Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముందు చౌక ప్యాకేజీ చెకప్స్… తరువాత మీరే తిరుగుతారు హాస్పిటల్స్ చుట్టూ…

September 15, 2024 by M S R

మాన్సూన్ హెల్త్ చెకప్ డిస్కౌంట్ అట! హెల్త్ చెకప్ రోగం

పత్రికలు తిరగేస్తుంటే చిత్ర విచిత్రమైన ప్రకటనలు కనపడుతుంటాయి. అందులో భాష, భావం తెలుగే అయినా…తెలుగువారికి అర్థం కాకుండా రాస్తుంటారు కాబట్టి…తొంభై తొమ్మిది శాతం ప్రకటలను ఎవరూ చదవరు కాబట్టి…బతికిపోతుంటారు. చదివే ఒక శాతం మందికే వస్తుంది చిక్కు. అలా ఒక “మాన్సూన్ హెల్త్ చెకప్” ప్రకటన చేతిలో చిక్కుకున్నాను నేను.

తుపాకీ అంటూ ఉంటే వాడాలనిపిస్తుందని ఒక పరమ ప్రామాణిక సూత్రముంది. అలా హెల్త్ చెకప్ అంటూ చేయించుకుంటే రోగాలు వాటికవే వద్దన్నా బయటపడతాయన్నది వైద్య వ్యాపారంలో పరమ ప్రామాణిక సూత్రం. వైద్య పరీక్షల్లో “నార్మల్” అన్న కొలమానమే పెనుభూతం అని ఈ రంగంలో నిపుణులు దశాబ్దాలుగా చెబుతున్నారు. థైరాయిడ్, డి విటమిన్, బి విటమిన్ లాంటి “నార్మల్” కొలమానాల కోసం మన వెంపర్లాట వైద్య వ్యాపారులకు కాసుల పంట.

Ads

ఒక భౌగోళిక ప్రాంత వాతావరణం, ఆహారపుటలవాట్లు, శారీరక శ్రమ…ఇలా సవాలక్ష అంశాల ఆధారంగా ఉండే ఎగుడు దిగుళ్లను మనం “నార్మల్” కాకి లెక్కకు తీసుకురావడానికి అనవసరంగా మందులు వేసుకుంటూ ఉంటాం. వంద కోట్ల మంది వైద్య పరీక్షల కొలమానాలు “నార్మల్” పేరిట ఒకే కొలమానాల్లో ఉండాలనుకుంటే అప్పుడు మనం యంత్రాలం తప్ప మనుషులు కావడానికి వీల్లేదు.

ఆరోగ్యంగా ఉన్న కొంతమందిని పరిశీలించి బి పి , షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటి సవాలక్ష అంశాల్లో ఇది “నార్మల్” కొలమానం అని నిర్ణయిస్తారు. ఆ నార్మల్ కు ఏమాత్రం తక్కువైనా, ఎక్కువైనా మనకు రోగం ఉన్నట్లే లెక్కగడతారు. నీతి, నిజాయితీ, వృత్తిగత నైతిక విలువలు పాటించే ఏ కొందరో తప్ప మిగతావారందరికీ ఇక్కడే వేల కోట్ల, లక్షల కోట్ల వ్యాపారం దాగి ఉంది.

జీవితంలో ఏనాడూ ట్రెడ్ మిల్ చూడని మనిషిని గుండె పరీక్ష కోసం ట్రెడ్ మిల్ ఎక్కించి తొక్కు అన్నారనుకుందాం. కచ్చితంగా ఆందోళనలో గుండె వేగం పెరుగుతుంది. అదప్పుడు నార్మల్ గా ఉండదు. అబ్ నార్మల్ అయి తీరుతుంది. వెను వెంటనే గుండెను తెరిచి కుట్లు, అల్లికలు, అతుకులు, బైపాస్ లు, స్టెంట్లు వేయండి ప్లీజ్ అని మనమే డాక్టర్ల వెంట పడతాం.

మనిషి శరీర నిర్మాణమే ఒక అద్భుతం. లోలోపల మహా యుద్ధాలు చేసుకుంటూ కోట్ల కణజాలం ప్రతిక్షణం చస్తూ…కొత్తగా పుడుతూ మనల్ను బతికించే…ముందుకు నడిపే అనన్యసామాన్యమైన ఆటోమేటిక్ వ్యవస్థ శరీరంలో ఉంటుంది. మనం నిద్రపోయినా తను నిద్ర పోకుండా నిరంతరం చెడు రక్తాన్ని శుభ్రం చేసి…మంచి రక్తాన్ని తోడిపెట్టే గుండె ఒక అద్భుతం. డస్ట్ బిన్ కంటే నీచంగా నానా చెత్తను మనం లోపలికి వేస్తే…దంచి…పిండి…మెలిపెట్టి…వడకట్టే జీర్ణ వ్యవస్థ ఒక అద్భుతం.

