కథలో పెద్ద ట్విస్టులేమీ ఉండవు ప్రేక్షకుడిని అబ్బురపరిచేవి… అందరికీ తెలిసిన కథే, తెలిసిన క్లైమాక్సే… స్పాయిలర్ల గొడవ అస్సలు లేదు… ఎప్పుడో 2006లో నిజంగా జరిగిన కథే… సినిమాలో సోకాల్డ్ కమర్షియల్ దుర్వాసనలు కూడా ఏమీ కనిపించవు… వెగటు సీన్లు, వెకిలి పాటలు కూడా వినిపించవు… ఏదో ఒకటీరెండు పెద్దగా కనెక్ట్ కాని పాటలు మాత్రమే… పైగా ఏదో పాత కమల్ హాసన్ సినిమాలోని పాటను అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్‌గా వాడుకున్నారు…
తలతిక్క రొమాన్సులు, మన్నూమశానం ఏమీ లేదు… అసలు ఆ నటీనటులెవ్వరూ మనకు తెలియదు… మన తెలుగు సినిమాలా 100, 200, 300 కోట్ల ఖర్చు, బీభత్సమైన స్టార్ హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా లేవు… కుర్చీ మడతపెట్టిన బూతు పాటలు లేవు, అమెరికా దాకా కథను తీసుకెళ్లి అడ్డంగా చతికిలపడటమూ లేదు… జస్ట్, 20 కోట్లతో సినిమా తీశారు… 200 కోట్ల వసూళ్లు… మలయాళ ఇండస్ట్రీ సినిమాను ప్రేమిస్తుంది, కొత్తగా ఏం చూపాలి, ఎలా చూపాలనే మథనం బాగా జరుగుతుంది…
ఆ ప్రేక్షకులూ అంతే… కొత్తదనానికి పెద్ద పీట వేస్తారు… అసలు 50, 60 కోట్ల వసూళ్లు ఉంటేనే కేరళలో హిట్, 100 కోట్లు వస్తే సూపర్ హిట్… కానీ మంజుమ్మల్ బాయ్స్ అనే ఈ సినిమాకు ఏకంగా 200 కోట్లు వచ్చాయంటే ఏమనాలి..? అదే హైప్‌తో తెలుగులోకి వచ్చింది… ఈ లెక్కలే దానికి ప్రమోషన్… రోజుల తరబడీ టీవీ ప్రోగ్రాముల్లో, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో సోది కబుర్లు కూడా లేవు… అయితే మనవాళ్లకు నచ్చుతుందా..? సినిమాను బాగా ప్రేమించే ప్రేక్షకులకు, రివ్యూయర్లకు మాత్రం నచ్చింది… నచ్చుతుంది… మరి సగటు ప్రేక్షకుడికి..? ఇది అంత తేలికగా జవాబు దొరకని ప్రశ్న..!
Ads
ఎందుకంటే..? మలయాళ ప్రేక్షకుల అభిరుచికీ తెలుగు వాడి అభిరుచికీ నడుమ తేడా ఉంది… ఇది రియల్‌గా జరిగిన కథ… సగటు మలయాళ సినిమాలాగే స్లో కథనం… 11 మంది మిత్రుల అడ్వెంచర్ జర్నీలో ఒకడు డెవిల్స్ డెన్‌లోకి జారిపోయాక, ఒకసారి అందులో పడ్డవాడు మళ్లీ ప్రాణాలతో తిరిగి రాలేదని తెలిశాక సినిమాలో కాస్త వేగం పెరుగుతుంది… ఇంగ్లిషులో సర్వైవల్ డ్రామాలు బాగానే నడుస్తాయి… చాలా వచ్చాయి… తెలుగు, తమిళ, కన్నడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేం…
ఈ సినిమాలో ఆకట్టుకునేది నిజంగా జరిగిన సంఘటనను ఓ సినిమాకు అక్కరకొచ్చేలా స్క్రీన్ ప్లేను రాసుకుని, ఉన్నత టెక్నికల్ విలువలతో తెరకెక్కించడం… చూస్తున్నంతసేపూ మనల్ని కూడా ఆ డెన్‌లో కట్టిపడేయడం… నటీనటులందరూ బాగా చేశారు… ఫ్లాష్ బ్యాకులు, చిన్న చిన్న పాత్రలతో ఈ టీమ్‌కు లింకులు, మిత్రుడిని రక్షించుకోవడానికి ఈ మిత్రబృందం పడే ప్రయాస అన్నీ బాగా వచ్చాయి… ఎటొచ్చీ ఎంటర్‌టెయిన్‌మెంట్ మాత్రమే కోరుకునే తెలుగు వాడికి ఇది కనెక్ట్ కావడం ఎలా..?
నిజానికి అందరికీ తెలిసిన కథను ఎలాంటి పక్కదోవలూ పట్టించకుండా, ఉద్దేశపూర్వకంగా కమర్షియల్ దుర్గంధాల్ని నింపకుండా, స్ట్రెయిట్‌గా, సీరియస్‌గా కథను చెప్పడం, అదీ బోర్ రాకుండా ప్రజెంట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్… అందులో ఈ దర్శకుడు విజయం సాధించాడు… మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రఫీ, బీజీఎం, ఎడిటింగ్ కూడా… దిక్కుమాలిన గ్రాఫిక్స్ పేరిట వందల కోట్లు తగలేసే ఈమధ్య భారీ సినిమాలతో పోలిస్తే, ఇందులో టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ… మొన్న భ్రమయుగం… నిన్న ఆడుజీవితం… నేడు మంజుమ్మల్ బాయ్స్… వర్తమానంలో మలయాళ జెండా చాలా ఎత్తులో ఎగురుతోంది..!!
Share this Article