రిలేషన్… పెంచుకోవడం, కాపాడుకోవడం, పునరుద్దరించుకోవడం, దిద్దుకోవడం… ఒక కళ… అది మనుషుల మధ్యే కాదు, పార్టీల నడుమ, సంస్థల నడుమ, దేశాల నడుమ కూడా…! ఈ ప్రక్రియ కోసం తరచూ మాట్లాడుకోవడమే కాదు, అవసరమైతే కానుకల్ని పంపడం కూడా పరిపాటి… విలువైన కానుకలకన్నా కొన్నిసార్లు పండ్లు, రాఖీలు, స్వీట్లు, బట్టలు గ్రహీత మొహంలో చిరునవ్వును పండిస్తాయి… మనుషుల నడుమ నెగెటివిటీని తగ్గిస్తాయి… ఎంతోకొంత సానుకూలతను, పాజిటివిటీని కలిగిస్తాయి… పలుసార్లు ఎంత ప్రత్యర్థులైనా రాజకీయాలు రాజకీయాలే, మర్యాద మర్యాదే… ఉదాహరణకు… మమత ప్రతి ఏటా మోడీకి రసగుల్లాలు, కుర్తాలు పంపిస్తూ ఉంటుంది… రాజకీయ ప్రత్యర్థిత్వం ఎలాగున్నా సరే… మొన్న మామిడి పళ్లు కూడా పంపించింది… దాదాను తిడుతూనే ప్రేమిస్తుంది దీదీ… నిజానికి కానుకలుగా పంపించే పండ్లలో ముఖ్యమైనవి మామిడిపండ్లు… సీజన్ వచ్చిందంటే చాలు, మామిడి పార్శిళ్లు అటూఇటూ తిరుగుతూ ఉంటయ్…
గంపలుగంపలుగా… వచ్చి ఊరించే రసాలు, కోతకాయలు, పళ్లు… చూస్తేనే సగం కడుపు నిండి… ఎంత తిన్నా ఇంకా మిగిలి… మనం ఇంకెవరికో పంపించి, వాళ్లు ఇంకెటో పంపించి… అది కర్టెసీ కరెన్సీ… మామిడి పండేది మన దేశాల్లోనే కాబట్టి ఇక్కడే ఈ పంపకాలు ఎక్కువ… పాశ్చాత్య దేశాల్లో ఉండదు… ప్రత్యేకించి దక్షిణాసియా దేశాల్లో మామిడి అంటే మామిడే… మర్యాదలకు తిరుగులేదు… అనేక రకాలు.., ఇచ్చిపుచ్చుకోవడమే… జుర్రేయడమే… మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పూలూపండ్లూ అంటే, నిశ్చితార్థం తంతు అంటే… బత్తాయిలకన్నా మామిడే శ్రేష్టం… ఎవరింటికైనా వెళ్తే అరటి తీసుకెళ్తే అదోరకం… సేపులయితే మధ్యరకం… మామిడి తీసుకెళ్తే ఓ రేంజ్… క్వింటాల్ పూతరేకులు, కాజూబర్ఫీ తీసుకుపోయినా సరే, కిలో మామిడి పండ్లయినా ఉంటేనే పరిపూర్ణత…
Ads
అంతెందుకు… బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తెలుసు కదా… ఏకంగా 2600 కిలోల మామిడి పండ్లను మన దేశానికి పంపించింది… అవీ హరిభంగ అనే రకం… ఈమధ్య బాగా పాపులర్ రకం అది అక్కడ… ఆ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ సాగును పెంచుతోంది… దాని క్వాలిటీ అది… గతంలో పాకిస్తాన్ పాలకులైన జియా వుల్ హక్, పర్వేజ్ ముషార్రఫ్ తదితరులు కూడా ఇండియాకు మామిడి పండ్లను పంపిన ఉదాహరణలున్నయ్… బంగ్లాదేశ్ గత ఏడాది దసరా సందర్భంగా బంగ్లా సరిహద్దు రాష్ట్రాల్లోకి బంగ్లా స్పెషల్ వెరయిటీ హిల్సా ఫిష్ 1500 టన్నుల ఎగుమతికి వోకే అనేసింది… నిజం చెప్పొద్దూ… మనుషుల నడుమ సత్సంబంధాలను పెంచేది ఫుడ్డే… మోడీకి, రాష్ట్రపతికే కాదు, షేక్ హసీనా బెంగాల్ సీఎం మమతకు, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఢిల్లీలోని ఇతర పెద్దలకు మామిడి పండ్ల పార్శిళ్లు అందుతున్నయ్… ఇంకా వస్తాయట… బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిన వేక్సిన్ డోసులను మాత్రం మోడీ అర్థంతరంగా ఆపేశాడు… కానీ హసీనా మాత్రం తన మర్యాదను మరిచిపోలేదు… మోడీ భాయ్, మనమేం పంపిస్తున్నాం… తినేసి టెంకలు పారేయడం కాదు, ప్రతి మర్యాద కూడా ముఖ్యమే…!! మీ గుజరాతీ గుగ్రా, లడ్డూ చుర్మాలే కాదు, తెలుగు పూతరేకులు, తెలంగాణ పల్లీల మద్దలు, కేరళ అతిర కశ్మీరీ షుఫ్తా, కర్నాటక ఒబ్బట్లు, తమిళ అక్కర వడిసెలు, జైపూర్ మాలువా, చత్తీస్‌గఢ్ దెహరోరి… ఇంకా… ఇంకా… చుట్టుపక్కల దేశాలకు కూడా… ఆ మహాబలిపురానికి పిల్చి ఇడ్లీ సాంబారు పెట్టడం కాదు, ఆ జిన్పింగ్కూ ఏమైనా ఫలమో స్వీటో పంపించు… వోకేనా…? అసలే ఏడుస్తున్నాడు మనమీద…!!
Share this Article