.
Mrityunjay Cartoonist…… భానుడి భగభగలకు చెమటతో తడిసిన చేతులతో పేపరందుకొని చదువుతుండగా ‘ 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు శ్యాం బెనెగల్ ‘ మంథన్ ‘ సినిమా ఎంపిక వార్త చదివి సిన్మా స్టార్ట్ చేసా…
గుజరాత్ లోని ఓ మారుమూల పల్లెటూరు. .పెద్ద కూతతో రైలు వొస్తున్నది. సింగర్ ప్రియా సాగర్ ‘ ఓ నది ఒడ్డున మా ఊరుంది, కోకిలలు పాడుతుండగా, నెమళ్ళు నాట్యమాడుతుండగా, ఆవులు మర్రి చెట్టు నీడన మేస్తుంటాయి.. పాలు పొంగి పొర్లుతుంటాయి.. మా ఊరికి రాకుండా పోవొద్దు.. రండి..’ అంటూ పాడుతున్నది..
ఆ రైలు నుంచి ఒక ప్రయాణికుడు (గిరీష్ కర్నాడ్) దిగుతున్నాడు.. ఆయనతో మనమూ ఆ ఊళ్ళొకి వెళుతున్నాము.. ఆ ఊళ్ళొ పేద పాల రైతుల చుట్టూ కథతో పాటు మనమూ తిరుగుతున్నాము..
Ads
పాల డబ్బాల చుట్టూ తిరిగే కులరాజకీయాలు, ఆధిపత్య పోరు.. సహకారసంఘం పద్ధతిలో సాయం చేయాలనుకునే గిరీష్ కర్నాడ్, మొగుడు వదిలేసి వెళ్ళిపోయిన స్మితా పాటిల్, ఆత్మాభిమానంతో రగిలిపోయే తక్కువ కులం నసీరుద్దిన్ షా,, తేనెపూసిన కత్తిలా అమ్రిష్ పురి.. వీళ్ళంతా పరిచయం అవుతారు. అసలక్కడ ఏం జరిగిందో ఆ ఊరెళ్ళి చూసి రావల్సిందే.. పాల సంద్రం లో మునిగి తేలిపోవాల్సిందే.. సిన్మా ముగిసేసరికి నా ఒంటిపై స్వేదబింధువుల స్థానంలో శ్వేత బింధువులు.. పాల రైతులకు పాలాభిషేకం చేసిన సినిమా…
కో ఆపరేటివ్ పద్ధతిలో పాలు సేకరించి మార్కెటింగ్ చేసే గుజరాత్ శ్వేతవిప్లవ పితామహుడు, ఆధునిక భారతానికి ఆద్యుల్లో ఒకరైన ‘ వర్గీస్ కురియన్ ‘ (అమూల్ బ్రాండ్) రిక్వెస్టుతో శ్యాం బెనెగల్ గుజరాత్ రైతుల నుంచి తలా రెండు రూపాయల చొప్పున సేకరించి పది లక్షలతో ‘ మంథన్ ‘ తీశాడు.. మంథన్ అనగా చిలకడం…
ఈ సిన్మా చూడడానికి మీరు కేటాయించే సమయం నేలపాలు కానేకాదు.. మీరు అబాసుపాలు కూడా కారు.. సిన్మా చూసాక బాధతో ఏమి చేయాలో పాలుపోవడం లేదా? అయితే మీరూ ఓ రివ్యూ రాయండి…
( కొన్నేళ్ల క్రితం నేను ముంబాయి వెళ్ళి శ్యాంబెనెగల్ ను కలిసినప్పుడు తనతో అరరోజు మంతనాలు కొట్టాను. కనీసం ఒక్క ముచ్చట కూడా ‘ మంథన్ ‘ గురించి లేకుండా ముగించాను గదా.. అయ్యో.. ఏటిగట్టున గిరీష్ కర్నాడ్ నిలబడగా పాల నురగల్లాంటి నీళ్ళల్లో కాళ్ళు ఊపుతూ స్మితా పాటిల్ గిరీష్ కర్నాడ్ ని ‘ నీకు పెళ్ళయ్యిందా? ‘ అనడిగినప్పుడు తన గుజరాతీ స్టైల్ మిర్రర్ స్టడ్డెడ్ బ్లౌజు మీద సూర్యకాంతి తో తళుక్కున మెరిసే రెండు మెరుపులు యాదృచ్చికమా? లేదా ఆ షాట్ కోసం వందలాది రీటేకులు గాని తీసుకున్నారా? అని అడగకుండా ఎట్లా తిరిగొచ్చాడో ఈ అజ్ఞాన కుర్రకుంక.. ఛీ.. ఛీ..!) – మృత్యుంజయ్
Share this Article