్లను నడిపించాడు… అబ్బే, మన నడుం వంగిన వెటరన్ హీరోల సినిమాలైనా చూసి కాస్త నేర్చుకోవచ్చు కదా ఈ మమ్ముట్టి…
మన తెలుగు వెటరన్స్ మహా ముదుర్లు… ఈరోజుకూ మడత నలగని హీరోలు… పగలు, ప్రతీకారాలు, మిషన్ గన్లు, బీభత్సమైన పోరాటాలు, వెగటురసం ఒలికిస్తూ రొమాన్సులు… ఒక్కడు… కనీసం ఒక్కడు… ఒక్క తెలుగు వెటరన్ హీరో అయినా సరే, కాథల్‌లో మమ్ముట్టి వేసిన మాథ్యూ పాత్రను వేయమనండి… చస్తే వేయరు… వాళ్లు తమ ఫ్యాన్స్ స్థాయి నుంచి అస్సలు దిగజారిపోరు… మనకు తెలుసు, మమ్ముట్టి పాత స్వాతికిరణం దగ్గర్నుంచి ఆమధ్య వచ్చిన యాత్ర దాకా… మమ్ముట్టి అంటేనే నటనకు ఓ స్కూల్… అస్సలు కమర్షియల్ మాస్ మసాలా వాసనలే ఉండవు… అబ్బే, ఏం హీరో అండీ తను…
అసలు మమ్ముట్టిని కాదు, తనను నెత్తిన మోసిన మలయాళ ప్రేక్షకులను అనాలి… అరె, ఒక రజినీకాంత్, ఒక కమల్‌హాసన్, ఒక చిరంజీవి, ఒక వెంకటేశ్, ఒక నాగార్జున, ఒక బాలకృష్ణ, ఒక మోహన్‌బాబు… ఒక్క వెటరన్ తెలుగు హీరో అయినా ఇలా మాథ్యూ వంటి పాత్రలు వేసి దిగజారారా..? వైవిధ్యం, పాత్రోచిత నటన అని పిచ్చి కూతలు కూశారా..? నెవ్వర్… మరి ఈ మమ్ముట్టికి ఎందుకీ భిన్న ధోరణి… పైగా 408 సినిమాలు చేశానంటాడు…
ఏటా పదీపన్నెండు సినిమాలు చేసిన కాలం కూడా ఉందట… అదేదో కాంతార టైప్ సినిమా అనగానే భ్రమయుగం అని కొత్త సినిమా ఒప్పేసుకున్నాడు… అదేదో పాతకాలం నాటి జానపదం అట… ఆయనకు ఎందుకండీ ఇప్పుడీ ప్రయోగాలు..? ఛిచీ… ఏం మనిషో, ఏం హీరోనో… మా తెలుగు వెటరన్స్ ఇజ్జత్ తీస్తున్నావు కదయ్యా… పైగా మూడు జాతీయ అవార్డులు… ఛిఛీ, ముందుగా ఈ మలయాళ ప్రేక్షకుల అభిరుచిని అర్జెంటుగా మార్చేయాలి, లేకపోతే ఇలాంటి హీరోలు మారరు, మన సౌత్ సినిమా పరువూ నిలబడదు..!!
Share this Article