Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మల్లు అర్జున్..! మలయాళంలో తన సక్సెస్ వెనుక ఓ గొంతు..!

December 9, 2024 by M S R

.

అల్లు అర్జున్‌ నటన.. జిస్ జాయ్ గాత్రం.. కలిపితే ‘పుష్ప’ 

(కేరళలో అల్లు అర్జున్‌కి ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. ఆయన్ని పేరును వాళ్లు ఏకంగా ‘మల్లు అర్జున్’ అని మార్చుకున్నారు. కేరళవాళ్లకు అల్లు అర్జున్ అనగానే గుర్తొచ్చే మరో పేరు జిస్ జాయ్ (Jis Joy). అల్లు అర్జున్‌కి మలయాళంలో గాత్రదానం చేసే వ్యక్తి ఆయన.

Ads

ఒక్కటి తప్ప దాదాపు అన్ని సినిమాలకూ జిస్ జాయే డబ్బింగ్ చెప్పారు. అల్లు అర్జున్-జిస్ జాయ్ కాంబినేషన్ కేరళలో చాలా ప్రఖ్యాతి పొందింది. అల్లు అర్జున్‌తోపాటు ప్రభాస్, రవితేజలకు కూడా జిస్ జాయ్ మలయాళంలో డబ్బింగ్ చెప్పడం విశేషం. పలు మలయాళ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పిన విషయాలు ఇవి).

* అల్లు అర్జున్‌ని మలయాళ రంగానికి పరిచయం చేసిన వ్యక్తి ‘ఖాదర్ హాసన్’. ఆయన సహాయ దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఆయన హైదరాబాదులో ‘ఆర్య’ సినిమా చూసి, ఆయనకు నచ్చి ఆయనే ఆ సినిమాను మలయాళంలోకి తేవాలని అనుకున్నారు. అల్లు అర్జున్ అనే పేరును ‘మల్లు’ అర్జున్ అని మార్చింది కూడా ఆయనే. అల్లు అర్జున్ మలయాళ సినిమా జర్నీలో ‘ఖాదర్ హాసన్’ చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పుకోవాలి.

* నేను అప్పటికే చాలా సీరియళ్లకు డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. ఒక తెలుగు హీరోకి డబ్బింగ్ చెప్పాలని నన్ను పిలిచారు. ఎవరా అని కనుక్కుంటే ‘అల్లు అర్జున్’ అన్నారు. అప్పటికి మలయాళానికి అల్లు అర్జున్ కొత్త. కానీ ఆయనలో ఏదో ఈజ్ ఉందన్న విషయం డబ్బింగ్ చెప్తున్నప్పుడే గుర్తించాను. ముఖ్యంగా పాటల్లో ఆయన అభినయం చాలా కొత్తగా అనిపించింది.

* ఖాదర్ హాసన్ నాకన్నా ముందు మరో ముగ్గుర్ని అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పేందుకు పిలిచారు. కానీ వాళ్లెవరి గాత్రంతోనూ ఆయన తృప్తిగా లేరు. నా చేత కూడా డబ్బింగ్ చెప్పించారు. కానీ ఆయన ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఒక్కో సీన్ నాలుగు, ఐదు, ఆరు టేకులు తీసుకున్నా కూడా ఆయనకు నచ్చలేదు. ఒక్క రోజులో కేవలం రెండే రెండు సీన్లు చెప్పానంటే ఆయన ఎన్ని టేకులు అడిగారో అర్థం చేసుకోవచ్చు.

* అన్నిసార్లు నా చేత రీటేక్‌లు చేయించడం చూసి నాకు చాలా డిప్రెసివ్‌గా అనిపించింది. నేను 2000 నుంచి డబ్బింగ్ చెప్తున్నాను. ఇన్నేళ్ల నా కెరీర్ అంతా రాని సమస్య ఇప్పుడు వచ్చింది అనుకున్నాను. మా అమ్మకు ఫోన్ చేసి ‘వీళ్లు చేసేది చూస్తుంటే నేను డబ్బింగ్ చెప్పడం పూర్తిగా మర్చిపోతానేమో అనిపిస్తోంది’ అన్నాను. ఖాదర్ హాసన్ నన్ను కష్టపెట్టలేదు. కానీ నేను చేసే పని ఆయనకు నచ్చడం లేదు.

