Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మణిపుర్ మంటలు… మరింత విస్తృత కోణంలో ఇవీ అసలు కారణాలు…

July 26, 2023 by M S R

మణిపుర్‌ మండుతోంది… ప్రకృతి సోయగానికి నెలవైన దేశ ఈశాన్య సరిహద్దు రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతోంది. మూడు, ముఫ్ఫై చిక్కుముడులతో సంక్లిష్టమైన జాతుల వైరానికి కేంద్ర బిందువుగా మారి భగ్గుమంటోంది. హత్యలు… అత్యాచారాలు… మహిళలను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగింపులతో ఆధునిక భారతం సిగ్గుతో తలదించుకుంటోంది. వేటూరి మాటల్లో చెప్పాలంటే… మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదాన్ని చూస్తూ భరత జాతి సిగ్గుతో చచ్చిపోతోంది. యావత్‌ సమాజం ఈ దారుణాన్ని ఖండిస్తోంది. మణిపుర్‌ మహిళలకు సంఘీభావం ప్రకటిస్తోంది. అది కనీస మానవీయ ధర్మం.

అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ విధానాలు, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. ప్రజా సంఘాలు, మేథావులు మీడియాలోనూ అంతకుమించి సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎపిసోడ్‌ను రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక రాద్ధాంతాలు హైజాక్‌ చేస్తున్నాయి. తాము విభేదించే భావజాలంపై పైచేయి సాధించడానికే యత్నిస్తున్నాయి. అంతే తప్ప ఏం చేయాలి… ఎలా చేయాలనే దానిపై మాత్రం ఎవరూ సూటిగా స్పందించడం లేదు.

మూడు తెగలు… ముఫ్ఫై చిక్కుముడులు

Ads

కేవలం 22,327 చ.కి.మీ. విస్తీర్ణంతో 32లక్షల మంది జనాభా కలిగిన మణిపుర్‌లో మైతేయి, కుకీలు, నాగాలు అనే మూడు ప్రధాన తెగలు ఉన్నాయి. లోయ ప్రాంతంలో ఉండే మైతేయిలు ఓబీసీలు. ప్రధానంగా హిందువులు. మణిపుర్‌కు దక్షిణాన కొండలపై ఉండే కుకీలు, ఉత్తరాన కొండలపై ఉండే నాగాలకు ఎస్టీలు. వారిలో అత్యధికులు క్రిష్టియన్‌ మతాన్ని అవలంబించేవారు కాగా ముస్లింలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఈ మూడు తెగలకు ఏ రెండు అంశాల్లోనూ ఏకాభిప్రాయం లేకపోవడమే మణిపుర్‌ను రావణకాష్టంగా మారుస్తున్నాయి.

– చారిత్రకంగా మణిపుర్‌కు చెందిన మైతేయి, నాగా తెగలు తాము స్థానికులం కుకీలు స్థానికేతరులు అంటున్నాయి.

– ఓబీసీలు అయిన మైతేయిలు ఎస్టీ హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్టీ హోదా దక్కితే కొండ ప్రాంతాలపై కూడా భూములు పొంది ప్రాబల్యం పెంచుకోవాలన్నది వారి ఉద్దేశం. మైతేయిలు కొండ ప్రాంతాల మీదకు వస్తే తమ హక్కులకు భంగంవాటిల్లుతుందన్నది కుకీల ఆందోళన. ప్రస్తుత అల్లర్లకు మూల కారణం. కుకీల ఆందోళన కొంతవరకు సమంజసమైనదే.

– కొండ ప్రాంతాల్లో ఉంటే కుకీలు తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధించవచ్చన్నది వారి ఆలోచన. కుకీలు ఉన్న కొండ ప్రాంతాల్లోకి పొరుగున ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి భారీగా అక్రమ వలసదారులు వచ్చి చేరుతుండటం దేశ ప్రయోజనాలకు విఘాతంగా మారింది. పోనీ జాతీయ పౌర రిజిస్ట్రార్‌ (ఎన్‌ఆర్‌సీ) రూపొందించేందుకు కుకీలు అంగీకరిస్తారా అంటే అదీ లేదు. అక్రమ చొరబాటుదారులు వస్తారు… కానీ తమకు స్వయం ప్రతిపత్తి ప్రకటించాలని డిమాండ్‌ చేయడం సరికాదు.

– నాగా తెగ డిమాండ్‌ మరింత ప్రమాదకరమైంది. నాగాలాండ్‌తోపాటు మణిపుర్, అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాంలలోని నాగాలు ఉంటే ప్రాంతాలను ఏకం చేసి గ్రేటర్‌ నాగాలాండ్‌ (నాగా లిమ్‌) ఏర్పాటు చేయాలన్నది వారి డిమాండ్‌. అందుకోసం సాయుథ పోరాటం, ఇతరత్రా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఆ డిమాండ్‌ను మణిపుర్, అస్సోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రేటర్‌ నాగాలాండ్‌ ఏర్పడితే భవిష్యత్‌లో స్వతంత్య్ర దేశం డిమాండ్‌ చేస్తారన్నది నిస్సందేహం.

ఈ మూడు అంశాలే మణిపుర్‌లో దీర్ఘకాలంగా అల్లర్లు, అలజడులు, దారుణాలకు ప్రధాన కారణం. వాటిపైనే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేథావులు వాదోపవాదాలు చేస్తున్నారు. కానీ ఆ మూడు తెగల డిమాండ్లపై సూటిగా తమ విధానాన్ని చెప్పవు. పార్టీలు, మేథావులు విస్మరిస్తున్న మరో కీలక అంశం ఉంది… భారతదేశానికి మణిపుర్‌ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా మణిపుర్‌ విషయంలో భారత ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించేది… అమలు చేసేది ఈ వ్యూహాత్మక ప్రయోజనాల అంశమే.
వ్యూహాత్మకంగా కీలకం

ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న మణిపుర్‌ వ్యూహాత్మకంగా భారతదేశానికి అత్యంత కీలకం. మణిపుర్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు భారత దేశ ప్రధాన భూభాగంతో కంటే మయన్మాయర్‌తోనే కనెక్టివిటీ, రాకపోకలు ఎక్కువ. చైనా ఆక్రమిత టిబెట్‌కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలను అనుసంధానించే గేట్‌వే వంటిది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 జూన్‌లో జపాన్‌ సైనిక దళాలు మయన్మార్‌ (అప్పటి బర్మా) నుంచి ఈ ప్రాంతం గుండానే అప్పటి బ్రిటీష్‌ ఇండియాలోని మణిపుర్‌ రాజధాని ఇంపాల్‌లోకి చొరబొడ్డాయి.

భారత దేశంలోకి చొరబడేందుకు మణిపుర్‌ సరిహద్దులు అత్యంత అనువైనవన్నది ఆనాడే స్పష్టమైంది. అందుకే మణిపుర్‌లో అస్థిరత, అలజడులు ఉండేలా చైనా పన్నాగం పన్నుతునే ఉంది. చైనా అందించే ఆయుధాలు, ఆర్థిక సహకారంతో మణిపుర్, మిజోరాం, నాగాలాండ్‌లలో ఆస్థిరత సృష్టిస్తున్న దాదాపు 100 ఉగ్రవాద గ్రూపులతో భారత్‌ పోరాడుతునే ఉంది. మణిపుర్‌లోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఉగ్రవాద సంస్థ చైనాకు కళ్లు, చెవులుగా పని చేస్తోంది.

మయన్మార్‌లోని ఉగ్రవాద సంస్థ కచిన్‌ ఇండిపెండెంట్‌ ఆర్మి (కేఐఏ) ద్వారా పీఏల్‌ఏ ఉగ్రవాదులకు చైనా శిక్షణ ఇప్పిస్తోంది. మణిపుర్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో భారత సైనిక దళాలకు చెందిన 46 బెటాలియన్లు ఉన్నాయి. ఆ మూడు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న 1,643 కి.మీ. అంతర్జాతీయ సరిహద్దు రక్షణకు కేవలం 15 బెటాలియన్లనే నియోగించారు. మిగిలిన 31 బెటాలియన్లు ఆ మూడు రాష్ట్రాల్లో తీవ్రవాద మూకకట్టడికే నిత్యం శ్రమించాల్సి వస్తోంది.
మయన్మార్‌కు భారత్‌ సైనిక సహకారం

చైనాకు మయన్మార్‌తో కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. మయన్మార్‌ ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఆ దేశంలో తిరుగుబాటు దళాలకు చైనా ఆయుధాలు, ఇతర సైనిక సహాయం అందిస్తోంది. చైనాకు చెక్‌ పెట్టాలంటే మయన్మార్‌ సహకారం భారత్‌కు అవసరం. అందుకే మయన్మార్‌లో ఉన్నది సైనిక ప్రభుత్వం అయినప్పటికీ భారత్‌ ఆ దేశంతో సఖ్యతతో ఉంటోంది. చైనా సహకారంతో చెలరేగిపోతున్న తిరుగుబాటు దళాలను ఎదుర్కొంనేందుకు మయన్మార్‌ ప్రభుత్వానికి భారత్‌ ఆధునిక ఆయుధాలు, ఇతర సైనిక సహకారం అందిస్తోంది.

