… 33 ఏళ్ల పాటు కేరళలోని Congregation of Mother Carmel (CMC)లో నన్‌గా ఉన్న సిస్టర్ జెస్మే ఆ వ్యవస్థను ‘Mafia, with a few Good Goons’ అని వర్ణించి కేరళ క్యాథలిక్ చర్చిల్లో జరిగే లైంగిక వేధింపులు, మోసాల గురించి ‘Amen – Autobiography of a Nun’ అనే పుస్తకం రాశారు. కేరళ క్రైస్తవ సమాజం ఈ పరిణామంతో నివ్వెరపోయి ఆమె మీద బోలెడు ఆరోపణలు చేసినా వెనక్కి తగ్గలేదు. చంపుతామని బెదిరించినా పట్టించుకోక ఆ పుస్తకాన్ని హిందీ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లోకి అనువాదం చేశారు.
… కన్నడ రచయిత, ఉద్యమకారుడు యోగేష్ కుమార్ ‘దుంది’ అనే నవల రాసి విడుదల చేయబోతే అతివాదులు దాన్ని అడ్డుకున్నారు. నవలలో వినాయకుడిని తప్పుగా చూపించాడన్న కోపంతో కోర్టుకు వెళ్లి ఆయన్ని అరెస్టు చేయించారు. బెయిల్ మీద బయటకు వచ్చి దేవనగేరెలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఆయన ముఖానికి నల్ల నూనె పూసి అవమానించారు. చంపేస్తామని వచ్చిన బెదిరింపులకు లెక్కలేదు.
… కె.సెంథిల్ మల్లర్ అనే తమిళ రచయిత ‘మీండెళుం పాండియార్ వరలారు’, ‘వెందర్ కులత్తిన్ ఇరుప్పిడం ఎదు?’ అనే రెండు పుస్తకాలు రాసి ‘మల్లర్’ అనే దళిత వర్గమే ఒకనాడు పాండ్య రాజ్యాన్ని పాలించిందని చెబితే తమిళనాడు ప్రభుత్వం ఆ పుస్తకాలను నిషేధించింది. ఆయన హైకోర్టులో పోరాడగా ఆ పుస్తకాలు చదివిన కోర్టు ‘దేశ సార్వభౌమతను భంగపరిచే వేర్పాటువాదాన్ని ప్రభుత్వం అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది’ అని అభిప్రాయపడి కొన్ని సవరణలతో ఆ పుస్తకాల మీదున్న నిషేధాన్ని ఎత్తివేసింది.
Ads
… మంటో (2018) సినిమా మొదలైన కొంతసేపటికి ఒక హోటల్లో మంటో, ఆయన భార్య సాఫియా, రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి, మరో ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. మంటో రాసిన కథకు కోర్టు కేసులు, ఇస్మత్ రాసిన ‘లిహాఫ్’ కథలోని Lesbianism అంశంపై కోర్టు సమన్లు.. అవన్నీ ప్రస్తావనకు వస్తాయి. అయినా అదేదో పెద్ద ప్రాణాంతకమైన విషయంలా కాకుండా అతి మామూలుగా మాట్లాడతారు. ఎంత బాగుంటుందో ఆ సన్నివేశం. అలాంటి సీన్ రాసినందుకు దర్శకురాలు నందితాదాస్‌కి జోహార్! ఆ సీన్ గమనిస్తే ఈ కాలం కన్నా ఆ కాలంలో ఎంత ధైర్యంగా రాసేవారా అనిపిస్తుంది.
… రచయితలపై రాళ్లు వేయడానికి అన్ని కాలాల్లోనూ కొందరు జనాలు సిద్ధంగా ఉంటారు. వాళ్లు రాళ్లు వేసేంత బలమైన అంశాలు ధైర్యంగా మనం రాస్తున్నామా అనేది ప్రశ్న… విశీ
Share this Article