* ‘ఆర్య’ సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఇక నా వల్ల కాదేమో అనిపించింది. డైలాగులు రాసిన సతీష్, రికార్డిస్ట్ శ్రీజిత్ స్టూడియోలో ఉన్నారు. ‘వెళ్లి.. కాఫీ తాగిరాపో’ అన్నారు. కాఫీ తాగి వచ్చాక వాళ్లు నన్ను కూర్బోబెట్టి మాట్లాడారు. ముగ్గురు అయిపోయిన తర్వాత నాలుగో వ్యక్తిగా నేను వచ్చానన్నారు. ఎవరి గాత్రం కూడా సరిగా సూట్ కావడం లేదన్నారు. నేను కూడా వెళ్లిపోతే ఇంకెవర్ని తీసుకురావాలో తెలియటం లేదని వారు చెప్పారు.

* వాళ్ల మాటలు విన్న తర్వాత నేనొక ఐడియా చెప్పాను. ‘నేను ఏడేళ్ల నుంచి డబ్బింగ్ చెప్తున్నాను. కాబట్టి ఈ సినిమాకు ఎలా డబ్బింగ్ చెప్పాలో నాకొక అవగాహన ఉంది. కాబట్టి ఇలా ఒకటి, రెండు సీన్లు కాకుండా మొత్తం సినిమాకు డబ్బింగ్ చెప్తాను. ఆ తర్వాత మీకు నచ్చితే అది వాడుకోండి. లేదా మరొకర్ని పిలుచుకోండి’ అన్నాను. వాళ్లు ఒప్పుకున్నాక మొత్తం సినిమా డబ్బింగ్ చెప్పాను. వాళ్లకు నచ్చిందా, లేదా తెలియదు. కానీ మరో దారి లేక నా డబ్బింగ్‌ని ఒప్పుకున్నారు.

* 2007 నుంచి అల్లు అర్జున్‌కి నేనే డబ్బింగ్ చెప్తున్నాను. ‘ఆర్య’ సినిమాకు తొలిసారి మలయాళంలో డబ్బింగ్ చెప్పాను. చాలామంది మలయాళీలు అల్లు అర్జున్ మొదటి సినిమా ‘ఆర్య’ అనే అనుకుంటారు. ఎందుకంటే మలయాళంలో డబ్ చేసిన తొలి సినిమా అదే. అంతకుముందు ఆయన ‘గంగోత్రి’ సినిమా చేశారన్న విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. ‘ఆర్య’ సినిమా విడుదలైన చాలా రోజులకు ‘గంగోత్రి’ సినిమాను మలయాళంలో ‘సింహకుట్టీ’ అనే పేరు డబ్ చేశారు.

* నేను అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఇద్దరం దాదాపు ఒకే వయసులో ఉన్నాం. కాలం గడుస్తుండగా ఇద్దరం వయసు పెరిగాం. ఆయన నటనతోపాటు నా వాయిస్ కూడా మరికొంత గంభీరంగా మారింది. పైగా అల్లు అర్జున్ తెలుగులో చెప్పే డైలాగుల్ని మలయాళ నేటివిటీకి తగ్గట్లు మార్చడంలోనూ ఆ పరిణితి పెరిగింది.

* ఇప్పటిదాకా అల్లు అర్జున్ సినిమాలకు మలయాళంలో నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ ఒకే ఒక్కసారి మాత్రం మరొకరు డబ్బింగ్ చెప్పారు. మలయాళంలో చాలా పెద్ద నిర్మాత ఒకరు. ఆయన టీం నుంచి అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పాలని పిలుపు వచ్చింది. అయితే వాళ్ల మాటల్లో ఏదో తేడా కనిపించింది. ‘నువ్వు లేకపోతే మా సినిమా జరగదనుకున్నావా? నీలా డబ్బింగ్ చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. గుర్తుంచుకో’ అని అర్థం వచ్చేలా వాళ్లు మాట్లాడారు.

* వాళ్ల మాటలతో నేను చాలా హర్ట్ అయ్యాను. కానీ హైదరాబాద్‌లో ఉండే అల్లు అర్జున్‌కి నేను, నా వాయిస్ తెలుసు. కాబట్టి ఆయన నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకుంటారు. కాబట్టి ఆ తర్వాత వాళ్లు నన్ను మళ్లీ డబ్బింగ్ కోసం పిలిచారు. కానీ నేను ఒప్పుకోలేదు. ‘నాకు అల్లు అర్జున్ లేదా ఆయన తమ్ముడు, లేదా వాళ్ల మేనేజర్.. ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తే నేను డబ్బింగ్‌కి వస్తాను’ అన్నాను. చివరకు ఆ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పలేదు. మరెవరో చెప్పారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

