అసలు దర్శకుడు మారుతి అంటేనే మొదటి నుంచీ వెగటు… అడల్ట్ కామెడీ సినిమాలు తీసేవాడు మొదట్లో… సరే, తన టేస్టు అదే అనుకుని ప్రేక్షకులు కూడా ఫోరాభయ్ అని తేలికగా తీసుకున్నారు… తరువాత ట్రాక్ మార్చాడు… ఏదో ఓసీడీ అని, మతిమరుపు అని కొత్త కాన్సెప్టులు తీసుకుని కథలల్లాడు… ఏవో సినిమాలు తీశాడు, పర్లేదు, మారుతి మారాడురోయ్ అనుకున్నారు ప్రేక్షకులు… కానీ తనలో పెద్ద మెచ్చుకోదగిన క్రియేటివిటీ, మన్నూమశానం ఏమీ లేదనే సందేహం అలాగే ఉండిపోయింది… దానికి తగ్గట్టే మరోసారి తనలోని ఓ పచ్చి, పిచ్చి దర్శకుడిని నిర్లజ్జగా ఆవిష్కరించుకున్నాడు ఇప్పుడు… మంచిరోజులు వచ్చాయి అనే సినిమాతో…
లేకపోతే ఏమిటి భయ్యా… ఐదారు జబర్దస్త్ స్కిట్లను ఒక్క దారంలో కుట్టేసి, ఓ మాల కట్టేసి, తెలుగు ప్రేక్షకులు ఎలాగూ పిచ్చి ఎదవలనే ప్రగాఢ నమ్మకంతోనే కదా… విడుదల చేసింది..? ఓ మంచి కథ, ఓ మంచి ఎమోషన్, ఆ కథలో భాగంగా పాత్రలు కామెడీ చేస్తే వోకే… బాగుంటుంది… కానీ కామెడీ స్కిట్లనే కలిపేసి, కుట్టేసి, గుదిగుచ్చేసి, మీ ఖర్మరా భయ్, చూస్తే చూడండి లేకపోతే మీ ఇష్టం అన్నట్టుగా విడుదల చేస్తే ఏమనాలి..? దాన్నే మారుతి మార్క్ సినిమా అనాలి… ఫాఫం, ఆ హీరో ఎవరో గానీ… సంతోష్ శోభన్ అని ఏదో పేరు వేశారు… పర్లేదు… ఆ హీరోయిన్… విపరీతంగా బరువు తగ్గి, మొహంలో కళాకాంతులు కోల్పోయి, దేభ్యం మొహం వేసుకుని నానా హింసా పెట్టింది ప్రేక్షకుల్ని…
Ads
అసలు వీళ్లతో పనికాదు అనుకున్న దర్శకుడు కథను అర్జెంటుగా మార్చేసుకుని, తెలుగు టీవీ సీరియల్ రచయితల్లాగా ఆలోచించి, ఇష్టారాజ్యంగా సీన్లు రాసుకుని, ప్రేక్షకుల మీదకు వదిలాడు మారుతి… పైగా ఇది సూపర్ ఫాస్ట్ స్పీడుతో తీశాడట… అసలు ఏముందిర భయ్ ఈ సినిమాలో..? ఓ ఇద్దరు ప్రేమికులు… చిన్న విషయాల్ని ఎక్కువగా భయపడే హీరోయిన్ తండ్రి… దాని మీద పెట్రోల్ పోసే ఇరుగుపొరుగు… పోనీ, అదైనా సరిగ్గా తీసి ఏడ్చాడా..? హీరో కేరక్టరైజేషన్ ఓ చెత్తా… హీరోయిన్ అంతకన్నా…! ఫాఫం, హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన అజయ్ ఘోష్ బాగానే చేశాడు… అసలు హీరో, విలన్, కమెడియన్, సైడ్ హీరో అన్నీ తనే… హీరో హీరోయిన్ సైడ్ పాత్రలు… మధ్యమధ్యలో జబర్దస్త్ మార్క్ కమెడియన్లు ఎవరెవరో వస్తుంటారు, ఏవో పిచ్చి స్కిట్లు చేస్తుంటారు, పోతుంటారు… ప్రేక్షకులు థియేటర్ ఎగ్జిట్ గేట్లు ఎటువైపు అని డెస్పరేట్ గా చూస్తుంటారు… సందు దొరికితే చాలు, వేగంగా పారిపోతుంటారు…
రజినీకాంత్ పెద్దన్న సినిమాలాగే దీనికీ కథా కాకరకాయ, సమీక్ష తొక్కాతోలూ విశ్లేషణలు శుద్ధ దండుగ… కామెడీయే కావాలనుకుంటే… పైగా అడల్ట్ కామెడీ డైలాగులు గట్రా కావాలనుకుంటే… ఈటీవీలో ఫేమస్ జబర్దస్త్ షోలు లేవా..? శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్, రెచ్చిపోదాం బ్రదర్, ఢీ… ఇలా బోలెడు… పర్సుకు బొక్క పెట్టుకుని, కిందా మీదా పడి నీ సినిమా కోసం థియేటర్‌కు ఎందుకు రావాలి…? ఓ ఎమోషన్ లేదు, ఓ డ్రామా లేదు… ఓ కాన్‌ఫ్లిక్ట్ లేదు, అసలు ఓ సినిమాకు ఉండే లక్షణాలే లేవు… ఒకవైపు తమిళ, మలయాళ దర్శకులు తమ క్రియేటివిటీతో బాక్సులు దద్దరిల్లేలా చేస్తున్నారు… మనవాళ్లు మాత్రం ఇదుగో, ఈ పిచ్చి సినిమాలతో టాలీవుడ్ అసలు రేంజ్ ఏమిటో తెలియజేస్తున్నారు… ఫాఫం, మెహరీన్ ఎండుకుపోయింది… హీరో పర్లేదు… కానీ ఓ రేంజ్ తెలుగు సినిమాకు ఆనడు… మొహమాటాలు అక్కర్లేదు, ఈ సినిమా రేంజ్ ఖచ్చితంగా ఓ యావరేజ్ తెలుగు టీవీ కామెడీ ప్రోగ్రామే… ఇంతకు మించి ఏమాత్రం ఎక్కువ రాసినా గూగుల్ వాడు స్వయంగా చర్య తీసుకునేట్టున్నాడు… సెలవు…!!
Share this Article