Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బౌన్సర్లు… మంచు మార్క్ క్రమశిక్షణకు ప్రైవేటు బలగాలు…

December 12, 2024 by M S R

.

నిర్మోహనం… బౌన్సర్ల బాధితులు

ఈమధ్య ఒక పెళ్ళికి వెళితే స్టేజ్ కు రెండు వైపులా మెట్ల దగ్గర బౌన్సర్లు ఉన్నారు. వారి కండలను చూడగానే నాకు గుండెలు జారిపోయాయి. పెళ్ళి మంటపంలో ప్రయివేటు బాడీ గార్డుల రక్షణ ఒక అవసరం అని సమాజం ఏనాడో అంగీకరించింది.

Ads

నేను ఆ పెళ్ళి చూసుకుని… మరోచోట కార్తిక వనభోజనానికి వెళ్ళాలి. బౌన్సర్లను దాటుకుని వధూవరులను ఆశీర్వదించేంత తెగింపు, ధైర్యసాహసాలు, కండబలం, గుండెబలం లేని పిరికివాడిని. పెళ్ళికొడుకు చిన్నాన్న కనిపిస్తే… నేనొచ్చానని మీ అన్నకు చెప్పండి అని వెనుదిరగబోతుంటే… ఆయన బౌన్సర్ల బాధ తప్పించి వేదిక మీదికి తీసుకెళ్ళాడు.

మరోచోట పెళ్లికూతురి తండ్రి, నేను జాన్ జిగ్రీ దోస్తులం. నేరుగా వేదిక ఎక్కబోతే బౌన్సర్లు ఎత్తి అవతల పడేశారు. పెళ్ళికూతురి తండ్రి వచ్చి మొదట బౌన్సర్ల కర్తవ్య దీక్షను అభినందించి… తరువాత నన్ను ఓదార్చాడు. దానవీరశూరకర్ణ మయసభలో భంగపడ్డ దుర్యోధనుడి డైలాగులన్నీ మననం చేసుకుంటూ వచ్చే జన్మలో బౌన్సర్లను ఎదుర్కోగల నిజభుజవీర్యప్రతాపబలం ఇమ్మని భగవంతుడిని వేడుకున్నాను.

ఇంకోచోట ఒక పెద్దాయన ఫలానా టైమ్ కు రమ్మన్నాడు. వెళ్ళాను. కింద సెల్లారులో బౌన్సర్లు పైన ఆకాశంలో బౌన్సర్లతో వాకీ టాకీలో “ఎవడో ఊరూపేరూ లేని గొట్టంగాడు. నేరుగా రాబోయాడు. మేము అడ్డుకుని వాడి నడుముకు బాంబుల్లేవని నిర్ధారించుకున్నాము. సార్ రమ్మన్నారట. మనకేమీ ఇన్ఫర్మేషన్ లేదు కదా?” అన్నాడు.

“ప్రతివాళ్ళూ అలాగే చెప్తారు. అక్కడే ఉండమను”- అని వాకీటాకీలో నాక్కూడా వినపడేలా స్పష్టంగా చెప్పాడు. నేను ఆ సారుకే ఫోన్ చేశా. అయ్యో! అదేమిటి? మీరు సెల్లారులో ఆగడం ఏమిటి? నేరుగా వచ్చేయాలి కదా! అన్నాడు.

బౌన్సర్లకు చెప్పమని ఆయన పిఏ కు చెప్పడానికి, ఆ పిఏ బౌన్సర్లకు చెప్పడానికి పదినిమిషాలు పట్టింది. అప్పటిదాకా నా ఆత్మాభిమానాన్ని తూట్లు పొడుస్తూ అక్కడే నిలుచోబెట్టారు. పైకి వెళ్ళి… ఆయన ప్రేమాభిమానాల్లో తడిసి ముద్దయి బయటికి వచ్చి… కాసేపు ఎండలో ఎండాల్సివచ్చింది.

ఎవడైనా పొరపాటున లోపలికి సార్ పర్మిషన్ లేకుండా వెళితే బౌన్సర్ల ఉద్యోగం ఊడిపోతుందని తరువాత తెలిసింది. అతిథిని చీపురుపుల్లకంటే హీనంగా చూసే ఆ మర్యాదలు, ప్రోటోకాళ్ళు, సార్ కు- బౌన్సర్లకు మధ్య ఉన్న కోడ్ భాషలు, సార్ వారి మీద కోప్పడ్డట్టు నటించడాలు అన్నీ తెలిసి మరింత ముచ్చటేసింది. సెల్లార్ మొదలు ఎక్కడి నుండి ఎవరు తన దగ్గరికొస్తున్నారో సీసీటీవీ లో చూస్తూ సార్ నాతో మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా ఒకటే పులకింత.

ప్రస్తుత సందర్భం:-

జల్పల్లిలో జాలి లేకుండా మంచు కురిసేవేళలో, కరిగేవేళలో బౌన్సర్లు- బౌన్సర్లు కొట్టుకున్నారు. రాయడానికి వీల్లేని భాషలో తిట్టుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. చివరకు బౌన్సర్లు మీడియా కెమెరాలను పగులగొట్టారు. వృత్తి ధర్మంలో భాగంగా వార్తలు కవర్ చేయబోయినవారిని సాయుధ పోలీసుల కళ్ళముందే ఆఫ్టర్ ఆల్ బౌన్సర్లు, ఆ బౌన్సర్లను పోషించే మనిషీ కలిసి కొట్టారు. మెడపట్టి గెంటేశారు.

భారత రాష్ట్రపతి ద్వారా “పద్మశ్రీ” అవార్డు గ్రహీత అని లెటర్ ప్యాడ్ లో వేసుకున్న 78 ఏళ్ళ సీనియర్ సిటిజన్ చేతిలో, అలాగే ఆయన పెంపుడు బౌన్సర్ల చేతిలో దెబ్బలుతిన్న, ఎముకలు విరిగిన మీడియా ప్రతినిధులను కదిలిస్తే వినిపిస్తారు అంతులేని కథలు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
  • జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!
  • ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions