యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ… అలియాస్ మణిశర్మ… మొన్నామధ్య ఎంతసేపూ తమన్, డీఎస్పీయేనా… నాకూ చాన్స్ ఇస్తే వైవిధ్యం ఉంటుంది కదా అంటూ నిర్మాతలను కోరుతూ హఠాత్తుగా ప్రచారతెర మీదకు వచ్చాడు… నిజంగా ట్రాజెడీ… 30 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మణిశర్మ నాకూ చాన్సులు ఇవ్వండి సార్ అనడగడం బాగనిపించలేదు… అడగడం బాగా లేదని కాదు… అలా అడిగే సిట్యుయేషన్ బాగా లేదని…
ఎస్, ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్, డీఎస్పీ టాప్ మ్యూజికల్ కంపోజింగ్ స్టార్లు… పెద్ద హీరోల సినిమాలన్నీ వాళ్లవే… కాపీ మాస్టర్లంటూ తిట్టినా సరే, వాళ్ల హవాకు ఎదురు లేదు ఇప్పుడు… అఫ్‌కోర్స్ ఇండస్ట్రీ అంటే అంతే… సక్సెస్‌ను బట్టి కార్పెట్లు పరిచే లోకం ఇది… సరే, మణిశర్మ కెరీర్ 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సూపర్ సింగర్ షోలోకి అతిథిగా పిలిచి, తన విశిష్టతను నెమరేసుకుని, సన్మానించి, ఘనంగా స్మరించింది ఆ టీవీ మేనేజ్‌మెంట్… గుడ్…
మణిశర్మ కూడా సరదాగా ఆ షోలో పార్టిసిపేట్ చేసి, ఆ సందర్భాన్ని బాగా ఎంజాయ్ చేశాడు… కాకపోతే తనది మచిలీపట్నం పుట్టుకే కదా, తెలుగు అస్సలు సరిగ్గా మాట్లాడలేడు అదేమిటో… ఆ షోలో మంగ్లి మణిశర్మను ప్రశంసించాలనే భావనతో ఏదో చెప్పబోయింది… ఆయన అంతే సరదాగా ‘పాటల్లో గట్టిగా అరుస్తావుగా (హైపిచ్ అని తన ఉద్దేశం, సరదాగా..) చెప్పూ’ అన్నాడు… అఫ్‌కోర్స్, నేను కూడా మాట్లాడేటప్పుడు స్లోయే గానీ రికార్డింగ్ స్టూడియోలో ఎక్కువగా అరుస్తుంటాను అన్నాడు… మంగ్లి అనాలోచితంగా ‘అవును సార్, తెలుసు సార్’ అనేసింది… దాంతో మణిశర్మ షాక్…
Ads
ఎక్కువగా రిథమ్ ప్రోగ్రామింగ్ చేసే వాళ్ల దగ్గర స్పీకర్లు పగులగొడతారట కదాని అనంతశ్రీరామ్ ఓ ప్రశ్న వేస్తే… ఎవరూ, తమన్ గాడు అబద్ధం చెప్పి ఉంటాడు అనేశాడు మణిశర్మ… అంటే ఒకసారి అలా జరిగిందిలే అని ముక్తాయించాడు కూడా… తమన్‌ను గాడు అనేంత ధైర్యం ఇండస్ట్రీలో ఎవరికి ఉంది…? ఎస్, మణిశర్మకే ఉంది… తమన్ ఆయన్ని గురువుగా భావిస్తాడు… తమన్ సంగీత దర్శకుడు కాకమునుపు దాదాపు 64 మంది మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద రిథమ్ బాక్స్ ప్లేయర్, కీబోర్డ్ ప్రోగ్రామర్, డ్రమ్మర్‌గా పనిచేశాడు… 900 సినిమాలకు తను డ్రమ్మర్… కానీ తమన్ మణిశర్మ వద్ద ఎనిమిదేళ్లపాటు 90కి పైగా సినిమాలకు పనిచేశాడు…
షోలో ఎప్పుడూ చురుకుగా, సరదాగా ఉండే రాహుల్ కూడా ఏదో పాటను ప్రస్తావిస్తూ… మీకెందుకు ఈ థాట్ రాలేదు సర్, రాహుల్ (నాతో)తో ఇలాంటి పాట పాడించాలని అనడిగాడు… మణి కూడా అంతే సరదాగా ‘ఐ హావ్ రెస్పాన్సిబులిటీ ఫర్ దేర్ ఫిలిమ్’ అని అలవోకగా సెటైర్ వేశాడు… ఒక దశలో మణిశర్మ హయ్యెస్ట్ పెయిడ్ కీబోర్డ్ ప్లేయర్ అని రాహుల్ గుర్తుచేసుకుంటే… అవును మొదట్లో నేను వయోలినిస్టును, కానీ అది చిన్నగా ఉంది, కీబోర్డ్ ప్లేయరయితే పెద్దగా ఉంటుంది కదాని అటు షిఫ్టయ్యాను అని చెబితే, ఆర్కెస్ట్రాలో కూర్చున్న వయోలినిస్టు కామాక్షి సిగ్గుపడిపోయింది… మొత్తానికి సూపర్ సింగర్ ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం బాగా రక్తికట్టించినట్టుంది చూడబోతే..!! సినీసంగీత ప్రియులను కనెక్ట్ చేస్తాయి ఇలాంటి ఎపిసోడ్లు..!!
Share this Article