అంతేకాదు తము అనే ప్రాంతాన్ని అంతర్జాతీయ స్మగ్లింగ్‌ డెన్‌గా చేసినా భారత్‌ ఉపేక్షిస్తోంది. అక్కడ నుంచి మణిపుర్‌ లోని మోరేహ్‌ ద్వారా భారత్‌కు గంజాయి, డ్రగ్స్, చైనా ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తులు అక్రమంగా రవాణా చేస్తున్నా చూసీ చూడనట్టు వదిలేస్తూ ఉంటుంది. భారత ప్రధాన లక్ష్యం ఉగ్రవాదాన్ని అరికట్టడం… చైనాను కట్టడి చేయడం. స్మగ్లింగ్‌ను కఠినంగా కట్టడి చేస్తే స్థానికులు చైనాకు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది. తుము తమ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు కావడంతో మయన్మార్‌ కూడా భారత్‌కు ఎదురు తిరుగుతుంది. దేశ రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం భారత్‌ ఈ వ్యవస్థీకృత స్మగ్లింగ్‌ను ఉపేక్షిస్తోంది.
ఈశాన్య భారత అనుసంధానమే మార్గం

దేశ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షణకు సరైన పరిష్కారం ఒకటే ఉంది… మణిపుర్‌ కేంద్రంగా ఈశాన్య రాష్ట్రాలను భారత దేశ ప్రధాన భూభాగంతో మరింతగా అనుసంధానించడం ఒక్కటే శాశ్వత పరిష్కారం. అందుకోసం రూపొందించిందే లుక్‌ ఈస్ట్‌ పాలసీ… కాంగ్రెస్‌ ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీ పేరును బీజేపీ ప్రభుత్వం యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీగా పేరు మార్చింది. పేరు ఏదైనా రెండు ప్రభుత్వాల ఉద్దేశం మాత్రం ఒకటే. దేశానికి ఓ మూలకు విసిరేసినట్టు ఉన్న మణిపుర్‌ను ఇటు అస్సోం ద్వారా కోల్‌కత్తా, ఢిల్లీలతో అనుసంధానించాలి…అటు థాయ్‌లాండ్‌ తో అనుసంధానించి అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన కారిడార్‌గా చేయాలి.

భారత ప్రధాన భూభాగం నుంచి ఆర్థిక కార్యకలాపాలు మణిపుర్‌ వరకు విస్తరించాలి. అందుకోసమే మణిపుర్‌లో విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. రూ.20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. మరోవైపు కోల్‌కత్తా నుంచి థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ వరకు అంతార్జాతీయ హైవే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. కోల్‌కత్తా నుంచి మణిపుర్‌ నుంచి మయన్మార్‌ మీదుగా బ్యాంకాక్‌ వరకు 2,800 కి.మీ.మేర నాలుగేళ్లలో నిర్మించే ఈ హైవే ఆసియన్‌ దేశాల వాణిజ్యంలో కీలకం కానుంది. మణిపుర్‌లో పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే అక్కడ ఉద్యోగ, ఉపాథి అవకాశాలు పెరుగుతాయి. దాంతో ఈశాన్య భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం సమగ్రంగా మారిపోతుంది. దాన్ని అడ్డుకునేందుకే చైనా మణిపుర్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద మూకల ద్వారా అలజడులు సృష్టిస్తోంది.
మేథావులూ… సన్నాయి నొక్కులేల…!

యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీపై కొందరు మేథావులు సన్నాయి నొక్కులు నొక్కుతునే ఉన్నారు. మణిపుర్‌లో అపారంగా ఉన్న ఖనిజ సంపదను అంబానీలు, అదానీలకు కట్టబెట్టడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంబానీలు, అదానీలు కాకపోతే యేచూరీలు, కారత్‌లు వచ్చి అక్కడ మైనింగ్‌ వ్యాపారం చేయొచ్చు. పరిశ్రమలు పారిశ్రామికవేత్తలే స్థాపిస్తారు. అది ఆదానీనా… అంబానీనా అన్నది తరువాత. పోనీ ఈస్ట్‌ ఇండియా కంపెనీనీ పిలుద్దామా పరిశ్రమలు పెట్టడానికి… !?

జార్ఖండ్‌లోని బైలదిల్లా గనుల నుంచి వస్తున్న ఇనుప ఖనిజంతో దేశంలో అయిదు స్టీల్‌ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం తీయకపోతే దేశంలో పరిశ్రమలు, ఇతర ప్రాజక్టులు దేనితో నిర్మిస్తారు… వెదురు బొంగులతో నిర్మిస్తారా… విదేశాల నుంచి ఇనుము దిగుమతి చేసుకుంటారా…! గనుల నుంచి ఖనిజాలు వెలికి తీయకుండా ఏ దేశంలోనైనా అభివృద్ధి సాధ్యమా…! అది ఎంతవరకు తీయాలి.. ఎలా తీయాలి అనే దానిపై చర్చించాలి తప్ప… అసలు వద్దు అంటే ఎలా…!?

భద్రతా అంశాలు మీరే నిర్ణయిస్తే ఎలా…!

మణిపుర్‌లో సైనిక బలగాల దారుణాలు మితిమీరిపోతున్నాయి… మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ మరో ఆరోపణ. భూమ్మీద సైనిక బలగాలు ఉన్న ప్రతి చోట వినిపించే మాటే మానవ హక్కుల ఉల్లంఘన. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా తమ వ్యూహాత్మక ప్రాంతాల నుంచి సైనిక బలగాలను ఉపసంహరించిన ఉదంతం ఒక్కటంటే ఒక్కటీ లేదు. భారత్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. మణిపుర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని కొందరు మేథావులు వాదిస్తున్నారు. పరిస్థితులు కుదుట పడితే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది.

మణిపుర్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో గత పదేళ్లలో 750 మంది సైనికులు బలిదానం చేశారన్నదీ గుర్తుంచుకోవాలి. గతంలో మేఘాలయ, త్రిపురలలో అమలులో ఉన్న ఆ చట్టాన్ని ఉపసంహరించారు కదా. మణిపుర్‌లో కూడా పరిస్థితులు కుదుటపడితే ఆ చట్టాన్ని ఉపసంహరిస్తారు. అంతేకాదు పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఆ చట్టాన్ని ఉపసంహరించాల్సిందే అంటే కుదరదు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నది అందరికీ తెలుసు. అందుకే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కింద అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల ఆదాయానికి వందరెట్ల నిధులను ఆ రాష్ట్రాలకు కేటాయిస్తోంది. సరిహద్దు రాష్ట్రాల ప్రజల పట్ల దేశానికి సానుభూతి ఉంది. కానీ వ్యూహాత్మక అంశాల్లో నిర్ణయం మనది కాదు… భారత ప్రభుత్వానిదే.

దేశ సరిహద్దుల్లో సైన్యం ఉంది కాబట్టే మీరు ట్యాంక్‌బాండ్‌ మీద కూర్చొని సిద్ధాంతాల మీద రాద్ధాంతాలు చేస్తున్నారు. వైజాగ్‌ బీచ్‌ రోడ్డుపై వాకింగ్‌ చేస్తూ కృష్ణ శాస్త్రి, గుల్జార్‌ కవితల్లోని భావుకతను ఆస్వాదిస్తున్నారు అన్నది గుర్తుంచుకోవాలి. చివరిగా చెప్పేదేమిటంటే… బాధితుల పట్ల సానుభూతి చూపుదాం… సంఘీభావం ప్రకటిద్దాం… మాటల్లోనే కాదు వీలైతే చేతల్లోనూ అండగా నిలుద్దాం. అదే సమయంలో దేశ రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలనూ పట్టించుకుందాం. మనం పట్టించుకున్నా పట్టించుకోకున్నా… వ్యూహాత్మక విషయాల్లో దేశం తన పని తాను చేసుకుపోతుంది. సోషల్‌ మీడియాలో శోకాలు దేశ వ్యూహాత్మక విధాన నిర్ణయాలను ప్రభావితం చేయలేవు…. (– వడ్డాది శ్రీనివాస్ ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions