.
Subramanyam Dogiparthi …… మనిషి మనిషికీ ఓ చరిత్ర ప్రతీ మనిషిదీ ఒక పాత్ర . అంతేగా మరి . అమెరికాని భ్రష్టు పట్టిస్తున్న ట్రంప్ మస్కుల దగ్గర నుండి ఆముదాలవలస లోని సుబ్బయ్య వెంకయ్య దాకా ప్రతీ మనిషికీ ఓ చరిత్ర ఉంటుంది . ఎవడి కష్టాలు వాడివి . ఎవడి గోల వాడిది .
ఉన్నవాడికి అరగని జబ్బు, లేనివాడికి ఆకలి జబ్బు, ఉండీ లేని మధ్య తరానికి ఒకటే అప్పుల బాధరా . జనవరి 1983 లో వచ్చిన ఈ మనిషికో చరిత్ర అలాంటి కధే .
Ads
నాలుగు దిగువ మధ్య తరగతి కుటుంబాల లోగిలిలో జరిగే కధ . చాలా బాగా ఆడింది . ఈ సినిమా కధను నేసిన విస్సుని ప్రత్యేకంగా అభినందించాలి . విస్సు తమిళంలో పేరు మోసిన రచయిత , నటుడు , దర్శకుడు . ఆడదే ఆధారం సినిమాలో ఒక విధంగా అతనే కధానాయకుడు . సినిమాలో ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది . చివరకు పాలిచ్చే గేదెతో సహా .
ఆ లోగిలి లోని నాలుగు కుటుంబాలలో ఒకటి మురళీమోహన్ , సుహాసిని , మధ్యలో సుహాసిని తమ్ముడి రాంజీ ఎంటర్ అవుతాడు . రెండోది చంద్రమోహన్ , ప్రభ , తండ్రి హేమసుందర్ , మనుమరాలు మీనా . మీనాకు బాలనటిగా తెలుగులో ఇదే మొదటి సినిమా . మూడోది సింగిల్ మేన్ కుటుంబం విజ్జి బాబు . నాలుగోదే ప్రధానమయింది . ప్రేక్షకుడు మరచిపోలేని కుటుంబం .
సాధారణంగా మన మధ్య తరగతి కుటుంబాలలో కొడుకులు , కూతుళ్లు ఏం పని చేయకుండా బేవార్సుల్లాగా , సున్నప్పిడతల్లాగా , భూమికి భారంగా ఉంటూ ఉంటారు . ఈ సినిమాలో కుటుంబ పెద్ద తండ్రే ఈ కేటగిరీ . గొల్లపూడి మారుతీరావు నటించిన పాత్ర . అతని భార్యగా అన్నపూర్ణ చాలా గొప్పగా నటించింది .
క్షమయా ధరిత్రీలాగా . కూతురిగా పూర్ణిమది గొప్ప పాత్ర . తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఎవరూ అంగీకరించని కుష్టు రోగికి సేవ చేసి కుటుంబాన్ని ఆదుకునే పాత్ర . బేవార్సు తండ్రిని నిలేసేటప్పుడు , తాను తప్పుడు పనిచేయడం లేదని తండ్రికి రుజువు చేసేటప్పుడు గొల్లపూడితో ధీటుగా నటించింది . ఆ రెండు సీన్లనీ ప్రేక్షకులు కూడా మరచిపోలేరు .
ఈ పాత్రలతో పాటు మరో గొప్ప పాత్ర జయమాలినిది , ఆమె గేదెది . యన్టీఆర్ పోస్టర్లు తింటేనే పాలు ఎక్కువగా ఇస్తుంది . కొత్త రకం పాత్ర . సరదాగా ఉంటుంది . ఈ సినిమాలో జయమాలినికి ఫుల్ లెంగ్త్ ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది . ఇలాంటి పాత్రలు షావుకారు జానకికో , మనోరమకో , రమాప్రభకో లభిస్తూ ఉంటాయి . కాకపోతే ప్రేక్షకులకే డిజప్పాయింటుమెంట్ . జయమాలిని ఊపు డాన్స్ ఉండదు . అయితే ఏం ! జయమాలిని బాగా నటించింది .
విస్సు కధకు బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నాడు దర్శకుడు తాతినేని ప్రసాద్ . సినిమా స్లోగా సాగిపోతూనే ఉంటుంది . ఎక్కడా బోరించదు . నిర్మాత యస్ గోపాల్ రెడ్డి . అందరికీ తెలిసిన పేరే . సినిమా విజయానికి బాగా తోడ్పడింది గణేష్ పాత్రో డైలాగులు . మధ్య తరగతి మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో వాటికి తగ్గట్లు డైలాగులను రచించారు పాత్రో .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాగా హిట్టయ్యాయి కూడా . సినిమా ఐకానిక్ సాంగ్ మనిషి మనిషికీ ఓ చరిత్ర గురించి చెప్పే పనిలేదు . మరో పాట బుల్లి మీనా పుట్టినరోజున వచ్చే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది .
సిరులిచ్చే శ్రీలక్ష్మి చదువిచ్చే సరస్వతి పసుపు కుంకుమలిచ్చే పార్వతి పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది . సరదాగా సాగుతుంది మరో పాట . శనివారం మేము పనివారం ఆదివారం మేము ఆడవారం పాట సరదాగా సాగుతుంది . రొటీనుగా సినిమాల్లో ఉండే పార్కుల్లో పాటలు , డ్యూయెట్లు ఉండవు ఈ సినిమాలో . అవి లేనట్లుగా కూడా అనిపించదు ప్రేక్షకులకు .
ఆడవారి సెంటిమెంట్లను టచ్ చేస్తూ చాలా సన్నివేశాలు , డైలాగులు ఉంటాయి . మచ్చుకి ఒకటి . నాన్న వలన ఏం ప్రయోజనం అని తల్లిని అడుగుతూ ఉంటుంది కూతురు పూర్ణిమ . ముత్తయిదువుగా ఆమెకు చీరె ఇస్తుంది సుహాసిని . ఆ ముత్తయిదువు గుర్తింపు భర్త ఉండటం వలనే కదా అని తల్లి కూతురితో చెపుతుంది .
ఈ సినిమా నుండి ఆ రోజుల్లో ఒక take away డైలాగ్ ఉందండోయ్ . టట్టడా . ముఖ్యంగా దిగువ మధ్య తరగతి మొగుడు పెళ్ళాలు సినిమా చూసాక ఇంటికి వెళుతూ విసురుకుంటూ వెళతారు .
ఈ మిడిల్ క్లాస్ సినిమాలో ఇప్పటి తరం వాళ్ళకు అస్సలు తెలియని విషయం ఒకటి చెపుతా . రాంజీ తనకిష్టమైన అమ్మాయి ఫొటో చూడమని తన పర్స్ ఇస్తాడు . ఆ పర్సులో చిన్ని అద్దం ఉంటుంది . మా చిన్నప్పుడు పర్సుల్లో బుల్లి అద్దాలు ఉండేవి . ఇప్పటి వాళ్ళకు అస్సలు తెలియదేమో !
వేటూరి , రాజశ్రీలు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు . సుత్తి వీరభద్రరావు , రావి కొండలరావు , బాలకృష్ణ (అంజిగాడు) , ప్రభృతులు కనిపిస్తారు .
మంచి సినిమా . మిస్ కాకూడని సాదాసీదా సందేశాత్మక సినిమా . తరచూ ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది . యూట్యూబులో ఉంది . వాచ్ లిస్టులో పెట్టుకోతగ్గ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article