.
Subramanyam Dogiparthi ….. భారతీయ చలనచిత్ర రంగంలో రాజకీయ సంచలనం సృష్టించిన సినిమా 1987 ఫిబ్రవరిలో వచ్చిన ఈ మండలాధీశుడు …
ఈ సినిమాకు ముందు మహమ్మద్ బీన్ తుగ్లక్ వంటి రాజకీయ వ్యంగ్య చిత్రాలు ఉన్నా అవన్నీ ఎక్కువగా వ్యవస్థల మీదే . కాస్త దూకుడుగా వచ్చింది యన్టీఆర్ యమగోల సినిమాయే . ఎమర్జెన్సీ మీద , సంజయ్ గాంధీ మీద చెణుకుల వరకే ఆగిపోయారు యన్టీఆర్ .
Ads
ఈ సినిమాకు ముందు మన తెలుగులోనే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న యన్టీఆరుకు వ్యతిరేకంగా నా పిలుపే ప్రభంజనం వంటి సినిమా ఉన్నా అది ఈ మండలాధీశుడులాగా డైరెక్టుగా , ఓపెన్గా కాదు . తెలుగు చలన చిత్ర రంగంలో రారాజు , పైగా ముఖ్యమంత్రి , అల్లాటప్పా ముఖ్యమంత్రి కూడా కాదు యన్టీఆర్ ఆరోజున . 1985 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ముఖ్యమంత్రి . ఆయనకు డైరెక్టుగా వ్యతిరేకంగా సినిమా తీయటం అంటే సునామీకి ఎదురుగా పోవటమే .
కేంద్రంలో 400+ సీట్లతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కొలువై ఉంది . రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మాంచి ఊపులో ఉన్న కృష్ణని పట్టుకున్నారు . అప్పటికే ఆయనా యన్టీఆరుతో కోల్డ్ వార్లో ఉన్నాడు . అగ్నికి వాయువు తోడయినట్లుగా కృష్ణకు కాంగ్రెస్ వారు ,
సినీ రంగంలోని కాంగ్రెస్ సానుభూతిపరులు , యన్టీఆరుకు సినీ వ్యతిరేకులు అందరూ తలో చెయ్యి వేసారు . తద్ఫలితమే ఈ మండలాధీశుడు . యన్టీఆరుని ఇమిటేట్ చేయాలి ? ఎవరు చేయగలరు ? నటనలో దమ్ము ఉండాలి , నటించేందుకు ధైర్యం ఉండాలి .
అప్పుడప్పుడే పైకొస్తున్న కోట శ్రీనివాసరావుని ఒప్పించారు . ఉద్యోగమా సినిమా ఫీల్డా ఏదోఒకటి అటోఇటో తేలిపోతుందని రంగంలోకి దిగాడు . ఇతర ప్రధాన పాత్రల్లో భానుమతి , గుమ్మడి , జమున , విజయచందర్ , ప్రదీప్ శక్తి , త్యాగరాజు , సాక్షి రంగారావు , ప్రభాకరరెడ్డి , మరెంతో మంది నటించారు . (ఈ సినిమాలో భానుమతి నటించడం విస్మయకరమే)…
ఇరవై రోజుల్లో రాత్రింబవళ్ళు షూట్ చేసారు . 1987 జనవరి 26న ప్రారంభమయిన సినిమా ఇరవై రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 26న రిలీజయింది . ముగ్గురు దర్శకులు మూడు యూనిట్లుగా విడిపోయి షూటింగ్ చేసారట . ప్రభాకరరెడ్డి , లక్ష్మీదీపక్ , కృష్ణ ఈ మూడు యూనిట్లకు సారధులు .
రిలీజయ్యాక సంచలనం సృష్టించింది . కోటకు చుక్కలు కనిపించాయి . సినీ రంగంలో ఒక బేచ్ అతన్ని పూర్తిగా బాయ్ కాట్ చేసారు . మళ్ళా నిలదొక్కుకోవటానికి చాలా కష్టపడవలసే వచ్చింది ఆయనకు . అయితే పబ్లిక్ లైఫులో బాగానే ఇబ్బంది పడవలసి వచ్చింది . ఈ వివరాలన్నీ ఆయనే పలు ఇంటర్వ్యూలలో చెప్పటం జరిగింది .
బాలకృష్ణ తన మొహం మీద ఉమ్మేయటం , విజయవాడ రైల్వే స్టేషన్లో యన్టీఆర్ అభిమానులు , తెదేపా కార్యకర్తలు దాడి చేయటం అందరికీ తెలిసినవే . అయితే మద్రాస్ విమానాశ్రయంలో తారసపడిన యన్టీఆర్ క్షమించేసారు . కాళ్ళకు నమస్కారం చేసి ఈ వివాదానికి తెర దించుకున్నాడు కోట .
ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు . నిర్మించిన కృష్ణని , డి వి యన్ రాజుని , దర్శకత్వం వహించిన ప్రభాకరరెడ్డిని ఎవరూ ఏమీ చేయలేదు ; నన్ను టార్గెట్ చేసారని వాపోయారు . ఎప్పుడయినా ఎక్కడయినా రాజులు సేఫ్ కదా ! ఈ వివాదాలను కాసేపు పక్కన పెట్టి ఒక సినిమాగా చూద్దాం .
కోట శ్రీనివాసరావు నటన న భూతో న భవిష్యతి . యన్టీఆరే తెర మీద కనిపిస్తున్నాడా అన్నట్లుగా నటించాడు . హేట్సాఫ్ . మిగిలిన వారిలో భానుమతి , గుమ్మడి , జమున , ప్రదీప్ శక్తి లను అభినందించాలి . డైలాగులను దూకించిన కొండముది శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకంగా అభినందించాలి .
అప్పట్లో సంచలనమే అయినా గత పదేళ్ళలో ఇలాంటి పొలిటికల్‌వి కామన్ అయిపోయాయి . యాత్ర-1 , యాత్ర-2 జగన్ వర్గం తీయగా , బాలకృష్ణ- చంద్రబాబు వర్గం కధానాయకుడు సినిమాను బాలకృష్ణతో తీసారు . ఇంక రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ యన్టీఆర్ తీసారు . ఇవన్నీ కాకుండా వంగవీటి రంగా , పరిటాల రవి , జయలలిత వంటి మరెందరో నాయకుల మీద బయో పిక్కులు వచ్చాయి …
భాజపా వారి పరోక్ష సహకారంతో అనుపమ్ ఖేర్ , అక్షయ కుమార్ , మరి కొందరు అనుకూలురుతో చాలా ఫైల్స్ , స్టోరీలు వచ్చాయి . భాజపా జాతీయ నాయకులయిన వాజపేయి మీద , తెలంగాణ రజాకార్ల మీద రాజకీయ ప్రేరేపిత సినిమాలు వచ్చాయి .
బహుశా ముందుముందు సినిమా మాధ్యమం ద్వారా చరిత్ర యుధ్ధాలు బయో వార్ , టారిఫ్ వార్ లాగా చాలా కామన్ అయిపోయే అవకాశం మెండు .
ఏది ఏమయినా ఒక సినిమాగా ఈ మండలాధీశుడు గొప్ప సినిమా . రాజకీయంగా ఒక సంచలనం సృష్టించి రాజకీయ సినిమాలకు శ్రీకారం చుట్టింది . అయితే ఇప్పుడు చూద్దామని అనుకునే వారికి నిరాశే . యూట్యూబులో లేదు . సినిమా ప్రింట్ ఉన్నా టివిలో వేసే ధైర్యం ఎవరూ చేస్తారని అనుకోను . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్
- కావాలనే యూట్యూబులో పెట్టకుండా, ఏ టీవీలోనూ ప్రసారం గాకుండా, ప్రింట్లు కూడా ధ్వంసం చేయించారనే ప్రచారాలు కూడా వినిపించాయి… ఎన్టీయార్ కోటను క్షమించడం జనం కోసం, క్షమాగుణం ఉన్నట్టు కలరింగు… చేసేవన్నీ కొడుకులు, తమ్ముళ్లు, అనుచరులతో చేయిస్తారు… ముచ్చట
Share this Article