అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే… మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు… దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటమే బతుకు… ఉద్యమ నిర్మాణమే లక్ష్యం… అంతుచిక్కని వ్యాధితో అడవుల్లో మరణించాడనే వార్త టీవీ చానెళ్లలో కనిపిస్తోంది… వీటి ధ్రువీకరణ సంగతేమిటో గానీ… ఆయన మీద గతంలో బొచ్చెడు ఫేక్ వార్తలు అనేకసార్లు… అదుగో అరెస్టయ్యాడు, ఇదుగో మరణించాడు, అదుగదుగో పోలీస్ బలగాలు చుట్టుముట్టి మట్టుబెట్టాయి, లొంగుబాటకు రెడీ… ఇలాంటి బోలెడు తప్పుడు వార్తలు గతంలో చదివాం, విన్నాం… ఇప్పుడు మాత్రం ఆయన మరణం నిజమే అంటున్నారట పోలీసులు… అంతుచిక్కని వ్యాధి ఏమీ కాదు, ఆయనకు బోన్ కేన్సర్ అని చాలారోజులుగా పోలీసువర్గాలు కూడా వింటున్నదే… బాగా ఇన్‌యాక్టివ్ అయ్యాడనీ లొంగిపోయిన నక్సలైట్ల ద్వారా వస్తున్న సమాచారమే… బహుశా అదే ఆయన్ని బలగొన్నదేమో… ఇన్నేళ్ల విప్లవ బాటలో రాజ్యం తుపాకీ తూటాకు దొరకకుండా అనారోగ్యానికి దొరికిపోయాడు..! ఈ వార్తలే గనుక నిజమైతే మావోయిస్టు పార్టీ ఓ పెద్ద తలకాయను పోగొట్టుకున్నట్టే..!
RK… ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అప్పట్లో నార్త్ తెలంగాణ జోన్ లో కీలకంగా వ్యవహరించిన సుదర్శన్‌రెడ్డి అలియాస్ ఆర్కే… పోరాట దళాల్ని సమర్థంగా నిర్మాణం చేసిన ఆర్కే పేరు అప్పట్లో హడల్… అప్పట్లో వరంగల్ ఈనాడు స్టాఫర్‌గా నేను తన వార్తల్ని విస్తృతంగా కవర్ చేసిన రోజులున్నయ్… తరువాత ఈ ఆర్కే… ఈయన పేరు బలంగా వినిపించింది వైఎస్ఆర్ ప్రభుత్వ కొత్తలో… నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించింది అప్పటి ప్రభుత్వం… అప్పట్లో పీపుల్స్‌వార్ ఈ చర్చల అనంతరమే బీహార్ మావోయిస్టు పార్టీని విలీనం చేసుకుని, మరింత బలాన్ని ప్రోది చేసుకుంది… చర్చల కోసం ఆయన ఆయుధం వదిలేసి, మామూలు దుస్తుల్లో నల్లమల నుంచి బయటికి వచ్చాడు… గుర్తుంది, అప్పుడు ఈనాడు స్టేట్ బ్యూరోలో పనిచేసేవాడిని… చర్చల కోసం బయటికి రాగానే, ఈ లీడర్లు పాల్గొనేలా గుత్తికొండబిలంలో ఓ పెద్ద మీటింగు ఆర్గనైజ్ చేశారు నక్సలైట్లు… ఆ కవరేజీ కోసం నేను, పొలిటికల్ బ్యూరో దిలీప్‌రెడ్డి వెళ్లాం హైదరాబాద్ నుంచి… నల్లమల నుంచి ఆర్కే తదితరులు బయటికి వచ్చే సంఘటనల్ని కవర్ చేయడానికి జనరల్ బ్యూరో ఎల్వీకే రెడ్డి వెళ్లాడు… మేం గుత్తికొండ బిలం వెళ్లేటప్పటికీ అక్కడ ఏమీ సందడి లేదు, ఏమీ మాట్లాడేవాళ్లు లేరు… సహజమే… కానీ మీటింగు సమయానికి బిలబిలమంటూ వేలాది మంది జనం…
Ads
ఆ మీటింగు కవరేజీ చూసుకుని, అక్కడి నుంచి పిడుగురాళ్ల లోకల్ ఆఫీసుకు వెళ్లి, అక్కడి నుంచి వార్తలు పంపించి, ఏ తెల్లవారుజామునో హైదరాబాద్ చేరుకున్నాం… మీటింగు దగ్గర మఫ్టీ పోలీసుల నిఘా, సమాచార సేకరణ… నక్సల్స్ నేతలు ఊహించనిదేమీ కాదు… వాళ్లు మళ్లీ అడవుల్లోకి చేరేవరకూ ఎవరికీ ఏ ఆపదా వాటిల్లకుండా ప్రభుత్వమే బాధ్యత వహించింది… రెండు వైపులా కాల్పుల విరమణ… హైదరాబాద్ జర్నలిస్టులందరూ దాదాపుగా అప్పుడే ఆయన్ని చూడటం… అంతకుముందు ఓసారి ఏవేవో ప్రకాశం, గుంటూరు జిల్లాల గ్రామీణ వార్తలు కవర్ చేసుకుంటూ, అనుకోకుండా ఆయన సొంతూరికి వెళ్లాను… ఆయన ఇంటిపై, ఊరిపై, సన్నిహితులపై కొనసాగుతున్న పోలీస్ నిఘా మీద ఓ వార్త కూడా కవర్ చేసినట్టు గుర్తుంది… ఇప్పుడు ఆర్కే మరణం అని వినగానే ఇవన్నీ గుర్తొచ్చాయి… ప్రత్యేకించి ప్రభుత్వంతో చర్చలు… రాజ్యాధికారం కోసం సాయుధ పోరాటం చేసే మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికీ నడుమ సయోధ్య కుదురుతుందనీ, చర్చలు ఫలిస్తాయనీ ఎవరికీ నమ్మకం లేదు… కానీ ఎవరి ఎత్తుగడలు వాళ్లవి… ఆ చర్చల కవరేజీ అప్పటి ప్రతి జర్నలిస్టుకూ గుర్తుండిపోయే సందర్భం… ఇవన్నీ గుర్తొచ్చి.., ఈ త్యాగాలు, ఈ పోరాటాల ఫలితం ఏమిటీ అనే ఓ చిక్కు ప్రశ్న గుర్తొచ్చి, ఎక్కడో కలుక్కుమనే పాత కవరేజీల జ్ఙాపకాలు…!!
Share this Article