కనుగుడ్డుకు- రెప్పకు మధ్య తడి లూబ్రికెంట్ ఒక అద్భుతం. రోగనిరోధక శక్తి ఒక అద్భుతం. మనకు చెప్పకుండా శరీరమే తనను తాను ప్రతిక్షణం బాగు చేసుకుంటూ ఉంటుంది. దాని అంతు చూసేలా మనం పగబట్టి హింసిస్తున్నా…అది మనకు చేసే మంచి తెలుసుకుంటే…నోట్లో మాట పెగలదు!

మనం ఆరోగ్యంగా ఉన్నామన్న ధైర్యం మనలో మిగిలి ఉంటే…
మనలో రోగనిరోధక శక్తి బాగానే ఉందన్న నమ్మకం మనకు మిగిలి ఉంటే…
చిన్నా చితకా సమస్యలొచ్చినా…ఒక పూట పస్తులుండి…విశ్రాంతి తీసుకుని మర్నాడు నూతనోత్సాహంతో లేచి తిరిగిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని…మనల్ను మనమే ఓదార్చుకుంటే…
ఇక డాక్టర్లెందుకు? వేల, లక్షల కోట్ల పెట్టుబడులతో పెట్టిన ఏడు నక్షత్రాల ఆసుపత్రులెందుకు? అధునాతన వైద్య పరీక్షల కేంద్రాలెందుకు? హెల్త్ టూరిజం విహారాలెందుకు? రాని రోగానికి ఏటేటా కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు?

గోరు చుట్టుపై రోకటి పోటులా…
చెంప దెబ్బకు తోడు గోడ దెబ్బలా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో డాక్టర్లుకాని డాక్టర్లు చెప్పే చిట్కాలు, వీడియోలు చూస్తూ ఇళ్లల్లో గుండెను కోసి కుట్లు వేసి కట్లు కూడా కట్టే ఔత్సాహికులకు కూడా కొదవ లేదు.

పదేళ్లు వైద్యవిద్య చదివినవారు మౌనవ్రతంలో ఉంటే…
యూ ట్యూబులో వీడియోలు చేయగలిగినవారు డాక్టర్లకు శస్త్ర చికిత్సలు నేర్పుతున్నారు. డాక్టర్ ఏమి చెప్పినా గూగుల్లో చూసుకుని ఆ డాక్టరు స్థాయిని, నిజాయితీని లెక్కగట్టే రోగులే ఇప్పుడు తెలివైనవాళ్లమని అనుకుంటూ…తమను తామే అభినందించుకుంటున్నారు. తమ వైద్య స్పృహకు, అంతులేని తమ వైద్య విజ్ఞానికి తామే మురిసిపోతున్నారు.

రోగం లేకపోయినా రోగం ఉన్నట్లు అనిపించడం;
కన్ను అదిరితే కంటికి శస్త్ర చికిత్స చేయాలని రోగే తన వేలుతో తన కంటినే పొడుచుకోవడం;
అవసరం ఉన్నా లేకపోయినా టోటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకోవడం;
శాంపుళ్లు తీసుకోవడానికి ఇంటికే వస్తున్నారు కాబట్టి…తరచుగా సకల రోగ పరీక్షలు చేయించుకోవడం…
ఆధునిక జీవన విధానం.

వైద్యవ్యాపారం చేసేవారి ఉచ్చులో చిక్కుకుంటున్నది రోగులు కాదు. ఏ రోగం లేనివారు. మనోరోగానికి మందు లేదు. ఈ మాయ రోగానికి అసలు మందే లేదు.

అన్నట్లు-
వర్షాలు పడే వేళ మనం 31 రకాల వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలట. మామూలుగా అయితే వీటికి పదిహేడు వేల రూపాయల ఖర్చు. ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో ఏడున్నర వేలకే మాన్సూన్ స్పెషల్ హెల్త్ చెకప్ కార్నివాల్లో చేస్తారట. ఇది కదా జాక్ పాట్ అంటే! ఇది కదా మనం ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఇది కదా నక్కను తొక్కడమంటే! ఇది కదా శుక్రమహర్దశ అంటే! ఇది కదా ఆడబోయిన తీర్థం ఎదురుపడ్డం అంటే! ఇది కదా వెతకబోయిన తీగ మెడకు చుట్టుకోవడమంటే!

“పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం…పోదాం…పైపైకి!

రోగ ప్రపంచం
మిథ్యా ప్రపంచం
వ్యాపార ప్రపంచం పిలిచింది!

కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హృదయస్పందన వణుకుతూ-
పదండి పోదాం

వినబడలేదా
వైద్య ప్రపంచపు కుతంత్రం?
దారి పొడవునా గుండెనెత్తురులు
శాంపుల్ ఇస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ…
పేటలు కడచీ…
కోటలన్నిటిని దాటండి!
రక్తం
యూరిన్
స్టూల్
ఎడారులా మనకడ్డంకి?

పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాం… పోదాం…పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
సోమరులారా! రారండి!

నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! చావండి!

హరోం! హరోం హర!
హర! హర! హర! హర! హర!
హరోం హరా! అని కదలండి!
రోగ పరీక్ష ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
రోగవేగమున ప్రసరించండి!
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ పరీక్ష కేంద్రాలకు ఉరకండి!”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions