.
‘‘అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పకు సర్వస్వం, చెంచు యువరాణి నెమలి’’ అంటూ తాజాగా కన్నప్ప సినిమా టీమ్ ఓ పోస్టర్ వదిలింది…
ఆమె ఈ సినిమాలో హీరోయిన్… పేరు ప్రీతి ముఖుందన్… మీకు భక్త కన్నప్ప సినిమా గుర్తుంది కదా… అందులో కృష్ణంరాజుతో ఓ ఆదివాసీ భార్యగా నటించింది వాణిశ్రీ… పాటల్లో, ప్రేమ సీన్లలో అందంగా కనిపించి మెప్పించిన ఆమె భర్త పట్ల ప్రేమ, దేవుడి పట్ల భక్తిని ప్రదర్శించడంలో మంచి నటనను కనబరిచి ఆ పాత్రను రక్తికట్టించింది…
Ads
ఈ మంచు కన్నప్పలో హీరోయిన్ లుక్ ఓ ఆదివాసీ యువతిలా గాకుండా… మోడరన్ సినిమాల్లో కనిపించే కురచ దుస్తుల హీరోయిన్ లుక్‌లాగా…! వర్ణన దేనికి గానీ, మీరే చూడండి…
నిజానికి ఈ సినిమా కోసం విపరీతంగా కర్చు పెడుతున్నాడు మంచు విష్ణు… అనేక భాషల్లో వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయబోయే ఈ సినిమాలో అనేక పాత్రలకు అతిరథ మహారథులను దింపుతున్నారు… మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్… ఇలా ఎందరో…
ఈ రేంజ్ తారాగణం మన తెలుగు సినిమాలో ఇటీవల కాలంలో ఇదే ప్రథమం… విష్ణు భారీ రిస్క్ తీసుకుంటున్నాడు… మరి కీలక పాత్రకు ఈ ప్రీతి ముఖుందన్ ఏం చాయిసో అర్థం కాదు… ఆమె కెరీర్‌లో చేసినవే రెండు సినిమాలు… అవీ చిన్న సినిమాలు… తెలుగులోనే డెబ్యూ… ఆమధ్య వచ్చిన ఓం భీమ్ బుష్ అనే హారర్ కామెడీ సినిమాలో చేసింది… తరువాత ఏదో చిన్న రొమాంటిక్ తమిళ సినిమా… అంతే…
ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు ఓ పాపులర్ హీరోయిన్‌ను తీసుకోవచ్చు కదా, సినిమాకు అదీ ఓ అదనపు ఆకర్షణ అయి ఉండేది కదా అంటారా..? సరే, వాళ్ల సినిమా, వాళ్ల ఇష్టం… కానీ నెమలి పాత్రను కాస్త ఉదాత్తంగా చిత్రీకరించాలని ఆశించడమే..! ఆమె అందం, సౌష్టవ ప్రదర్శన కోసం కత్తి లుక్ గాకుండా ఇంకాస్త బెటర్ లుక్ ఉంటే బాగుండేదేమో…!!
NIT లో చదువుకున్న ప్రీతిది తమిళ నేటివ్… ఇప్పుడు కన్నప్ప గాకుండా చేతిలో మరో మలయాళం సినిమా ఉంది… మోడల్, రెండు మూడు మ్యూజిక్ వీడియోలు… ఇదీ ఆమె కెరీర్… రాను రాను ఈ సినిమా పాత్రలకు సంబంధించి ఇంకెందరు నటీనటుల్ని పరిచయం చేయబోతున్నారో… అవునూ, కన్నప్ప కథలో ఇన్ని ప్రధాన పాత్రలుంటాయా..!!
Share this Article