Subramanyam Dogiparthi…. ఎంతటి పాషాణ హృదయుడయినా , కర్కశుడయినా సినిమా చూసేటప్పుడు కళ్ళు చెమ్మగిల్లాల్సిందే . శారదని ఊర్వశి శారదను చేసిన సినిమా . శారద నట విశ్వరూపం 1969 లో గాంధీ శత జయంతి రోజున విడుదలయిన ఈ సినిమాలో . ప్రపంచ సినీ రంగ చరిత్రలో ఒకే కధ ఆధారంగా తీయబడిన నాలుగు భాషల సినిమాలలో నటించిన ఏకైక నటి శారద . మొదట మళయాళం , తర్వాత తెలుగు తమిళం హిందీ భాషలు . వాణిశ్రీ ప్రేమ నగర్ మూడు భాషల్లోనే నటించింది .
కోటీశ్వరుడి కూతురుగా , మానవత్వం కల తండ్రి కార్మికుల కోసం భాగస్తుడితో గొడవపడి మోసగించబడి, సంపదనంతా పోగొట్టుకున్న తండ్రి కూతురుగా , ప్రేమించిన వాడు మోసగిస్తే , మరో నిజాయితీపరుడయిన కార్మిక నాయుడిని పెళ్లి చేసుకుని , కామందుల కుట్రలో భర్త హత్యకు గురయ్యాక , పేదరికంతో పిల్లలు దొంగతనానికి పాల్పడుతుంటే , సామూహిక మరణాలకు ప్రయత్నించి , పిల్లలను హత్య చేసిందనే నేరారోపణతో కోర్ట్ బోనెక్కి , స్నేహితురాలి చేతిలో మరణించే పాత్రలో శారద అద్భుతంగా నటించింది . మరే ఇతర నటి ఇంత గొప్పగా నటించగలదా అని అనిపిస్తుంది .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హిట్ . తూరుపు సింధూరపు మందారపు వెన్నెలలో ఉదయరాగం , పాపాయి నవ్వాలి పండగే రావాలి , హాలిడే జాలిడే పాటలు శ్రావ్యంగా ఉంటాయి . మహాకవి శ్రీశ్రీ అరుణ పతాకం ఎగిరింది కార్మిక లోకం గెలిచింది , మారాలి మారాలి మనుషులు మారాలి ఎర్ర పాటలు బాగుంటాయి . భూమాత ఈనాడు పాటలో శారద , కాంచనల శాస్త్రీయ నృత్యం కన్నుల విందుగా ఉంటుంది . చీకటిలో కారు చీకటిలో , అమ్మా కన్ను మూసావా అనే రెండు విషాద గీతాలు గుండెల్ని పిండేస్తాయి .
Ads
శారద , కాంచన , శోభన్ బాబు , హరనాథ్ , గుమ్మడి , నాగభూషణం , మంజుల , కె వి చలం , రావి కొండలరావు ప్రభృతులు నటించారు . ప్రఖ్యాత కేరెక్టర్ ఆర్టిస్ట్ రావు గోపాలరావుకి పేరుకి ఇది మూడో సినిమా అయినా , ఈ సినిమాలోని యూనియన్ లాయర్ పాత్ర గుర్తింపుని తెచ్చింది . కె రాఘవేంద్రరావు , కోదండరామిరెడ్డి ఇద్దరూ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్లుగా పనిచేసారు .
ఉ సినిమాలో నిర్మలమ్మ పాత్ర , డైలాగులు పేలిపోయాయి . ఊరంత అయ్య లోకువ , అయ్యకు అమ్మ లోకువ డైలాగ్ , ఊరకూరకనే అలిగి కూతురు ఇంటికి కొడుకు ఇంటికి ప్రదక్షిణలు చేసే పాత్ర మన ఇళ్ళల్లో కనిపించే ముసలమ్మలు గుర్తుకొస్తారు .
ఈ సినిమాలో హిట్ జోడీ శారద , శోభన్ బాబులు ఎన్నో సినిమాలలో జైత్రయాత్ర కొనసాగించారు . మధ్య వయసులో ఏవండీ ఆవిడొచ్చిందితో సహా . 1969 లో వచ్చిన ఈ ఎర్ర సినిమా తరహా ఎర్ర సినిమాలను కొన్నాళ్ళు మాదాల రంగారావు , వెంకటేశ్వరరావు , టి కృష్ణ లాగించారు . ప్రేక్షకులు మారారు . మధ్య తరగతి మిధ్యా లోకంలో తేలిపోయే కాలమొచ్చింది తర్వాత తర్వాత .
Share this Article