* డబ్బింగ్ వేరు, మిమిక్రీ వేరు. ఇప్పుడు చాలామంది మలయాళంలో అల్లు అర్జున్‌ని ఇమిటేట్ చేస్తున్నారు. వాళ్లు చేసేది నా గొంతే. అయితే వాళ్లు ఒకటి, రెండు డైలాగులు చెప్పగలరు తప్ప, మొత్తం సినిమా నాలా డబ్బింగ్ చెప్పలేరు. ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఆ ‌సినిమాలో చేసిన పాత్ర, అతని బాడీ లాంగ్వేజ్‌ని బట్టి డైలాగులు చెప్తాను. ఇమిటేట్ చేసేవాళ్లు కేవలం అతని గొంతు మీద దృష్టి పెడతారు. అదే తేడా.

* కొందరు నటీనటులు ఒక రకమైన గొంతుతో మనకు తెరమీద కనిపిస్తూ అలవాటు అవుతారు. ఆ గొంతు మారిస్తే, వారు ఎంత బాగా నటించినా మనం చూడలేం. ఒక ఉదాహరణ చెప్తాను. మమ్ముట్టి, మోహన్‌లాల్.. ఇద్దరూ గొప్పనటులు. వారిద్దరికీ మంచి వాయిస్ ఉంది. ఏదైనా ఒక సినిమాలో మమ్ముట్టి ముఖానికి మోహన్‌లాల్‌ని ఊహించుకోండి. కుదురుతుందా? నటన అంటే శరీరంతోపాటు గాత్రం కూడా. అందుకే డబ్బింగ్ ఆర్టిస్టుల పని కేవలం డైలాగులు చెప్పడం మాత్రమే కాదు, ఆ నటుడి నటనను మరింతగా పెంచడం.

* నేను, అల్లు అర్జున్ చాలా క్లోజ్ అని అంతా అనుకుంటారు. నిజం చెప్పాలంటే అలా ఏమీ లేదు. నా దగ్గర ఆయన నెంబర్ ఉంది. ఒకటి, రెండుసార్లు ఆయనకు బర్త్‌డే విషెస్ మెసేజ్ చేశాను. అంతే! అంతకుమించి ఆయనతో నాకు పెద్ద సంభాషణలేవీ జరగలేదు. సినిమాకు డబ్బింగ్ చెప్పిన తర్వాత నా పని నాదే. నేను ఏ నటుడితోనూ అంత కనెక్ట్ కాలేదు. నేను నా పని చేశాను. నాకు రెమ్యునరేషన్ దక్కింది. అది చాలు.

* నా గొంతు వింటే అల్లు అర్జున్ మాత్రమే గుర్తొస్తారు. అయితే పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన తమిళ సినిమాలు మలయాళంలోకి డబ్ చేసినప్పుడు ఆయనకు నేనే డబ్బింగ్ చెప్పాను. అంతేకాదు, ‘ఛత్రపతి’, ‘మున్నా’ (ప్రభాస్), ‘దుబాయ్ శ్రీను’ (రవితేజ)కు మలయాళంలో డబ్బింగ్ చెప్పాను.

* నేను ఒకప్పుడు జీవితం పట్ల ఇన్‌సెక్యూర్డ్‌గా ఉన్నాను.. అయితే ఎప్పుడైతే నాలో జీవితంపై స్పష్టత వచ్చిందో అప్పట్నుంచీ నేను అలా ఫీలవడం మానేశాను. నాకు దొరికే కొంచెం డబ్బైనా సరే, అది నాదే. దాన్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుని, దాచుకోవడంలోనే నా ప్రతిభ ఉంటుందని అర్థమైంది. ఆ రోజు నుంచి నేను భయపడటం మానేశాను.

* నేను డబ్బింగ్ మాత్రమే చెప్తూ బతికేస్తున్నానని చాలామంది అనుకుంటారు. కానీ నేను డైరెక్టర్ అన్న విషయం బయట చాలామందికి తెలియదు. 2013లోనే ‘Bicycle Thieves’ అనే మలయాళ కామెడీ సినిమాకు దర్శకత్వం వహించాను. తెలుగులో చాలా పెద్ద హిట్ అయిన ‘పెళ్లిచూపులు’ సినిమాను మలయాళంలో ‘విజయ్ సూపరుమ్ పౌర్ణమియుం’ పేరుతో రీమేక్ చేశాను. మొత్తం ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. రెండు సినిమాలకు పాటలు రాశాను.
***
సేకరణ, మలయాళ అనువాదం: విశీ (వి.సాయివంశీ) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions