Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…

June 6, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. దంచవే మేనత్త కూతురా దంచు దంచు అంటూ బాలకృష్ణ దంచొదిలి పెట్టిన సినిమా ఈ మంగమ్మ గారి మనమడు . సోలో హీరోగా వంద రోజుల బొమ్మ ఇది బాలకృష్ణకు .

మామూలు వంద రోజులు కాదు . 28 సెంటర్లలో వంద రోజులు , పది సెంటర్లలో 175 రోజులు , కొన్ని చోట్ల సంవత్సరం , మరి కొన్ని చోట్ల 500 రోజులు , ఇలా పిచ్చిపిచ్చిగా అడేసిందీ సినిమా .

Ads

తమిళంలో భారతీరాజా సినిమా Mann Vasanai కు రీమేక్ మన తెలుగు సినిమా . మన తెలుగు నేటివిటీకి చిన్ని చిన్ని ఆహార్యపు మార్పులతో తూర్పు గోదావరి జిల్లాలోని కడియం , ఉండ్రాజవరం , పట్టిసీమ గ్రామాలలోని పచ్చటి వాతావరణంలో తీసారు .

ముందు చిరంజీవికి కధ చెపితే ఆయన పెదవి విరిచారట . యన్టీఆర్ కూడా ఇదేం కధ , మరొకటి చూడండి అన్నారట . అయితే బాలకృష్ణకు నచ్చటంతో కధ సినిమా అయింది .

తినే ప్రతి మెతుకు మీద భగవంతుడు తినవలసిన వాడి పేరు వ్రాస్తాడట . ఈ సినిమా ఘన విజయం బాలకృష్ణకు వ్రాసిపెట్టబడింది .

ఈ సినిమాలో ఒక హీరో , ఒక షీరో ఉన్నారు . హీరో బాలకృష్ణ అయితే షీరో భానుమతి . ఏ పాత్ర వేసినా ఆమె ముద్ర ఉండాల్సిందేగా . సామెతలను వదులుతూ , ఊళ్ళో ఎవరయినా వణికిపోయేలా , ముంజేతి కర్ర నేల మీద వేసి దమ్మున్నోళ్ళు దాటి రమ్మని సవాలు విసిరినా , క్లైమాక్సులో విలన్ని అమ్మోరు లాగా వధించినా , ఏదయినా ఆమెకే చెల్లు . నిర్మాత , దర్శకుడిని ఆ టైటిల్ ఎంచుకున్నందుకు మెచ్చుకోవాలి . మంగమ్మ షీరో మనమడు హీరో .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . శ్రీ సూర్యనారాయణా మేలుకో మా చిలకమ్మ బులపాటం చూసిపో పాట చాలా బాగుంటుంది . అమ్మమ్మ మనమరాళ్ళ సున్నితమైన సరసాలతో ఆసక్తికరంగా సాగుతుంది .

భానుమతి , వాణీ జయరాంలు చాలా శ్రావ్యంగా పాడారు . మరదలా మరదలా తమ్ముడి పెళ్ళామా అంటూ వదిన మరదళ్ళ మధ్య వరకట్నం సినిమాలోని పాట గుర్తుకొస్తుంది .

టైటిల్సుతో పాటు వచ్చే శ్రీరఘు రామా సీతారామా రావాలయ్యా నీ రాజ్యం అని భానుమతి పాడే పాట ఎంత శ్రావ్యంగా ఉంటుందో ! గ్రామీణ వాతావరణం సినిమాలలో రాములోరి పాట లేకుండా ఎలా ! మరో గొప్ప విషయం ఏమిటంటే రాములోరి మీద ఏ సినిమాలో పాటయినా శ్రావ్యంగా ఉండాల్సిందే , హిట్టవ్వాల్సిందే . కావాలంటే పరిశీలించండి .

చందురుడు నిన్ను చూసి చేతులెత్తాడు , గుమ్మా చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు , వంగ తోట కాడ డ్యూయెట్లు కూడా హుషారు హుషారుగా ఉంటాయి . సి నారాయణరెడ్డి గారు గ్రామీణ నేపధ్యానికి అనుగుణంగా పల్లెపదాలను వేసి వ్రాసారు .

సినిమాలో డైలాగులన్నీ చాలా పదునుగా వ్రాసారు గణేష్ పాత్రో . ముఖ్యంగా భానుమతి డైలాగులు , సామెతలు . బావను ప్రేమించే మరదలిగా , అమ్మమ్మకు మనమరాలిగా సుహాసిని హుషారుగా , ముద్దుముద్దుగా నటించింది .  గ్లామరస్ గా చూపబడిన మొదటి సినిమా ఇదేనేమో !

సినిమాలో వై విజయ బావయ్య అని వంపులు తిరిగే ఉంపుడుగత్తె పాత్రను కూడా ప్రేక్షకులు మరచిపోలేరు . కొన్ని గ్రామాల్లో ఉంపుడుగత్తెలు కూడా అఫిషియలే . అలాంటి పాత్రను వై విజయ బాగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో ఎలేశ్వరం రంగా , గొల్లపూడి , బాలాజీ , ఈశ్వరరావు , రావి కొండలరావు , ప్రభృతులు నటించారు .

గుంటూరులో లిటిల్ కృష్ణాలో ఆడింది . టివిలో తరచూ వస్తూనే ఉంటుంది . బహుశా ఈ సినిమా చూడనివారు ఉండరేమో ! చూసి ఉండకపోతే తప్పక చూడండి . A 100% entertaining , musical , feel good movie . పల్లెటూళ్ళల్లో జరిగే జాతర్లు , వసంతాలు కొట్టుకోవటాలు , బావామరదళ్ళ సరసాలు , వగైరాలు పుష్కలంగా ఉన్న సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

.

అచ్చం జగదేవకవీరుడు అతిలోకసుందరి సినిమాలోగే ఇందులో కూడా సుహాసినిని బాలయ్య చెంప మీద కొడతాడు, అంతే ఆమె పరశించిపోతుంది… వెంటనే చిత్తకార్తె చినుకు జల్లు అనే ఓ పాట స్టార్ట్… ఈ సినిమా అంటే వెంటనే గుర్తొచ్చేవి వై.విజయ, భానుమతి, దంచవే పాట… ప్రధానంగా..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions